షరతులకు ఓకే
షరతులకు ఓకే
Published Mon, Dec 16 2013 11:47 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి, న్యూఢిల్లీ: తమ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 18 షరతులపై ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) నేత అర్వింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖకు ఆ పార్టీ సోమవారం జవాబిచ్చింది. కేజ్రీవాల్ ప్రస్తావించిన 18 అంశాలకూ జవాబు ఇచ్చామని ఢిల్లీ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ షకీల్ అహ్మద్ చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన సమాధానంపై మంగళవారం చర్చించనున్నట్లు ఆప్ నేత మనీష్ సిసోడియా చెప్పారు.
అయితే లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. ఆప్ విధించిన షరతులు తమకు సమ్మతమేనని, అయితే అందులో చాలా వాటికి ఏ పార్టీ మద్దతూ అవసరం లేదని తెలిపింది. ఆప్ ప్రస్తావించిన అన్ని అంశాలపైనా ఏకీభవిస్తూనే వాటికి తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చింది. కేజ్రీవాల్ పేర్కొన్న 18 షరతులలో 16 షరతులు కార్యనిర్వాహక వర్గం విధుల పరిధిలోకి వస్తాయని, వాటిని నిర్వర్తించడం ప్రభుత్వ కర్తవ్యమని కాంగ్రెస్ పేర్కొంది. ఈ షరతులను నెరవేర్చడానికి విధానసభ అనుమతి కూడా అవసరం లేదని తెలిపింది. మిగతా రెండు షరతులు అంటే ఢిల్లీలో లోకాయుక్తను ఏర్పాటుచేయడం, ఢిల్లీకి సంపూర్ణరాష్ట్ర హోదా కల్పించడం.
ఢిల్లీలో లోకాయుక్త ఇప్పటికే ఉందని కాంగ్రెస్ పేర్కొంది. ఆప్ ప్రభుత్వం లోకాయుక్తను మరింత పటిష్టం చేయాలనుకున్నట్లయితే తాము సహకరిస్తామని కాంగ్రెస్ తెలిపింది. లోక్‌పాల్ బిల్లును పార్లమెంటు ఈవారం ఆమోదించవచ్చని తెలిపింది. ఢిల్లీకి సంపూర్ణ రాష్ట్ర హోదాను తామూ కోరుతున్నామని కాంగ్రెస్ తెలియజేసింది. ఈ ప్రతిపాదన విధానసభ ముందుకు వచ్చినప్పుడు సహకరిస్తామని హామీ ఇచ్చింది. ఈ అంశంపై కేంద్రంతో చర్చిస్తామని వాగ్దానం చేసింది. ‘మేం బేషరతుగా మద్దతు ఇస్తామని చెప్పామని కేజ్రీవాల్ మాటిమాటికి అంటున్నారు. నిజానికి కాంగ్రెస్ ఆప్ ప్రభుత్వానికి వెలుపలి నుంచి మాత్రమే మద్దతు ఇస్తుందని తెలియజేశాం’ అని షకీల్ అహ్మద్ వివరణ ఇచ్చారు.
సమాధానమివ్వకూడదని నిర్ణయించిన బీజేపీ
ఈ 18 షరతులపై వైఖరి తెలపాల్సిందిగా కేజ్రీవాల్ తమ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌కు రాసిన లేఖకు సమాధానమివ్వకూడదని బీజేపీ నిర్ణయించుకుంది. ‘ఆమ్ ఆద్మీ పార్టీకి బేషరతుగా మద్దతు ఇస్తామని మేం హామీ ఇవ్వలేదు. కేవలం నిర్మాణాత్మక సహకారం మాత్రం ఇస్తామన్నాం. అందువల్ల ఆప్ రాసిన లేఖకు సమాధానమిచ్చి మా మద్దతు తెలపాల్సిన అవసరం లేదు’ అని బీజేపీ నేతలు అన్నారు. తాము ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ముందుగానే వెల్లడించామని పేర్కొన్నారు. ప్రతిపక్ష సహకారాన్ని విధానసభలో కోరాల్సి ఉంటుంది కానీ ప్రభుత్వ ఏర్పాటుకు ముందే కాదని బీజేపీ నేత విజేందర్ గుప్తా అభిప్రాయపడ్డారు.
Advertisement