న్యూఢిల్లీ: ప్రచారంలో దూసుకుపోతూ కాంగ్రెస్, బీజేపీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ ఇరు పార్టీలమీద తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలను ‘దలాల్’లుగా అభివర్ణించిన ఆయన ఢిల్లీని పాలించడం రాకెట్ సైన్సేమీ కాదన్నారు. న్యూఢిల్లీ నుంచి ఘజియాబాద్‌లోని తన నివాసానికి ప్రయాణమవుతూ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవి ఆయన మాటల్లోనే... ‘ ఏఏపీ పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణతో నాలో అహంకారం పెరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇటువంటి విమర్శలకు నేను సమాధానమివ్వలేను. కాంగ్రెస్, బీజేపీల ‘అవినీతి’ని ఏఏపీ ఏమాత్రం సహించదు కనుక మా వైఖరి వారికి అహంకారపూరితమైనదిగానే కనిపిస్తుంది.
రెండేళ్ల కిందట జనాలకు కేజ్రీవాల్ ఎవరో తెలియదు. ఏఏపీ పార్టీ పెట్టిన తర్వాత నగరంలోని ప్రతి ఆటోపై కేజ్రీవాల్ బొమ్మతోపాటు పార్టీ గుర్తు ‘చీపురు’ చేస్తున్న హడావుడి వారికి నిద్రలేకుండా చేస్తోంది. అయితే కాంగ్రెస్, బీజేపీల అవినీతి ముందు ఏఏపీ ప్రజాదరణ చాలా చిన్నది. పేరుకుపోయిన అవినీతిని ఊడ్చేందుకే ‘చీపురు’ పుట్టుకొచ్చింది. ప్రస్తుతం అధికార, ప్రతిపక్షాల్లో ఉన్న రెండు పార్టీలదీ ఒకే మంచం, ఒకే కంచం. వారిద్దరు కలిసే అవినీతికి పాల్పడ్డారు. ఇంత తక్కువ సమయంలో ఏఏపీ ఓ శక్తిగా ఎలా ఎదిగిందని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. వారికి నేను చెప్పే సమాధానం ఒక్కటే. ఏఏపీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు... అది ‘సామాన్యుడి స్వరం’. అందుకే దాదాపు ఎనభైశాతానికి పైగా ఉన్న సామాన్యులు మాకు ప్రాధాన్యతనిస్తున్నారు. మమ్మల్ని ఆదరిస్తున్నారు. మా నిజాయతీ వారికి నచ్చింది. మా ధైర్యాన్ని వారు మెచ్చుకున్నారు.
ఇక పాతుకుపోయిన కాంగ్రెస్, బీజేపీలను ఓడించే ‘అనుభవం’ ఏఏపీకి లేదని చెబుతున్నారు. నిజమే ప్రజలను దోచుకోవడంలో వారికి ఉన్నంత అనుభవం మాకు లేదు. కానీ ఈ ఎన్నికల ద్వారా వారికి గుణపాఠం చెబుతాం. అందుకు అవసరమైన అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తాం. మరో పదిరోజులు పోతే ఈ రెండు పార్టీలు మమ్మల్ని అనుసరించాల్సిందే. ప్రచారంలో మేం ఎక్కడా ఆర్భాటాలకు పోలేదు. కేవలం ఆటోరిక్షాలపై పోస్టర్లు అంటించడం ద్వారా మాత్రమే ప్రచారం చేశాం. ఎన్నికల గుర్తు ‘చీపురు’ కూడా అంత గ్లామరస్ గుర్తేమీ కాదు. ఇక పార్టీ కార్యకర్తలు ‘నేను సామాన్యుడిని’ అనే నినాదం రాసి ఉన్న టోపీ పెట్టుకొని ప్రచారానికి వెళ్తున్నారు.
తక్కువ ఖర్చుతో చేస్తున్న ప్రచారమైనా ప్రజలపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటోంది. నిజాయతీ-అవినీతి రహిత సమాజం ధ్యేయంగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు తప్పకుండా గెలిపిస్తారనే నమ్మకముంది. ప్రత్యర్థుల్లో కూడా ఈ భయం ఇప్పుడిప్పుడే మొదలైంది. అందుకే ఏఏపీపై ఇప్పటికే దాదాపు 100కుపైగా ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశారు. అయినప్పటికీ వాటికి భయపడేది లేదు. ఇక ఎన్నికల ప్రచారం నా ఆరోగ్యంపై కాస్త ప్రభావం చూపిన మాట నిజమే. గతంలో ఉదయం 4.30 గంటలకే నిద్ర లేచేవాడిని. ఆరోగ్యం సహకరించకపోవడంతోనే ఇప్పుడు 6.30కు నిద్ర లేస్తున్నా. అందుకు కారణం ఇంటికి ఆలస్యంగా చేరుకోవడమే. ఇక విదేశాల నుంచి వస్తున్న విరాళాలపై ప్రభుత్వం దర్యాప్తు జరుపుతామంటోంది. దానిని మేం కూడా ఆహ్వానిస్తున్నాం.
రండి... మా ఖాతాలను నిరభ్యంతరంగా తనిఖీ చేసుకోవచ్చు. అదే ప్రభుత్వం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వస్తున్న విరాళాలపై కూడా దర్యాప్తు జరపాలి. ఇక బహిరంగ చర్చకు రావాలంటూ నేను ఆహ్వానించినా షీలాదీక్షిత్ రాలేదు. వారికి ప్రజా సమస్యలపై మాట్లాడే ధైర్యం, చిత్తశుద్ధి లేదు. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ అంతకంటే దయనీయమైన స్థితిలో ఉంది. పలు వార్తా చానళ్లు నిర్వహించిన సర్వేల్లో ఢిల్లీలో హంగ్ అసెంబ్లీ ఖాయమని తేలింది. అయితే నాకు మాత్రం ఏఏపీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాల్లో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే నమ్మకముంద’న్నారు.
ఢిల్లీని పాలించడం రాకెట్ సైన్సేమీ కాదు
Published Sun, Nov 17 2013 11:23 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement