న్యూఢిల్లీ: మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్... ముఖ్యమంత్రి అభ్యర్థిని తానేననే సంకేతాలిచ్చారు. ముఖ్యమంత్రి అభ్యర్థిలో మార్పు ఎందుకంటూ, దీనిపై తుది నిర్ణయం పార్టీ త్వరలోనే తీసుకుంటుందన్నారు. కాగా గత ఎన్నికల్లో సంప్రదాయానికి భిన్నమైన ప్రచారాన్ని చేపట్టడంలో కీలకపాత్ర పోషించిన కేజ్రీవాల్...ఈసారికూడా అదే పద్ధతిలో ముందుకుసాగనున్నారు. గత ఎన్నికల సమయంలో మాదిరిగానే ఈసారి కూడా తమ పార్టీ ప్రచారం సాగుతుందని, దానికి ఈసారికూడా తానే నాయకత్వం వహిస్తానని
అన్నారు.
స్పష్టమైన మెజారిటీ సాధిస్తాం: త్వరలో జరగనున్న విధానసభ ఎన్నికల్లో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రావడం తథ్యమని ఆప్ అధినేత అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. నెలన్నర క్రితం తాము సర్వే చేయించామని, ఈసారి జరిగే ఎన్నికల్లో తమ పార్టీ ఓటు వాటా 47 శాతంగా ఉంటుందని తేలిందన్నారు. బీజేపీకి 37 శాతం ఓటు వాటా వస్తుందన్నారు. గద్దె దిగడం పెద్ద తప్పిదమే: తమ 49 రోజుల పరిపాలనను నగరవాసులు నెమరువేసుకుంటున్నారని అరవింద్ పేర్కొన్నారు. ఇది నగరవాసులకు ఓ మంచి కలవంటిదని, అందువల్లనే వారు తమకు ఓటు వేస్తారని అన్నారు. ఈ కారణంగానే తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఏదిఏమైనప్పటికీ 49 రోజుల పరిపాలన తర్వాత సీఎం పదవి నుంచి తప్పుకోవడం రాజకీయ కెరీర్‌లో పెద్ద తప్పిదమేనని ఆయన అంగీకరించారు. ప్రజలు తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, అయితే అధికారం నుంచి దిగిపోయిన కారణంగా వారి ఆశలు అడియాశలయ్యాయని అన్నారు. వెంటనే ఎన్నికలు వస్తాయని భావించానని పేర్కొన్నారు. ఇదిలాఉంచితే ఈసారి జరగనున్న ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇంతవరకూ బీజేపీ ప్రకటించలేదు. సమష్టిగా ముందుకు సాగుతామని పేర్కొన్న సంగతి విదితమే. ఇక మరో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ కూడా ఇప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు.
ఆప్ సీఎం అభ్యర్థిని నేనే
Published Wed, Nov 5 2014 11:04 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement