లోక్‌పాల్ తొలి చైర్మన్ పినాకి చంద్ర ఘోష్
న్యూఢిల్లీ: ఎట్టకేలకు లోక్‌పాల్ నియామకం కొలిక్కి వచ్చింది. అవినీతి వ్యతిరేక అంబుడ్స్‌మన్ వ్యవస్థగా పిలుస్తున్న లోక్‌పాల్ తొలి చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్(66) పేరును కేంద్రం ఖరారుచేసినట్లు తెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఆదివారం ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సిఫార్సు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే, న్యాయ కోవిదుడు ముకుల్ రోహత్గీ సభ్యులుగా ఉన్నారు.
అయితే కమిటీ జస్టిస్ ఘోష్ పేరును ఖరారుచేసిన శుక్రవారం నాటి సమావేశానికి మల్లికార్జున ఖర్గే గైర్హాజరయ్యారు. లోక్‌పాల్ తొలి చైర్మన్ పదవికి సెర్చ్ కమిటీ షార్ట్‌లిస్ట్ చేసిన తుది 10 మందిలో జస్టిస్ ఘోష్ కూడా ఒకరు. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ అర్హుల జాబితాను కేంద్రానికి పంపింది. అందులో నుంచి జస్టిస్ ఘోష్ పేరును ప్రభుత్వం పరిశీలించినట్లు తెలుస్తోంది. తొలి లోక్‌పాల్ చైర్మన్, సభ్యుల నియామకంపై ఈ వారంలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
లోక్‌పాల్ నియామకంపై పడిన ముందడుగును ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే స్వాగతించారు. 48 ఏళ్లుగా ప్రజలు చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించిందని హర్షం వ్యక్తం చేశారు. జనలోక్‌పాల్ కోసం అన్నా హజారే సుదీర్ఘ ఉద్యమం చేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ ఘోష్ 2017 మే 27న సుప్రీంకోర్టు జడ్జిగా పదవీ విరమణ పొందారు. అదే ఏడాది జూన్ 29 నుంచి జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో సభ్యుడిగా కొనసాగుతున్నారు.
పరిధిలోకి ప్రధాని కూడా..
ప్రధానమంత్రి సహా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులపై వచ్చే అవినీతి ఆరోపణలపై విచారణ జరపడమే లోక్‌పాల్ ప్రధాన విధి. సాయుధ బలగాలు లోక్‌పాల్ పరిధిలోకి రావు. విచారణ కొనసాగుతుండగానే అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన ఆస్తులన్నీ జప్తు చేసే అధికారం లోక్‌పాల్‌కు దఖలుపరిచారు. అంబుడ్స్‌మన్ అప్పగించిన కేసులను విచారిస్తున్న సమయంలో సీబీఐ సహా ఇతర దర్యాప్తు సంస్థలపై పర్యవేక్షణాధికారం లోక్‌పాల్‌కు కల్పించారు.
లోక్‌పాల్ అప్పగించిన కేసును దర్యాప్తు చేసిన అధికారిని దాని అనుమతి లేకుండా బదిలీ చేయరాదు. కేంద్రంలో లోక్‌పాల్‌గా, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్తగా వ్యవహరిస్తున్న ఈ అవినీతి వ్యతిరేక అంబుడ్స్‌మన్ ఏర్పాటు నిమిత్తం 2013లోనే చట్టం తెచ్చారు. సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన వ్యక్తి లోక్‌పాల్ చైర్మన్ పదవికి అర్హులు. లోక్‌పాల్‌లో చైర్మన్‌తో పాటు గరిష్టంగా 8 మంది సభ్యుల్ని నియమించొచ్చని సంబంధిత చట్టంలో నిర్దేశించారు. సభ్యుల్లో నలుగురికి న్యాయరంగ నేపథ్యముండాలి.
కనీసం 50 శాతం మంది సభ్యులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళా వర్గాల నుంచి ఉండాలి. చైర్మన్, సభ్యుల పదవీకాలం ఐదేళ్లు లేదా వారికి 70 ఏళ్లు వచ్చే వరకు(ఏది ముందైతే అది వర్తిస్తుంది). చైర్మన్‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా, సభ్యులకు సుప్రీం జడ్జీలతో సమానంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఒకసారి లోకాయుక్తగా నియమితులైన తరువాత ఆయన్ని తొలగించలేరు. బదిలీ చేయలేరు. సంబంధిత రాష్ట్ర అసెంబ్లీలో అభిశంసన తీర్మానం ఆమోదించడం ద్వారా లోకాయుక్తను పదవీచ్యుతుడిని చేయొచ్చు.
తండ్రీ జస్టిసే..
1952 మే 28న కోల్‌కతాలో పీసీ ఘోష్ జన్మించారు. ఆయన తండ్రి దివంగత జస్టిస్ శంభూ చంద్ర ఘోష్ కలకత్తా హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. కోల్‌కతాలోని సెయింట్ జేవియెర్ కాలేజీలో కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పీసీ ఘోష్.. కలకత్తా యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. 1976లో బార్ కౌన్సిల్‌లో పేరు నమోదుచేసుకున్నారు. 1997లో కలకత్తా హైకోర్టులో శాశ్వత జడ్జిగా పదోన్నతి పొందారు. తరువాత ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2013లో సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను హైకోర్టు నిర్దోషిగా తేల్చగా, ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై ఆమెకు జస్టిస్ ఘోష్ బెంచే 2015 జూలైలో నోటీసులు జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment