సాక్షి, న్యూఢిల్లీ:
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మహిళే... దేశ రాజధానిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి మహిళే... అంటూ తమ పార్టీ గురించి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో మాత్రం మహిళలకు అంతగా ప్రాధాన్యతనిచ్చినట్లు కనిపించడంలేదు. 70 మంది అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ జాబితాలో కేవలం ఆరుగురు మాత్రమే మహిళలున్నారు. అందులో ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, మంత్రి కిరణ్ వాలియా, ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ బర్ఖాసింగ్ ముగ్గురూ పాతవారే కాగా మరో ముగ్గురిని మాత్రమే కొత్తగా బరిలోకి దించుతోంది. ఈసారి రాగిణీ నాయక్, అమతా ధవన్, ధన్వంతీ చండీలాలు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. రాగిణీ నాయక్, అమతా ధవన్ ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ మాజీ అధ్యక్షులు కాగా ధన్వంతీ చండీలా రాజోరీ గార్డెన్ శాసనసభ్యుని సతీమణి.
తొలి జాబితాలో మొదటి ముగ్గురి పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ చివరి ముగ్గురి పేర్లను మలి జాబితాలో చేర్చింది. వీరిలో ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ న్యూఢిల్లీ నుంచి, కిరణ్ వాలియా మాలవీయనగర్ నుంచి, బర్ఖాసింగ్ ఆర్‌కెపురం నుంచి పోటీచేస్తున్నారు. షీలాదీక్షిత్‌కు వ్యతిరేకంగా బీజేపీ తరఫున విజేంద్ర గుప్తా, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున అరవింద్ కేజ్రీవాల్ పోటీచేస్తున్నారు. కిరణ్ వాలియా బీజేపీ అభ్యర్థి ఢిల్లీ మాజీ మేయర్ ఆర్తీ మెహ్రాతో తలపడుతున్నారు. బర్ఖాసింగ్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ నేత షాజియా ఇల్మీతో తలపడనుండగా యువనేత రాగిణీ నాయక్ జనక్‌పురి నుంచి పోటీ చేస్తారు. ఆమె బీజేపీ సీనియర్ నేత జగ్‌దీశ్ ముఖీతో పోటీపడుతున్నారు. మరో యువనేత అమతా ధవన్ తిలక్‌నగర్ నుంచి పోటీ చేస్తూ ఓపి బబ్బర్ తనయుడు రాజీవ్ బబ్బర్‌కు ప్రత్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తిలక్‌నగర్ టికెట్ పాప్ సింగర్ దలేర్ మెహందీకి ఇస్తారన్న ఊహాగానాలు వినిపించినప్పటికీ ఆయనకు మొండిచేయి ఎదురైంది.
అమతా ధవన్ మున్సిపల్ కౌన్సిలర్ కూడా. ఇక రాజోరీ గార్డెన్ టికెట్ ధన్వంతీ చండీలాకు లభించింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ధన్వంతీ భర్త దయానంద్ చండీలా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దయానంద్ చండీలాపై తీవ్ర నేరారోపణలు ఉండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ ఆయనకు మాత్రం టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడా సీటును ఆయన భార్యకే కేటాయించారు. ధన్వంతీ అకాలీదళ్ అభ్యర్థి శ్యామ్ శర్మతో తలపడనున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థుల్లో మహిళలు ఆరుగురే
Published Sat, Nov 16 2013 3:25 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement