ప్రభుత్వ ఏర్పాటుకు గడువు ఇవ్వండి : కేజ్రీవాల్
తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వం, తీసుకోబోమని ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం పునరుద్ఘాటించారు. తాను ముఖ్యమంత్రి కావడానికో లేక అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ విముఖత వ్యక్తం చేయడంతో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో అరవింద్ శనివారం ఉదయం లెప్టినెంట్ గవర్నర్తో సమావేశమైయ్యారు.
అనంతరం విలేకర్ల సమావేశంలో అరవింద్ మాట్లాడుతూ.... ప్రభుత్వ ఏర్పాటుపై 10 రోజుల గడువు కావాలని లెఫ్టినెంట్ గవర్నర్ను గడువు కోరినట్లు ఆయన తెలిపారు. అయితే ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే కాంగ్రెస్, బీజేపీలు మద్దతు ఇస్తామని ప్రకటించడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఆ పార్టీలు ఎందుకు మద్దుతు ఇస్తానంటున్నాయో అర్థం కావడం లేదని అరవింద్ వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీకి బేషరత్తుగా మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ గవర్నర్కు లేఖ ఇచ్చిందని తెలిపారు.
తమకు ఎందుకు మద్దతు ఇస్తామన్నారో కాంగ్రెస్, బీజేపీలు వెంటనే స్సష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.తమకు మద్దతు ఇస్తే 15 ఏళ్ల పాటు షీలా ప్రభుత్వ హయంలో చోటు చేసుకున్న అవినీతిపై విచారణ చేయిస్తామని, అందుకు సిద్ధమేనా అని కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. దేశ రాజధాని ప్రజలను పట్టి పీడిస్తున్న విద్యుత్, తాగు నీటి సమస్యలు పరిష్కరించేందు తమతో కలసి నడుస్తాయా అంటూ కాంగ్రెస్,బీజేపీలకు అరవింద్ కేజ్రీవాల్ చురకులు అంటించారు.