ఈసారి తప్పించుకోలేవని బెదిరించాడు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజేందర్ గుప్తాను హతమారుస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. గుప్తా పీఏ ఆశీష్ కట్యల్ ఫోన్కు ఆగంతకుడు కాల్ కేసి ఈ మేరకు హెచ్చరించాడు. ఆశీష్ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఈ నెల 10వ తేదీ సాయంత్రం గుర్తుతెలియనివ్యక్తి తనకు ఫోన్ చేసి గుప్తాను చంపుతానని బెదిరించాడని, గతంలో రెండుసార్లు తమదాడి నుంచి తప్పించుకున్నాడని, ఈ సారి సెక్యూరిటీ ఉన్నా తమ నుంచి తప్పించుకోలేడని హెచ్చరించాడని ఆశీష్ చెప్పారు. ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా తనకు గత నెల 9వ తేదీన ఇదేవిధంగా బెదిరింపు కాల్స్ వచ్చినట్టు గుప్తా చెప్పారు. ఏడాదిన్నర క్రితం కూడా బెదిరింపులు వచ్చాయని, వీటి వెనుక ఆప్ లీడర్ల హస్తముందని ఆయన ఆరోపించారు. ఢిల్లీ ప్రభుత్వ అవినీతిని ఎత్తిచూపినందుకు తనకు బెదిరింపులు వస్తున్నాయని, వీటి వెనుక వందశాతం ఆప్ నేతల హస్తముందని భావిస్తున్నట్టు గుప్తా చెప్పారు. అయితే గుప్తా ఆరోపణలు ఆప్ నేతలు ఖండించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించి వాస్తవాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు.