కేజ్రీవాల్ అర్హతపై హైకోర్టు నోటీసులు
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నివసించే కేజ్రీవాల్.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారంటూ ఆయనపై పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకురాలు కిరణ్ వాలియా చేసిన ఫిర్యాదు మేరకు కోర్టు ఈ నోటీసు ఇచ్చింది. కేజ్రీవాల్, ఇతరులు దీనికి సమాధానం ఇవ్వాలంటూ కేసు విచారణను జస్టిస్ విభు బఖ్రు ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేశారు.
అరవింద్ కేజ్రీవాల్ తన చిరునామాను తప్పుగా పేర్కొన్నారని, ఢిల్లీ ఓటరుగా ఉండేందుకే ఆయనిలా చేశారని ఆరోపిస్తూ న్యూఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ వాలియా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందువల్ న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని ఆమె కోరారు. ఢిల్లీలోని బీకే దత్ కాలనీలో తాను శాశ్వత నివాసినంటూ ఎన్నికల కమిషన్కు కూడా కేజ్రీవాల్ తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆమె ఆరోపించారు.