వ్యాట్‌పై చర్చకు అనుమతించలేదు
♦ ఆప్ సర్కారుపై బీజేపీ విమర్శనాస్త్రాలు
♦ మీడియాను పక్కదారి పట్టించారు
♦ స్పీకర్ వివక్షతో వ్యవహరిస్తున్నారు
న్యూఢిల్లీ : వ్యాట్ బిల్లుపై ఆప్ ప్రభుత్వంతోపాటు స్పీకర్ రాంనివాస్ గోయల్ శాసనసభలో చర్చకు అనుమతించలేదని బీజేపీ ఆరోపించింది. పైగా చర్చ జరిగిందని, అయితే విపక్ష సభ్యులు పాల్గొనలేదంటూ ఈ విషయంలో మీడియాను పక్కదారి పట్టించేందుకు యత్నించిందని ఆ పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ విమర్శించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకూడా ఈ అంశంపై చర్చను అడ్డుకున్నారని ఆరోపించారు.
సవరణలతో చేపట్టిన అత్యంత కీలకమైన ఈ బిల్లును కొద్ది సెకండ్ల వ్యవధిలోనే సభలో ఆమోదింపజేసుకున్నారన్నారు. ఈ అంశంపై చర్చకు అనుమతించామని, అయితే ప్రతిపక్ష సభ్యులు ఇందులో పాల్గొనలేదంటూ సభ బయట అధికార పక్షం మీడియాకు చెప్పుకుందన్నారు. అనంతరం ఆ పార్టీకి చెందిన మరో నాయకుడు, శాసనసభలో ప్రతిపక్ష నేత విజేందర్‌గుప్తా మాట్లాడుతూ స్పీకర్ రాంనివాస్ గోయల్ బీజేపీ ఎమ్మెల్యేలపట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.
ఆయన వివక్షతో వ్యవహరించాడా? లేదా? అనే విషయాన్ని శాసనసభ వీడియో దృశ్యాలను పరిశీలిస్తే అర్థమవుతుందని, ఆవిధంగా కూడా నిర్ధారించుకోవచ్చని అన్నారు. ఇప్పటికి మొత్తం మూడు పర్యాయాలు శాసనసభ సమావేశాలు జరిగాయని, అయితే అత్యధిక మెజారిటీ ఉండడంతో విపక్షం ఉనికి లేకుండా చేసేందుకు ఆప్ సర్కారు శాయశక్తులా యత్నిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి మూలస్థంభమైన మీడి యా మాట ఆలకించేందుకు సిద్ధంగా లేదనే విషయం స్పష్టమైందన్నారు.