
న్యూఢిల్లీ : తనను కించపరచడం ద్వారా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పూర్వాంచల్ ప్రజలందరినీ అవమానించారని బీజేపీ నాయకుడు మనోజ్ తివారీ ఆరోపించారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మనోజ్ తివారీ.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కూడా అదే స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. ఈయనకు పోటీగా కాంగ్రెస్ ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ను బరిలోకి దించగా.. ఆమ్ ఆద్మీ పార్టీ దిలీప్ పాండేను నిలబెట్టింది. ఈ నేపథ్యంలో దిలీప్ పాండేకు మద్దతుగా సీఎం కేజ్రీవాల్ శుక్రవారం ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో మనోజ్ తివారీ నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ‘ మనోజ్ తివారీకి కేవలం డ్యాన్స్ ఎలా చేయాలో మాత్రమే తెలుసు. కానీ పాండేజీకి డ్యాన్స్ చేయడం తెలియక పోయినా ప్రజల కోసం పనిచేసే గుణం మాత్రం ఉంది. అందుకే ఈసారి డ్యాన్స్ చేసే వాళ్లకు కాకుండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే వారికే ఓటేయాలి. ఈ ఎన్నికలు ఎంతో కీలకమైనవి. అభివృద్ధి చేసేవారిని మాత్రమే గెలిపించాలి. నాచ్‌నేవాలాకు కాదు’ అని మనోజ్ తివారీపై విమర్శలు గుప్పించారు. కాగా కేజ్రీవాల్ వ్యాఖ్యలపై స్పందించిన మనోజ్ తివారీ... తనను కించపరచడం ద్వారా పూర్వాంచల్ ప్రజలందరినీ కేజ్రీవాల్ అవమానించారని పేర్కొన్నారు. ఇందుకు ఆయన భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కాగా భోజ్‌పురిలో మంచి నటుడిగా, గాయకుడిగా గుర్తింపు పొందిన మనోజ్ తివారీ ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మే 12న ఢిల్లీలో ఎన్నికలు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment