న్యూఢిల్లీ: ఏడు నెలలుగా సాగుతున్న బీజేపీ పాలన భయాందోళనలకు గురిచేసేలా ఉందని మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ బిల్లుల ఆమోదానికి బదులు ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకుందని, దేశంలో మతకలహాల తరహా వాతావరణం నెలకొందని అన్నారు. దేశంలో మత కలహాలకు బీజేపీయే కారణమన్నారు. ఘర్ వాపసి వంటి కొన్ని సంస్థలు చేస్తున్న చర్యలు మైనారిటీలను ఆందోళనకు గురిచేసేలా ఉన్నాయన్నారు. ఇది అత్యంత విచారకరమన్నారు. వారు మంచి చేశారా? లేక చెడు చేశారా? అనే విషయం చెప్పడం సమంజసం కాదన్నారు. బీజేపీ.. ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకుందని, అటువంటపుడు ఇక పార్లమెంట్ ఎందుకని ప్రశ్నించారు. ‘నిజంగా మంచిరోజులొచ్చాయా (అచ్చే దిన్ ఆగయే)? వారు దేశమంతటా సృష్టించిన మతఘర్షణ వాతావరణాన్ని గమనించండి’ అని అన్నారు.
మతసామరస్యంపై ప్రభావం
ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మతసామరస్యంపై ప్రభావం పడిందని షీలా పేర్కొన్నారు. దాదాపు 17 సంవత్సరాల తర్వాత నగరంలో మతకలహాలు చోటుచేసుకున్నాయన్నారు. ఓ చర్చి కూడా దగ్ధమైందన్నారు.
తక్కువ అంచనా వేశాం: 2013నాటి విధానసభ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీని తక్కువ అంచనా వేసిన మాట నిజమేనంటూ 15 సంవత్సరాలపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి బాధ్యతలను నిర్వర్తించిన షీలాదీక్షిత్ అంగీకరించారు. ఆ ఎన్నికలకు తాము ఇంకా బాగా సిద్ధమైఉంటే బాగుండేదన్నారు. కాగా 2013లో జరిగిన విధానసభ ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన షీలాదీక్షిత్.... ఆప్ అధినేత, ఆ నియోజకవర్గంలో తన ప్రత్యర్థి అయిన అరవింద్ కేజ్రీవాల్ చేతిలో పరాజయం పాలైన సంగతి విదితమే.
మతతత్వ శక్తులకు మాత్రమే మద్దతు ఇవ్వం
విధానసభ ఎన్నికల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇస్తామంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంపై మీడియా ప్రశ్నించగా మతతత్వ శక్తులకు మాత్రమే (బీజేపీ) తాము మద్దతు ఇవ్వబోమన్నారు.
మోదీ... సీఎం కాబోరు
విధానసభ ఎన్నికల ప్రచారానికి మోదీని బీజేపీ వినియోగించుకోవడంపై షీలాదీక్షిత్ మాట్లాడుతూ ఢిల్లీకి ఆయన ముఖ్యమంత్రి కాబోరన్నారు. బీజేపీ.. మిగతా అన్నివిషయాలను వదిలేసి మోదీని మాత్రమే ముందుకు తెస్తోందన్నారు. ఆయన ముఖ్యమంత్రి కాబోడనే విషయం ఢిల్లీ వాసులకు తెలుసని అన్నారు. మోదీ... కేంద్రంలో మాత్రమే బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. ‘మిగతా అన్ని రాష్ట్రాలకంటే ఢిల్లీ విభిన్నమైనది. ఇక్కడి అంశాలు కూడా భిన్నమైనవే’అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా సీఎం అభ్యర్థిని ప్రకటించనందువల్ల ప్రతికూల ప్రభావం పడే అవకాశముందా అని అడగ్గా అటువంటిదేమీ ఉండబోదన్నారు. అధిష్టానం ఆదేశాలకు లోబడి నడుచుకుంటానన్నారు. ఎన్నికల్లో ప్రచారం చేయమంటే అదే చేస్తానన్నారు.ఏమి చేయమంటే అదే చేస్తానన్నారు.
పోటీ చేయబోనని చెప్పా
కేరళ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అధిష్టానాన్ని కలిశానని, విధానసభ ఎన్నికల్లో పోటీ చేయబోనని వారికి వివరించానని షీలాదీక్షిత్ స్పష్టం చేశారు. ఏ కమిటీల్లోనూ తనను సభ్యురాలిగా కూడా వేయవద్దని కోరినట్టు చెప్పారు.
భయాందోళనలకు గురిచేసేలా ఉంది
Published Sun, Jan 11 2015 10:50 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement