వాస్తవ దూరం
Published Thu, Oct 31 2013 12:02 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
న్యూఢిల్లీ:వచ్చే ఎన్నికలకు సంబంధించి వివిధ సంస్థలు జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన ఫలితాలను ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తేలిగ్గా కొట్టిపారేశారు. ఇవన్నీ వాస్తవాలను ప్రతిబింబించబోవన్నారు. బుధవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడారు. కాగా త్వరలో జరగనున్న ఎన్నికలపై ఇటీవల కొన్ని సంస్థలు జరిపిన ప్రజాభిప్రాయసేకరణలో అర్వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజేపీలు ముందున్నట్టు ఫలితాలొచ్చిన సంగతి విదితమే. దీనిపై సీఎం స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిందన్నారు. సంక్షేమ పథకాలతోపాటు వివిధ ప్రాజెక్టులను చేపట్టడంద్వారా నగర ప్రజలకు గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకుందన్నారు. అంతేకాకుండా జనాభాకు అనుగుణంగా నగరంలో మౌలిక సదుపాయాలను తమ ప్రభుత్వం మెరుగుపరిచిందన్నారు. ‘ప్రజాభిప్రాయ సేకరణ వాస్తవాలను ప్రతిబింబించినట్టు నేను భావించడం లేదు. ఎటువంటి ఎజెండా లేని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మరిన్ని సీట్లు వస్తాయని మీరు ఏవిధంగా అనుకుంటున్నారు.
దేనిని ప్రాతిపదికగా చేసుకుని ఇటువంటి నిర్ధారణకు వచ్చారో నాకు అర్ధం కావడం లేదు. ఈ గణాంకాల విశ్వసనీయత ఎంత’ అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఓటుబ్యాంకును అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కొల్లగొడుతుందేమోనని ఆందోళనకు గురవుతున్నారా అంటూ మీడియా ప్రశ్నించగా అటువంటి అవకాశమే లేదంటూ 75 ఏళ్ల ఈ కాంగ్రెస్ నాయకురాలు కొట్టిపారేశారు. గత 15 సంవత్సరాలుగా తమ పార్టీ పనితీరును, సమర్థతను నగర ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, అందువల్ల వారు తమ పార్టీకే పట్టం కడతారంటూ ధీమా వ్యక్తం చేశారు.
బీఎస్‌పీ సాధించిందేముంది అన్నిహంగులు కలిగిన మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) గతంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిందని, అయితే ఆ పార్టీ ఆశించిన న్ని స్థానాలను సాధించలేకపోయిందని సీఎం షీలాదీక్షిత్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఎన్నికల సమయంలో బీఎస్‌పీ అధ్యక్షురాలు మాయావతి నగరానికి చెందిన ఆ పార్టీ నాయకులతో అనేక పర్యాయాలు సమావేశమైన విషయాన్ని కూడా ప్రస్తావించారు. అందువల్ల ఎన్నికల ఫలితాలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభావం ఉంటుందా లేక ఇతర పార్టీల ప్రభావం ఉంటుందా అనే విషయం ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుందన్నారు. నిజానికి అదొక పార్టీయేనా అనే సందేహం తనకు కలుగుతోందన్నారు. సమాజంలోని అన్నివర్గాల సంక్షేమం కోసం తమ పార్టీ పాటుపడిందని ఈ సందర్భంగా ఆమె నొక్కివక్కాణించారు. నగర ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు తమ ప్రభుత్వం శాయశక్తులా కృషి చేసిందన్నారు. ఇంకా కృషి చేస్తూనే ఉంటామన్నారు. అందువల్ల నగర ప్రజలు తమ పార్టీకే మద్దతు ఇస్తారని భావిస్తున్నట్టు చెప్పారు.
బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే పోరు
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ ఉంటుందని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ చెప్పారు. 2008 కంటే ఈ ఎన్నికల్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశముందా అని మీడియా ప్రశ్నించగా గత ఎన్నికల్లో ఆ పార్టీ నాయకులు కలసికట్టుగా ముందుకు సాగారన్నారు. 2008 నాటి ఎన్నికల్లో ఆ పార్టీలో అంతర్గత కలహాలు ఉన్నట్టు కనిపించలేదన్నారు. అయితే ఈసారి మాత్రం ఆ పార్టీలో అంతర్గత కలహాలు బయటపడ్డాయన్నారు.
మోడీ ప్రభావం ఉండబోదు
వచ్చే ఎన్నికల్లో నగర ఓటర్లపై బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ ప్రభావం ఉంటుందా అనే ప్రశ్నకు ఆమె జవాబిస్తూ ఉంటుందని తాననుకోవడం లేదన్నారు. అయితే లోక్‌సభ ఎన్నికలు జరిగినట్టయితే ఆయన వాస్తవ ప్రభావం ఎంతమేరకు ఉంటుందనే విషయం స్పష్టమవుతుందన్నారు. అందువల్ల ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేమన్నారు. కాగా విద్యుత్ చార్జీల విషయంలో ప్రతిపక్ష పార్టీలు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాయని సీఎం షీలాదీక్షిత్ ఆరోపించారు. 1998లో తమ పార్టీ అధికార పగ్గాలు చేపట్టిందని, అప్పటినుంచి ఇప్పటిదాకా ఏమేమి చేసిందనే విషయం నగర ప్రజలందరికీ తెలుసన్నారు. గడచిన 15 సంవత్సరాల కాలంలో ఢిల్లీ ఎంతో పురోగతి సాధించిందన్నారు.
Advertisement