Former Judge
-
Lok Sabha Election 2024: అభిజిత్ గంగోపాధ్యాయ్‌కు ఈసీ నోటీసులు
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హైకోర్టు మాజీ జడ్జి, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయ్‌కు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీచేసింది. ‘మమతా బెనర్జీ మీరు ఎంతకు అమ్ముడుపోయారు? మీ రేటు 10 లక్షలు, ఎందుకంటే మీరు కేయా సేథ్తో మేకప్ చేయించుకుంటున్నారు. మమత అసలు మహిళేనా? అని నేను కొన్నిసార్లు ఆశ్చర్యపోతుంటా’ అని అభిజిత్ ఇటీవల ప్రచారసభలో వ్యాఖ్యానించారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఒబ్రియాన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. న్యాయవ్యవస్థలో ఉన్నత పదవిని నిర్వహించిన వ్యక్తి మహిళల గౌరవానికి భంగం కలించేలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. దీనిపై స్పందించిన ఈసీ ఈనెల 20వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా వివరణ ఇవ్వాలని అభిజిత్ గంగోపాధ్యాయ్‌కు నోటీసులు జారీచేసింది. -
జైభీమ్ సినిమాలో కోర్టు సీను డైలాగులు నేనే రాశా
(ఎ. అమరయ్య, సాక్షి ప్రత్యేక ప్రతినిధి, అమరావతి): ‘సత్వర న్యాయం కోసం పోరు కొనసాగాలి. దేశంలో కోర్టుల ద్వారా ప్రతి పౌరునికీ సత్వర న్యాయం అందాలి. జైళ్లలో మగ్గుతున్న వారిలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలే. వారికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత పౌరహక్కుల సంఘాలు, న్యాయవాదులపై ఉంది’ అని మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి, జై భీమ్ సినిమా స్ఫూర్తిప్రదాత జస్టిస్ కె.చంద్రు అభిప్రాయపడ్డారు. పీడిత వర్గాలకు న్యాయం అందించాలన్న దిశగా వచ్చిందే జైభీమ్ సినిమా అని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా బడుగులకు సత్వర న్యాయం అందుబాటులోకి రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. విజయవాడలో పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. చట్టాలను ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రజలు చట్టాలను బాగా చదివి, అర్థం చేసుకుని అన్వయ, ఆచరణలకు పూనుకోవాలి. అప్పుడే గాలి, నీరు లభించినంత సహజంగా న్యాయాన్నీ అందుకోగలం. హక్కుల కోసం పోరాడినప్పుడు, అసమానతలను నిలదీసినప్పుడు చట్టం తనని తాను లోతుగా శోధించుకునేలా చేయాలి. ఇది కేసులు వేసిన వారికి మాత్రమే దక్కే విజయం కాదు. ప్రజలు చైతన్యం కావడానికి ఉపయోగపడుతుంది. ప్రజాభిప్రాయం చట్టాలను, కోర్టులను ప్రభావితం చేస్తుంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం విజయం సాధించిన తీరు ఇదే చెబుతోంది. అణగారిన వర్గాలకు సత్వర న్యాయం కోసం అయినా పోరు కొనసాగాలి. అప్పుడే న్యాయమూర్తుల మైండ్‌సెట్ కూడా మారుతుంది. న్యాయవాదులు ఎంత తెలివిగా ప్రశ్నిస్తే తీర్పులు అంత ప్రభావవంతంగా వస్తాయి. 1999లో కోర్టు ధిక్కార చట్టానికి సవరణ జరిగింది. దాని ప్రకారం.. చేసిన వ్యాఖ్య నిజమైతే అది కోర్టు ధిక్కారం కిందకు రాదు. నేను జడ్జిగా ఉన్న ఆరేళ్లలో ఒక్క కోర్టు ధిక్కార కేసులో శిక్ష వేయలేదు. కులానికి వ్యతిరేకంగా పోరాటం జరగాలి. కుల వివక్ష, క్రూరత్వాలను అరికట్టడానికి కోర్టులు చట్టాలను విస్తృతంగా వినియోగంలోకి తేవాలి. జైభీమ్ సినిమా చెప్పిందదే ఇదో 28 ఏళ్ల నాటి ఘటన. నేను బాధితుల తరఫు లాయర్ని. తీర్పు ఇచ్చింది జస్టిస్ పీఎస్ మిశ్రా. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో తెగువ చూపిన మనుషుల కథ అది. వాళ్లు తమ జీవితాలను మెరుగుపరుచుకోవడమే కాదు.. సమాజంలో అందరి జీవితాలు మెరుగుపడటానికి తోడ్పడ్డారు. ఇలాంటి కేసుల్లో వాదోపవాదాలకు లాయర్లకు దొరికే అవకాశం తక్కువ. పాయింట్ సూటిగా, జడ్జిని తాకేలా క్లుప్తంగా ఉండాలి. అటువంటి అవకాశం నాకొచ్చింది. ఆ సినిమాలో హీరో కోర్టులో చెప్పే డైలాగులు తక్కువ. వేరే వాళ్లు రాస్తే పెడర్ధాలు వచ్చే అవకాశం ఉంటుందని నన్నే రాయమన్నారు. మానవ హక్కుల కోసం పోరాడిన మహావ్యక్తి జస్టిస్ కృష్ణయ్యర్ బొమ్మ కోర్టు సీన్లో పెట్టించింది కూడా నేనే. జై భీమ్ ఈవేళ ఓ నినాదమైంది. కార్మికవర్గాన్నీ, మేధావి వర్గాన్నీ ఒకే వేదిక మీదకు తెచ్చింది. ఈ సినిమా చూసిన వారందరి నుంచి రెండు ప్రశ్నలు వచ్చాయి. ఒకటి.. ప్రస్తుత సమాజంలోనూ ఇంత దుర్భరంగా జీవించే జాతులున్నాయా? ఇందుకు సిగ్గుపడాలి. రెండు.. పోలీసులు ఇంత క్రూరంగా ఉంటారా? అని. గిరిజన జీవితాలపై తీసిన సినిమాను ఓటీటీ ప్లాట్‌పారాల మీద విడుదల చేస్తారా? పేదలు చూసే అవకాశం లేదా? అని అడుగుతున్నారు. అందుకే మార్చిలో థియేటర్లలో విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ సినిమాలో నటించకపోయినా చాలా మంది నన్నే హీరో అన్నట్టుగా ప్రశంసిస్తున్నారు. రెండేళ్ల కిందట విజయవాడలో ఓ సెమినార్‌కి వస్తే పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈవేళ పరిస్థితి భిన్నంగా ఉంది. సెల్ఫీ ప్లీజ్ అంటున్నారు. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లేందుకు విమానం ఎక్కితే.. జై భీమ్ స్ఫూర్తిప్రదాత జస్టిస్ చంద్రు మన మధ్య ఉన్నారని ఎయిర్‌హోస్టెస్‌లు మైకుల్లో చెబుతున్నారు. ప్రస్తుతం నేనో సెలబ్రిటీని అయ్యా (నవ్వు). ఉత్తమ తీర్పులతోనే కోర్టుల ఔన్నత్యం ఉత్తమ తీర్పులతో కోర్టుల ఔన్నత్యం పెరుగుతుంది. కోర్టులేమన్నా శిలాశాసనాలా, రాజ్యంగమేమన్నా అంతిమ గ్రంథమా, అదో కాగితపు పులి, బంగాళాఖాతంలో విసిరి వేయండని 1975 దాకా చాలా మంది వాదించారు. జస్టిస్ చిన్నపరెడ్డి మీసా చట్టంపై ఇచ్చిన తీర్పు ఈ అభిప్రాయాన్ని తల్లకిందులు చేసింది. ఇప్పుడు మళ్లీ 1975 నాటికన్నా ఘోరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకు నిదర్శనం అయోధ్య తీర్పు. రాజ్యాంగం పరిష్కారం కాదన్న వారే ఈవేళ తొలినాటి రాజ్యాంగ రాతప్రతుల్ని (సెక్యులరిజం, సోషలిజం పదాలు లేని ప్రతి. 42వ సవరణ ద్వారా అవి రాజ్యాంగంలో చేరాయి) పంచిపెడుతున్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పదాలను అంబేడ్కర్ ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకున్నారని ఆరోపించిన వాళ్లే ఈవేళ ఆయన్ను కీర్తిస్తున్నారు. వాస్తవానికి ఆ పదాలను బుద్ధిజం నుంచి తీసుకున్నట్టు అంబేడ్కర్ 1954లో ఆకాశవాణి ప్రసంగంలో చెప్పారు. పర్యావరణాన్ని కాపాడుతోంది గిరిజనులే... పర్యావరణాన్ని నిజంగా కాపాడుతోంది గిరిజనులే. అటువంటి వారిపై అటవీ చట్టాల కింద కేసులు పెట్టి వేధిస్తున్నారు. నిజానికి ఎస్టీలలో సామాజిక మండళ్లు ఉంటాయి. సొంత ప్రవర్తనా నియమావళి ఉంది. దాని ప్రకారం నడుచుకుంటారు. కానీ ఇప్పటికీ డీనోటిఫైడ్ జాతుల పేరిట గిరిజనుల బతుకుల్ని బుగ్గి పాల్జేస్తున్నారు. అపరిష్కృత కేసుల్లో తిరిగి వాళ్లనే అరెస్ట్ చేస్తున్నారు. -
జస్టిస్ పీబీ సావంత్ ఇక లేరు
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ పీబీ సావంత్ (91 ) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఈ రోజు (ఫిబ్రవరి 15 సోమవారం) పూణేలోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. రేపు ఉదయం పూణేలో అంత్యక్రియలు నిర్వహించనున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. పూణేలో జరిగిన మొదటి ఎల్గార్ పరిషత్తుకు సమావేశానికి పీబీ సావంత్ అధ్యక్షత వహించారు. క్రమశిక్షణ గల న్యాయమూర్తిగా పేరుగాంచిన సావంత్ అనేక కీలకమైన తీర్పులను వెలువరించారు. 1995 లో పదవీ విరమణ అనంతర అనేక సామాజిక, ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా ఉంటున్నారు. సావంత్ అకాలమృతిపై పలువురు న్యాయవాదులతోపాటు, ఉదమ్యనేతలు, కార్యకర్తలు సంతాపం ప్రకటించారు. ప్రజా ఉద్యమాలకు ఆయన లేని తీరనిదంటూ పౌర హక్కుల కార్యకర్త తీస్తా సెతల్వాద్ నివాళులర్పించారు. న్యాయమూర్తిగా, కార్యకర్తగా, సామాజిక కార్యకర్తగా ప్రతీరంగంలోనూ రాణిస్తూ ప్రజా జీవితాన్ని గడిపిన ఆయన తామకు స్ఫూర్తి అని ప్రముఖ కార్యకర్త జస్టిస్ బిజి కోల్సే-పాటిల్ పేర్కొన్నారు. జస్టిస్ సావంత్ సామాజిక-న్యాయ రంగాలలో మంచి సంస్కర్త అనీ, న్యాయ వృత్తి ద్వారా సామాజిక న్యాయం కోసం పనిచేయమంటూ యువ న్యాయవాదులకు మార్గనిర్దేశనం చేసిన గొప్ప వ్యక్తి అని న్యాయవాది అసిమ్ సరోడ్ గుర్తు చేసుకున్నారు. న్యాయవాదిగా న్యాయానికి కట్టుబడి ఉండటమేకాదు, అణగారిన వర్గాల ఉద్యమాలకు అండగా నిలిచారంటూ ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ ట్వీట్ చేశారు. జస్టిస్ సావంత్‌కు భార్య జయశ్రీ, న్యాయవాది కుమారుడు విశ్వజీత్, ఇద్దరు కుమార్తెలు సుజాత, రాజశ్రీ ఉన్నారు. జూన్ 30, 1930 న జన్మించిన పీబీ సావంత్ ముంబై విశ్వవిద్యాలయం నుండి న్యాయ డిగ్రీ (ఎల్ఎల్బి) పొందారు. అనంతరం ముంబై హైకోర్టులో సుప్రీంకోర్టులో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించాడు. 1973లో ముంబై హైకోర్టు న్యాయమూర్తిగా, 1989లో సుప్రీంకోర్టు జడ్జ్‌గా నియమితులయ్యారు. ప్రధానంగా 2003లో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రులు నవాబ్ మాలిక్, పద్మసింగ్ పాటిల్, సురేష్ జైన్ విజయకుమార్ గవిత్ లపై అవినీతి ఆరోపణలపై దర్యాప్తునకు ఏర్పాటు చేసిన కమిషన్‌కు సావంత్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2005 ఆయన సమర్పించిన నివేదిక ఆధారంగా నవాబ్ మాలిక్, పద్మసింగ్ పాటిల్, సురేష్ జైన్ లపై అభియోగాలు నమోదయ్యాయి ఫలితంగా, ఇద్దరు క్యాబినెట్ మంత్రులు సురేష్ జైన్, నవాబ్ మాలిక్ రాజీనామా చేశారు. Look at his innocent smile , Justice P B Sawant is no more , truly a judge committed to Justice not only on the Bench but more importantly ,post retirement , remained committed to all social movements of the oppressed till the end RIP pic.twitter.com/UmPfKYgzsC — Indira Jaising (@IJaising) February 15, 2021 -
మమ్మల్నే ఎందుకు విమర్శిస్తారు?
న్యూఢిల్లీ: పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు వేరే పదవులు తీసుకుంటే ఎందుకు విమర్శిస్తారని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యుడు రంజన్ గొగొయ్ ప్రశ్నించారు. అదే యాక్టివిస్ట్ జడ్జీలు, రిటైర్ అయ్యాక డబ్బు సంపాదన కోసం మధ్యవర్తిత్వం నెరిపే న్యాయమూర్తులపై ఎలాంటి విమర్శలు ఎదురుకావని అన్నారు. ఢిల్లీలో నేషనల్ లా యూనివర్సిటీ పూర్వవిద్యార్థుల వెబినార్‌లో గొగొయ్ మాట్లాడారు. మాజీ జడ్జీల్లో మూడు కేటగిరీలు ఉన్నాయని అన్నారు. (తెల్లరంగు దుస్తులు ధరించండి) రిటైరయ్యాకా న్యాయవ్యవస్థ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే యాక్టవిస్టు జడ్జీలు, వివాదాలను పరిష్కరించడంలో లాయర్లకు సలహాలిస్తూ డబ్బులు సంపాదించే మాజీ జడ్జీలు, రిటైరయ్యాక ఏదో ఒక పదవి పొందే జడ్జీలు ఇలా 3 కేటగిరీలు ఉన్నప్పటికీ ఎప్పుడూ పదవులు తీసుకునే వారు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు. మిగతా రెండు విభాగాల వారిని ఎందుకు వదిలిపెడుతున్నారని నిలదీశారు. జడ్జీగా ఉన్నపుడు నిబద్ధతతో ఉంటే, ఆ తర్వాత ఎలాంటి ఉద్యోగానికి వెళ్లినా వచ్చే నష్టమేమిటని ఆయన ప్రశ్నించారు. న్యాయవ్యవస్థ విమర్శలకు వ్యతిరేకం కాదని.. నిజాయితీ, మేధో, విద్యాపరమైన కసరత్తు లేకుండా విమర్శలు చేయడం సరికాదని అన్నారు. జస్టిస్ రంజన్ గొగొయ్ 2018 అక్టోబర్ నుంచి 2019 నవంబర్ వరకు ప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అయోధ్య వివాదం వంటి కీలక కేసుల్లో చారిత్రక తీర్పులు వెలువరించిన ఆయనకు బీజేపీ రాజ్యసభ సీటు ఇచ్చింది. ఈ ఏడాది మార్చి 19న రాజ్యసభ సభ్యునిగా ఆయన ప్రమాణం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తుండగా ప్రతిపక్ష సభ్యులు ‘షేమ్, షేమ్’అని నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. ఒక సభ్యుని ప్రమాణ స్వీకారం చేస్తుండగా సభ్యులు ఇలా వాకౌట్ చేయడం రాజ్యసభ చరిత్రలో ఇదే మొదటిసారి. (చిన్న సంస్థలకు.. పెద్ద ఊరట!) -
లోక్‌పాల్‌గా జస్టిస్ ఘోష్ ప్రమాణం
న్యూఢిల్లీ: దేశంలో తొలి లోక్‌పాల్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ శనివారం రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి కోవింద్ ఆయన చేత ప్రమాణం చేయించారు. ప్రజాప్రతినిధుల అవినీతికి సంబంధించిన కేసులను విచారించే లోక్‌పాల్, లోకాయుక్తా చట్ట్టం 2013లో ఆమోదం పొందింది. లోక్‌పాల్‌లో జ్యుడీషియల్ సభ్యులుగా జస్టిస్ దిలీప్ బీ భోసాలే, జస్టిస్ ప్రదీప్ కుమార్ మొహంతి, జస్టిస్ అభిలాష కుమారి, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అజయ్‌కుమార్ త్రిపాఠిలు నియమితులయ్యారు. నాన్–జ్యుడీషియల్ సభ్యులుగా పారా మిలటరీ దళమైన సశస్త్ర సీమాబల్ (ఎస్సీబీ) మాజీ చీఫ్ అర్చనా రామసుందరం, మహారాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ దినేష్‌కుమార్ జైన్, మాజీ ఐఆర్ఎస్ అధికారి మహేంద్ర సింగ్, గుజరాత్ కేడర్ మాజీ ఐఏఎస్ ఇంద్రజిత్ ప్రసాద్ గౌతమ్‌లు వ్యవహరించనున్నారు. నిబంధనల ప్రకారం లోక్‌పాల్ కమిటీలో చైర్పర్సన్, గరిష్టంగా ఎనిమిది మంది సభ్యులు ఉండాలి. అందులో నలుగురు జ్యుడీషియల్ సభ్యులతోపాటు 50 శాతానికి తగ్గకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలు, మహిళలు ఉండాలని నిబంధనల్లో ఉంది. కమిటీలోని చైర్పర్సన్, సభ్యుల పదవీకాలం ఐదేళ్లు లేదా 70 ఏళ్ల వయసు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారు. భారత ప్రధాన న్యాయమూర్తికి ఉండే జీతాభత్యాలే చైర్‌పర్సన్‌కు, సుప్రీంకోర్టు జడ్జీలకు ఉండే జీతాభత్యాలే సభ్యులకు ఉంటాయి. -
తొలి లోక్‌పాల్ పీసీ ఘోష్!
న్యూఢిల్లీ: ఎట్టకేలకు లోక్‌పాల్ నియామకం కొలిక్కి వచ్చింది. అవినీతి వ్యతిరేక అంబుడ్స్‌మన్ వ్యవస్థగా పిలుస్తున్న లోక్‌పాల్ తొలి చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్(66) పేరును కేంద్రం ఖరారుచేసినట్లు తెలిసింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఆదివారం ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సిఫార్సు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే, న్యాయ కోవిదుడు ముకుల్ రోహత్గీ సభ్యులుగా ఉన్నారు. అయితే కమిటీ జస్టిస్ ఘోష్ పేరును ఖరారుచేసిన శుక్రవారం నాటి సమావేశానికి మల్లికార్జున ఖర్గే గైర్హాజరయ్యారు. లోక్‌పాల్ తొలి చైర్మన్ పదవికి సెర్చ్ కమిటీ షార్ట్‌లిస్ట్ చేసిన తుది 10 మందిలో జస్టిస్ ఘోష్ కూడా ఒకరు. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ అర్హుల జాబితాను కేంద్రానికి పంపింది. అందులో నుంచి జస్టిస్ ఘోష్ పేరును ప్రభుత్వం పరిశీలించినట్లు తెలుస్తోంది. తొలి లోక్‌పాల్ చైర్మన్, సభ్యుల నియామకంపై ఈ వారంలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్‌పాల్ నియామకంపై పడిన ముందడుగును ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే స్వాగతించారు. 48 ఏళ్లుగా ప్రజలు చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించిందని హర్షం వ్యక్తం చేశారు. జనలోక్‌పాల్ కోసం అన్నా హజారే సుదీర్ఘ ఉద్యమం చేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ ఘోష్ 2017 మే 27న సుప్రీంకోర్టు జడ్జిగా పదవీ విరమణ పొందారు. అదే ఏడాది జూన్ 29 నుంచి జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో సభ్యుడిగా కొనసాగుతున్నారు. పరిధిలోకి ప్రధాని కూడా.. ప్రధానమంత్రి సహా ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులపై వచ్చే అవినీతి ఆరోపణలపై విచారణ జరపడమే లోక్‌పాల్ ప్రధాన విధి. సాయుధ బలగాలు లోక్‌పాల్ పరిధిలోకి రావు. విచారణ కొనసాగుతుండగానే అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన ఆస్తులన్నీ జప్తు చేసే అధికారం లోక్‌పాల్‌కు దఖలుపరిచారు. అంబుడ్స్‌మన్ అప్పగించిన కేసులను విచారిస్తున్న సమయంలో సీబీఐ సహా ఇతర దర్యాప్తు సంస్థలపై పర్యవేక్షణాధికారం లోక్‌పాల్‌కు కల్పించారు. లోక్‌పాల్ అప్పగించిన కేసును దర్యాప్తు చేసిన అధికారిని దాని అనుమతి లేకుండా బదిలీ చేయరాదు. కేంద్రంలో లోక్‌పాల్‌గా, రాష్ట్ర స్థాయిలో లోకాయుక్తగా వ్యవహరిస్తున్న ఈ అవినీతి వ్యతిరేక అంబుడ్స్‌మన్ ఏర్పాటు నిమిత్తం 2013లోనే చట్టం తెచ్చారు. సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన వ్యక్తి లోక్‌పాల్ చైర్మన్ పదవికి అర్హులు. లోక్‌పాల్‌లో చైర్మన్‌తో పాటు గరిష్టంగా 8 మంది సభ్యుల్ని నియమించొచ్చని సంబంధిత చట్టంలో నిర్దేశించారు. సభ్యుల్లో నలుగురికి న్యాయరంగ నేపథ్యముండాలి. కనీసం 50 శాతం మంది సభ్యులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, మహిళా వర్గాల నుంచి ఉండాలి. చైర్మన్, సభ్యుల పదవీకాలం ఐదేళ్లు లేదా వారికి 70 ఏళ్లు వచ్చే వరకు(ఏది ముందైతే అది వర్తిస్తుంది). చైర్మన్‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా, సభ్యులకు సుప్రీం జడ్జీలతో సమానంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఒకసారి లోకాయుక్తగా నియమితులైన తరువాత ఆయన్ని తొలగించలేరు. బదిలీ చేయలేరు. సంబంధిత రాష్ట్ర అసెంబ్లీలో అభిశంసన తీర్మానం ఆమోదించడం ద్వారా లోకాయుక్తను పదవీచ్యుతుడిని చేయొచ్చు. తండ్రీ జస్టిసే.. 1952 మే 28న కోల్‌కతాలో పీసీ ఘోష్ జన్మించారు. ఆయన తండ్రి దివంగత జస్టిస్ శంభూ చంద్ర ఘోష్ కలకత్తా హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. కోల్‌కతాలోని సెయింట్ జేవియెర్ కాలేజీలో కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పీసీ ఘోష్.. కలకత్తా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ పట్టా పొందారు. 1976లో బార్ కౌన్సిల్లో పేరు నమోదుచేసుకున్నారు. 1997లో కలకత్తా హైకోర్టులో శాశ్వత జడ్జిగా పదోన్నతి పొందారు. తరువాత ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2013లో సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితను హైకోర్టు నిర్దోషిగా తేల్చగా, ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై ఆమెకు జస్టిస్ ఘోష్ బెంచే 2015 జూలైలో నోటీసులు జారీచేసింది. -
జోహ్రిపై విచారణకు కమిటీ
బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి విచారణ జరిపేందుకు సీఓఏ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. అలహాబాద్ హైకోర్టు మాజీ జడ్జి రాకేశ్ శర్మ, సీబీఐ మాజీ డైరెక్టర్ పీసీ శర్మ, ఢిల్లీ మహిళా హక్కుల సంఘం మాజీ చైర్పర్సన్ బర్ఖాసింగ్ ఇందులో ఉన్నారు. ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక ఇవ్వనుంది. -
ప్రధాన న్యాయమూర్తే సుప్రీం!
న్యూఢిల్లీ: గత రెండు రోజులుగా సుప్రీంకోర్టులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానంలోని సీనియర్ న్యాయమూర్తుల్లో నెలకొన్న విభేదాలు తెరపైకి వచ్చాయి. ఒడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇష్రాత్ మస్రూర్ ఖుదూసిపై వచ్చిన అవినీతి ఆరోపణల విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసే దిశగా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ గురువారం జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌ల ధర్మాసనం ముందుకు వచ్చింది. ప్రధాన న్యాయమూర్తి తరువాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ జే చలమేశ్వర్. ఈ కేసు విచారణను ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్లైన ఐదుగురు న్యాయమూర్తులతో ఈ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేసు విచారణ సందర్భంగానే.. సంబంధిత పిటిషన్ వేసిన ఎన్జీవో ‘క్యాంపెయిన్ ఫర్ జ్యుడీషియల్ అకౌంటబులిటీ’, న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై ఆరోపణలున్నాయని వాదించారు. అనూహ్యంగా శుక్రవారం మధ్యాహ్నం అత్యవసరంగా సమావేశమైన సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. జస్టిస్ చలమేశ్వర్ ఇచ్చిన ఆదేశాలను, ఆయన ఏర్పాటు చేసిన రాజ్యాంగ ధర్మాసనాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ ధర్మాసనాలను ఏర్పాటు చేసే అధికారం ప్రధాన న్యాయమూర్తికి మాత్రమే ఉంటుందని, ఆయనే ఈ ఉన్నత న్యాయస్థానానికి అధిపతి అని స్పష్టం చేసింది. ద్విసభ్య లేదా త్రిసభ్య ధర్మాసనాలు ఓ నిర్ధిష్ట బెంచ్‌ను ఏర్పాటు చేయాలంటూ సీజేఐని ఆదేశించలేవని స్పష్టం చేసింది. అలాగే, ఏ న్యాయమూర్తి కూడా సీజేఐ కేటాయించకుండా, సొంతంగా కేసులను విచారించకూడదని పేర్కొంది. న్యాయస్థానానికి అధిపతి అయిన సీజేఐకే ధర్మాసనాల ఏర్పాటు, అవి విచారణ జరిపే అంశాల కేటాయింపు అధికారం ఉంటుందని తేల్చిచెప్పింది. ఆ విధానం న్యాయవ్యవస్థ క్రమశిక్షణ, న్యాయస్థానం మర్యాద అని పేర్కొంది. ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా ఉన్న ఏ ఆదేశాలైనా చెల్లబోవని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా స్పష్టం చేశారు. జడ్జీల పేరుతో లంచం అంశాన్ని రెండు వారాల తర్వాత సరైన బెంచ్‌కు కేటాయిస్తామన్నారు. ప్రత్యేకంగా ఏ న్యాయమూర్తి పేరును ప్రస్తావించకుండానే.. ‘రోజూ వందలాదిగా పిటిషన్లు దాఖలవుతుంటాయి. ఇలా ఆదేశాలిస్తూ పోతే.. కోర్టులను నడపలేం’ అని వ్యాఖ్యలు చేశారు. కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సూరి, ఇతర సీనియర్ న్యాయవాదులతో నిండిపోయిన కోర్టు హాళ్లో ఈ విచారణ సాగింది. ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆగ్రహానికి లోనయ్యారు. గట్టిగట్టిగా మాట్లాడుతూ.. ఒడిశా హైకోర్టు న్యాయమూర్తికి సంబంధించిన అవినీతి కేసులో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో సీజేఐ పేరు ఉందని, ఈ విచారణ బెంచ్ నుంచి జస్టిస్ మిశ్రా తొలగి పోవాలన్నారు. ఎఫ్ఐఆర్లో ఏముందో చదవాలని, గట్టిగట్టిగా మాట్లాడొద్దని జస్టిస్ మిశ్రా భూషణ్‌ను హెచ్చరించారు. కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాల్సి వస్తుం దని మందలించారు. దానిపై, ధిక్కరణ నోటీసులు ఇవ్వండని భూషణ్ సమాధానమిచ్చారు. తనను మాట్లాడనివ్వడం లేదంటూ కోర్టు హాలు నుంచి వెళ్లిపోయారు. -
మాజీ జడ్జి ప్రభాకర్‌రావు అనుమానాస్పద మృతి
‘బెయిల్ డీల్’ కేసులో నిందితుడు ఆదివారం మారేడుపల్లిలోని ఇంట్లో మృతిచెందిన ప్రభాకర్‌రావు గుండెపోటుతోనే మృతి చెందారని చెబుతున్న కుటుంబ సభ్యులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు హైదరాబాద్: మూడేళ్ల కింద సంచలనం సృష్టించిన ‘బెయిల్ డీల్’ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ జడ్జి డి.ప్రభాకర్‌రావు అనుమానాస్పద స్థితిలో మరణించారు. హైదరాబాద్‌లోని తుకారామ్‌గేట్ ప్రాంతంలో ఉన్న ప్రభాకర్‌రావు నివాసంలో ఆదివారం ఉదయం ఆయన మృతదేహాన్ని గుర్తించారు. దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు... మృతదేహానికి సోమవారం గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ప్రభాకర్‌రావు గుం డెపోటుతో చనిపోయారని తెలుస్తోందని, ఇంట్లో ఎవరూలేని సమయంలో జరగడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని గోపాలపురం ఏసీపీ కె.శివకుమార్ వెల్లడిం చారు. ప్రభాకర్‌రావు గుండెపోటుతోనే మరణించారని, తమకెలాంటి అనుమానాలు లేవని ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. తుకారామ్‌గేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభాకర్‌రావుకు (62) భార్య మార్లిన్ ప్రభాలత, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి కుటుంబం కొంపల్లిలో ఉంటోంది. ప్రభాకర్‌రావు అప్పుడప్పుడు మారేడ్‌పల్లి ప్రాంతంలో ఉన్న తమ మరో ఇంటికి వచ్చి ఉంటుంటారు. ఈ క్రమంలోనే శనివారం మారేడ్‌పల్లిలోని ఇంటికి వచ్చిన ప్రభాకర్‌రావు రాత్రి అక్కడే ఉండిపోయారు. మరుసటిరోజు ఆదివారం ఉదయం చర్చికి వెళదామంటూ ప్రభాకర్‌రావుకు ఆయన కుమారుడు డేవిడ్ ప్రశాంత్ ఫోన్ చేశారు. ఎన్నిసార్లు కాల్ చేసినా స్పందన లేకపోవడంతో... మారేడుపల్లిలోని ఇంటికి వచ్చారు. ఎంతసేపు పిలిచినా ప్రభాకర్‌రావు తలుపు తీయకపోవడంతో.. కిటికీలోంచి చెయ్యిపెట్టి తలుపు బోల్ట్ తొలగించి, లోపలికి వెళ్లారు. పడకగదిలో మంచంపై ఉన్న ప్రభాకర్‌రావును లేపడానికి ప్రయత్నించినా చలనం లేకపోవడంతో.. తల్లికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా (ఐపీసీ సెక్షన్-174 కింద) కేసు నమోదు చేశారు. ప్రభాకర్‌రావు గుండెపోటుతోనే మరణించారని పోస్టుమార్టం చేసిన ఫోరెన్సిక్ వైద్యులు నిర్ధారించారు. ఆయన మృతదేహానికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1987లో న్యాయమూర్తిగా నియామకమైన ప్రభాకర్‌రావు.. ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో పలు హోదాల్లో విధులు నిర్వహించారు. ఎన్నికల సంఘం న్యాయసలహాదారుగానూ పనిచేశారు. ‘బెయిల్ డీల్’ కేసుతో వార్తల్లోకి... ఓఎంసీ కేసులో నిందితుడిగా ఉన్న గాలి జనార్దనరెడ్డిని సీబీఐ అధికారులు 2011 సెప్టెంబర్‌లో అరెస్టు చేశారు. 2012 మే 11న అప్పటి సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పట్టాభి రామారావు జనార్దనరెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ బెయిల్ మంజూరు వ్యవహారంలో రూ.10 కోట్లు చేతులు మారాయనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలతో... ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. అప్పటి సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి పట్టాభి రామారావు, శ్రీకాకుళం జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జి ప్రభాకర్‌రావు, మరో న్యాయమూర్తి లక్ష్మీనరసింహారావు, మాజీ న్యాయమూర్తి చలపతిరావు, గాలి జనార్దనరెడ్డి సోదరుడు సోమశేఖర్‌రెడ్డి, కంప్లి ఎమ్మెల్యే సురేష్‌బాబు, హైదరాబాద్‌కు చెందిన రౌడీషీటర్ యాదగిరిరావు తదితరులపై వేర్వేరుగా రెండు కేసులు నమోదు చేసింది. దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్లు కూడా దాఖలు చేసింది. అప్పట్లోనే హైకోర్టు ఈ ముగ్గురు జడ్జీలను విధుల్లోంచి తొలగించింది కూడా. ప్రస్తుతం ఈ కేసులు తుది విచారణ దశలో ఉన్నాయి. అయితే ఈ బెయిల్ డీల్ వ్యవహారంలో ప్రభాకర్‌రావు కీలకపాత్ర పోషించారనే ఆరోపణలున్నాయి.