Kiran Walia
-
కేజ్రీవాల్ అర్హతపై హైకోర్టు నోటీసులు
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నివసించే కేజ్రీవాల్.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారంటూ ఆయనపై పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకురాలు కిరణ్ వాలియా చేసిన ఫిర్యాదు మేరకు కోర్టు ఈ నోటీసు ఇచ్చింది. కేజ్రీవాల్, ఇతరులు దీనికి సమాధానం ఇవ్వాలంటూ కేసు విచారణను జస్టిస్ విభు బఖ్రు ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేశారు. అరవింద్ కేజ్రీవాల్ తన చిరునామాను తప్పుగా పేర్కొన్నారని, ఢిల్లీ ఓటరుగా ఉండేందుకే ఆయనిలా చేశారని ఆరోపిస్తూ న్యూఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ వాలియా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందువల్ న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని ఆమె కోరారు. ఢిల్లీలోని బీకే దత్ కాలనీలో తాను శాశ్వత నివాసినంటూ ఎన్నికల కమిషన్‌కు కూడా కేజ్రీవాల్ తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆమె ఆరోపించారు. -
‘న్యూఢిల్లీ’లో తేలనున్న అరవింద్ భవిత్యం
సాక్షి, న్యూఢిల్లీ: న్యూఢిల్లీ నియోజకవర్గ ఓటర్లు మరోమారు ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి కేజ్రీవాల్ రాజకీయ భవితవ్యాన్ని తేల్చనున్నారు. గత ఎన్నికల్లో షీలాదీక్షిత్‌ను భారీ మెజారిటీతో ఓడించిన కేజ్రీవాల్...ఇక్కడినుంచి రెండోసారి పోటీచేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి మాజీ మంత్రి కిరణ్‌వాలియాను నిలబెట్టగా, బీజేపీ తరఫున డూసూ మాజీ అధ్యక్షురాలు నుపుర్‌శర్మ పోటీ చేస్తున్నారు. ప్రభుత్వోద్యోగులు ఎక్కువగా నివసించే ఈ నియోజకవర్గంలో పదవీ విరణమ వయసు అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుని కేజ్రీవాల్ ప్రచారం చేస్తున్నారు. ఇక నుపుర్ శర్మ... అభివృద్ధి, మహిళాభద్రత, నీటి కొరత, విద్యుత్ తదితర సమస్యలను ప్రధానాంశాలుగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ వాలియా తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని వివరించడమే కాకుండా కేజ్రీవాల్ వైఫల్యాలను వేలెత్తి చూపుతున్నారు. వీఐపీలు, ప్రభుత్వోద్యోగులకు నెలవైన న్యూఢిల్లీలో... మిగతా నియోజకవర్గాల మాదిరిగా విద్యుత్, తాగునీరు, మౌలిక సదుపాయాల కొరత సమస్యలు కనిపించవు. అవినీతి, ధరల పెరుగుదల, మహిళాభద్రత వంటి అంశాలే ఇక్కడ కీలకంగా మారాయి. 2.65 లక్షల మంది జనాభా కలిగిన ఈ నియోజక వర్గంలో దాదాపు సగం మందికి ఓటు హక్కు లేదు. 1.36 లక్షల మంది ఓటర్లున్న న్యూఢిల్లీలో 37 శాతం మంది ప్రభుత్వోద్యోగులు, 20 శాతం పంజాబీలు, 18 శాతం షెడ్యూల్డ్కులాలు, 10 శాతం వైశ్యులు, 10 శాతం మంది బ్రాహ్మణులతోపాటు ఒక శాతం మంది శాతం మురికివాడవాసులుకూడా ఉన్నారు. -
కేజ్రీవాల్‌పై పోటీకి సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా పోటీచేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు మాజీ మంత్రి కిరణ్ వాలియా ప్రకటించారు. ఆమె మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తనకు పోటీచేయమని బాధ్యత అప్పగించినట్లయితే స్వీకరించడానికి సుముఖంగా ఉన్నానని ఆమె చెప్పారు. కిరణ్ వాలియా అభ్యర్థిత్వాన్ని గురించి కేజ్రీవాల్ వ్యాఖ్యానిస్తూ.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడ నుంచైనా పోటీచేయవచ్చన్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్‌ను ఓడించే సత్తాగల నేతనే బరిలోకి దింపుతామని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థుల రెండవ జాబితా బుధవారం వెలువడనుందని తెలియడంతో ఎవరెవరికి ఎక్కడినుంచి పోటీచేయడానికి టికెట్ లభిస్తాయన్న ఊహాగానాలు ఉపందుకున్నాయి. కిరణ్ వాలియాకు న్యూఢిల్లీ, మాజీ స్పీకర్ యోగానంద్ శాస్త్రికి మాలవీయనగర్, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీకి గ్రేటర్ కైలాష్, చౌదరి ప్రేమ్ సింగ్‌కు అంబేద్కర్‌నగర్ టికెట్ లభించవచ్చని అంటున్నారు.గాంధీనగర్ నుంచి ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ పోటీచేయడం అనుమానాస్పదమేనని, ప్రచార బాధ్యతల కారణంగా ఆయన ఎన్నికల్లో పోటీచేయకపోవచ్చని అంటున్నారు. గాంధీనగర్ నుంచి తన భార్యను ఎన్నికల బరిలోకి దింపనున్నట్లు వచ్చిన వార్తలను లవ్లీ ఖండించారు. మాజీ మంత్రి రమాకాంత గోస్వామి ఎన్నికల్లో పోటీచేయడానికి నిరాకరించారు. అనారోగ్యం కారణంగా పోటీచేయలేమని రమాకాంత్ గోస్వోమి, రాజేష్ జైన్ తెలిపినపార్టీవర్గాలు పేర్కొన్నాయి. -
కాంగ్రెస్ అభ్యర్థుల్లో మహిళలు ఆరుగురే
సాక్షి, న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మహిళే... దేశ రాజధానిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి మహిళే... అంటూ తమ పార్టీ గురించి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో మాత్రం మహిళలకు అంతగా ప్రాధాన్యతనిచ్చినట్లు కనిపించడంలేదు. 70 మంది అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ జాబితాలో కేవలం ఆరుగురు మాత్రమే మహిళలున్నారు. అందులో ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, మంత్రి కిరణ్ వాలియా, ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ బర్ఖాసింగ్ ముగ్గురూ పాతవారే కాగా మరో ముగ్గురిని మాత్రమే కొత్తగా బరిలోకి దించుతోంది. ఈసారి రాగిణీ నాయక్, అమతా ధవన్, ధన్వంతీ చండీలాలు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. రాగిణీ నాయక్, అమతా ధవన్ ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ మాజీ అధ్యక్షులు కాగా ధన్వంతీ చండీలా రాజోరీ గార్డెన్ శాసనసభ్యుని సతీమణి. తొలి జాబితాలో మొదటి ముగ్గురి పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ చివరి ముగ్గురి పేర్లను మలి జాబితాలో చేర్చింది. వీరిలో ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ న్యూఢిల్లీ నుంచి, కిరణ్ వాలియా మాలవీయనగర్ నుంచి, బర్ఖాసింగ్ ఆర్కెపురం నుంచి పోటీచేస్తున్నారు. షీలాదీక్షిత్‌కు వ్యతిరేకంగా బీజేపీ తరఫున విజేంద్ర గుప్తా, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున అరవింద్ కేజ్రీవాల్ పోటీచేస్తున్నారు. కిరణ్ వాలియా బీజేపీ అభ్యర్థి ఢిల్లీ మాజీ మేయర్ ఆర్తీ మెహ్రాతో తలపడుతున్నారు. బర్ఖాసింగ్కు ఆమ్ ఆద్మీ పార్టీ నేత షాజియా ఇల్మీతో తలపడనుండగా యువనేత రాగిణీ నాయక్ జనక్‌పురి నుంచి పోటీ చేస్తారు. ఆమె బీజేపీ సీనియర్ నేత జగ్దీశ్ ముఖీతో పోటీపడుతున్నారు. మరో యువనేత అమతా ధవన్ తిలక్‌నగర్ నుంచి పోటీ చేస్తూ ఓపి బబ్బర్ తనయుడు రాజీవ్ బబ్బర్‌కు ప్రత్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తిలక్‌నగర్ టికెట్ పాప్ సింగర్ దలేర్ మెహందీకి ఇస్తారన్న ఊహాగానాలు వినిపించినప్పటికీ ఆయనకు మొండిచేయి ఎదురైంది. అమతా ధవన్ మున్సిపల్ కౌన్సిలర్ కూడా. ఇక రాజోరీ గార్డెన్ టికెట్ ధన్వంతీ చండీలాకు లభించింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ధన్వంతీ భర్త దయానంద్ చండీలా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దయానంద్ చండీలాపై తీవ్ర నేరారోపణలు ఉండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ ఆయనకు మాత్రం టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడా సీటును ఆయన భార్యకే కేటాయించారు. ధన్వంతీ అకాలీదళ్ అభ్యర్థి శ్యామ్ శర్మతో తలపడనున్నారు.