సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల తేదీ ఇంకా ప్రకటించనప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ జోరుగా ప్రచారం ప్రారంభించాయి. ఈ రెండు పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో జోరుగా ప్రచారం సాగిస్తుండగా, ఢిల్లీలో వరుసగా పదిహేనేళ్లు ప్రభుత్వం నడిపిన కాంగ్రెస్ మాత్రం ఈ విషయంలో ఇంకా వెనుకంజలో ఉంది. అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు బలంపైనే ప్రచారం సాగించాలని బీజేపీ నిర్ణయించుకుంది. కాగా నరేంద్ర మోదీ ప్రభంజనాన్ని గుర్తించిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నేరుగా ఆయనపై విమర్శలు గుప్పించకుండా సీఎం అభ్యర్థి లేకుండా బీజేపీ సాగిస్తున్న ప్రచారాన్ని ప్రజలకు ఎత్తి చూపాలనుకుంటోంది.
నరేంద్ర మోదీ ఢిల్లీకి ముఖ్యమంత్రి కాలేరని, జగ్‌దీశ్‌ముఖి వంటి నేత సీఎం పదవిని చేపడ్తారని అంటూ ఈ విషయాన్ని ప్రజల మనసుల్లో నాటడానికి ఆప్ ప్రయత్నిస్తోంది. ఈ ఉద్దేశంతోనే ఆప్ ఇప్పటికే అర్వింద్ కేజ్రీవాలా లేక జగ్దీశ్ ముఖియా అన్న శీర్షికతో పోస్టర్లు అతికించింది. జగ్‌దీశ్‌ముఖీని సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి బీజేపీ ఎందుకు జంకుతోంది అంటూ ఆటోల వెనుక అతికించిన పోస్టర్ల ద్వారా ప్రశ్నించింది. ఆప్ ప్రారంభించిన ఈ పోస్టర్ల ప్రచారాన్ని బీజేపీ మరింత ముందుకు తీసుకువెళ్లింది. ఢిల్లీ కంటోన్మెంట్ నుంచి ఎన్నికైన ఆప్ మాజీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ నాలుగు కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆర్టీఐ ద్వారా తెలిసిందని అంటూ బీజేపీకి చెందిన కరణ్ సింగ్ తన్వర్ పోస్టర్ల యుద్ధం ప్రారంభించారు.
ఇదిలా ఉండ గా అర్వింద్ కేజ్రీవాల్ దుబాయ్ పర్యటనను ఆధారంగా తీసుకుని ఆప్‌కు, అండర్ వరల్డ్‌కు సంబంధాలున్నాయని ఆరోపిస్తూ ఆమ్ ఆద్మీ సేన పేరుతో పోస్టర్లు వెలిశాయి. అయితే ఈ పోస్టర్లకు తమకు సంబంధం లేదని బీజేపీ అంటోంది. పలాయనవాది అంటూ బీజేపీ, కాంగ్రెస్ వేస్తోన్న ముద్ర నుంచి బయటపడడానికి కూడా ఆప్ గట్టిగా ప్రయత్నిస్తోంది. రాజీనామా చేసి తాము పొరపాటు చేశామని, మరోసారి అధికారాన్నిస్తే ఇటువంటి తప్పిదం చేయ మని ఆప్ హామీ ఇస్తోంది.
చట్టపరమైన చర్యలకు సిఫార్సు
ఆమ్‌ఆద్మీ పార్టీ విదేశాల నుంచి నిధులు సేకరిస్తోందని బీజేపీ ఢిల్లీ శాఖ చేస్తున్న ఆరోపణలపై పార్టీ ఢిల్లీ శాఖ కన్వీనర్ అశుతోష్ మండిపడ్డారు. ఆ పార్టీపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని ఆయన మీడియాకు తెలిపారు. తమ పార్టీ నిధుల సేకరణను పారదర్శకంగా, నిజాయతీగా సేకరిస్తోందని అన్నారు. కానీ, కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఆప్ నిధుల సేకరణపై ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు.
బీజేపీ, ఆప్ ప్రచార హోరు
Published Thu, Dec 11 2014 11:29 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement