(ఎ. అమరయ్య, సాక్షి ప్రత్యేక ప్రతినిధి, అమరావతి): ‘సత్వర న్యాయం కోసం పోరు కొనసాగాలి. దేశంలో కోర్టుల ద్వారా ప్రతి పౌరునికీ సత్వర న్యాయం అందాలి. జైళ్లలో మగ్గుతున్న వారిలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలే. వారికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత పౌరహక్కుల సంఘాలు, న్యాయవాదులపై ఉంది’ అని మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి, జై భీమ్ సినిమా స్ఫూర్తిప్రదాత జస్టిస్ కె.చంద్రు అభిప్రాయపడ్డారు. పీడిత వర్గాలకు న్యాయం అందించాలన్న దిశగా వచ్చిందే జైభీమ్ సినిమా అని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా బడుగులకు సత్వర న్యాయం అందుబాటులోకి రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. విజయవాడలో పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
చట్టాలను ప్రజలు అర్థం చేసుకోవాలి
ప్రజలు చట్టాలను బాగా చదివి, అర్థం చేసుకుని అన్వయ, ఆచరణలకు పూనుకోవాలి. అప్పుడే గాలి, నీరు లభించినంత సహజంగా న్యాయాన్నీ అందుకోగలం. హక్కుల కోసం పోరాడినప్పుడు, అసమానతలను నిలదీసినప్పుడు చట్టం తనని తాను లోతుగా శోధించుకునేలా చేయాలి. ఇది కేసులు వేసిన వారికి మాత్రమే దక్కే విజయం కాదు. ప్రజలు చైతన్యం కావడానికి ఉపయోగపడుతుంది. ప్రజాభిప్రాయం చట్టాలను, కోర్టులను ప్రభావితం చేస్తుంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం విజయం సాధించిన తీరు ఇదే చెబుతోంది.
అణగారిన వర్గాలకు సత్వర న్యాయం కోసం అయినా పోరు కొనసాగాలి. అప్పుడే న్యాయమూర్తుల మైండ్‌సెట్ కూడా మారుతుంది. న్యాయవాదులు ఎంత తెలివిగా ప్రశ్నిస్తే తీర్పులు అంత ప్రభావవంతంగా వస్తాయి. 1999లో కోర్టు ధిక్కార చట్టానికి సవరణ జరిగింది. దాని ప్రకారం.. చేసిన వ్యాఖ్య నిజమైతే అది కోర్టు ధిక్కారం కిందకు రాదు. నేను జడ్జిగా ఉన్న ఆరేళ్లలో ఒక్క కోర్టు ధిక్కార కేసులో శిక్ష వేయలేదు. కులానికి వ్యతిరేకంగా పోరాటం జరగాలి. కుల వివక్ష, క్రూరత్వాలను అరికట్టడానికి కోర్టులు చట్టాలను విస్తృతంగా వినియోగంలోకి తేవాలి.
జైభీమ్ సినిమా చెప్పిందదే
ఇదో 28 ఏళ్ల నాటి ఘటన. నేను బాధితుల తరఫు లాయర్ని. తీర్పు ఇచ్చింది జస్టిస్ పీఎస్ మిశ్రా. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో తెగువ చూపిన మనుషుల కథ అది. వాళ్లు తమ జీవితాలను మెరుగుపరుచుకోవడమే కాదు.. సమాజంలో అందరి జీవితాలు మెరుగుపడటానికి తోడ్పడ్డారు. ఇలాంటి కేసుల్లో వాదోపవాదాలకు లాయర్లకు దొరికే అవకాశం తక్కువ. పాయింట్ సూటిగా, జడ్జిని తాకేలా క్లుప్తంగా ఉండాలి. అటువంటి అవకాశం నాకొచ్చింది.
ఆ సినిమాలో హీరో కోర్టులో చెప్పే డైలాగులు తక్కువ. వేరే వాళ్లు రాస్తే పెడర్ధాలు వచ్చే అవకాశం ఉంటుందని నన్నే రాయమన్నారు. మానవ హక్కుల కోసం పోరాడిన మహావ్యక్తి జస్టిస్ కృష్ణయ్యర్ బొమ్మ కోర్టు సీన్‌లో పెట్టించింది కూడా నేనే. జై భీమ్ ఈవేళ ఓ నినాదమైంది. కార్మికవర్గాన్నీ, మేధావి వర్గాన్నీ ఒకే వేదిక మీదకు తెచ్చింది. ఈ సినిమా చూసిన వారందరి నుంచి రెండు ప్రశ్నలు వచ్చాయి. ఒకటి.. ప్రస్తుత సమాజంలోనూ ఇంత దుర్భరంగా జీవించే జాతులున్నాయా? ఇందుకు సిగ్గుపడాలి. రెండు.. పోలీసులు ఇంత క్రూరంగా ఉంటారా? అని. గిరిజన జీవితాలపై తీసిన సినిమాను ఓటీటీ ప్లాట్‌పారాల మీద విడుదల చేస్తారా? పేదలు చూసే అవకాశం లేదా? అని అడుగుతున్నారు. అందుకే మార్చిలో థియేటర్లలో విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఆ సినిమాలో నటించకపోయినా చాలా మంది నన్నే హీరో అన్నట్టుగా ప్రశంసిస్తున్నారు. రెండేళ్ల కిందట విజయవాడలో ఓ సెమినార్‌కి వస్తే పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈవేళ పరిస్థితి భిన్నంగా ఉంది. సెల్ఫీ ప్లీజ్ అంటున్నారు. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లేందుకు విమానం ఎక్కితే.. జై భీమ్ స్ఫూర్తిప్రదాత జస్టిస్ చంద్రు మన మధ్య ఉన్నారని ఎయిర్‌హోస్టెస్‌లు మైకుల్లో చెబుతున్నారు. ప్రస్తుతం నేనో సెలబ్రిటీని అయ్యా (నవ్వు).
ఉత్తమ తీర్పులతోనే కోర్టుల ఔన్నత్యం
ఉత్తమ తీర్పులతో కోర్టుల ఔన్నత్యం పెరుగుతుంది. కోర్టులేమన్నా శిలాశాసనాలా, రాజ్యంగమేమన్నా అంతిమ గ్రంథమా, అదో కాగితపు పులి, బంగాళాఖాతంలో విసిరి వేయండని 1975 దాకా చాలా మంది వాదించారు. జస్టిస్ చిన్నపరెడ్డి మీసా చట్టంపై ఇచ్చిన తీర్పు ఈ అభిప్రాయాన్ని తల్లకిందులు చేసింది. ఇప్పుడు మళ్లీ 1975 నాటికన్నా ఘోరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకు నిదర్శనం అయోధ్య తీర్పు.
రాజ్యాంగం పరిష్కారం కాదన్న వారే ఈవేళ తొలినాటి రాజ్యాంగ రాతప్రతుల్ని (సెక్యులరిజం, సోషలిజం పదాలు లేని ప్రతి. 42వ సవరణ ద్వారా అవి రాజ్యాంగంలో చేరాయి) పంచిపెడుతున్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పదాలను అంబేడ్కర్ ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకున్నారని ఆరోపించిన వాళ్లే ఈవేళ ఆయన్ను కీర్తిస్తున్నారు. వాస్తవానికి ఆ పదాలను బుద్ధిజం నుంచి తీసుకున్నట్టు అంబేడ్కర్ 1954లో
ఆకాశవాణి ప్రసంగంలో చెప్పారు.
పర్యావరణాన్ని కాపాడుతోంది గిరిజనులే...
పర్యావరణాన్ని నిజంగా కాపాడుతోంది గిరిజనులే. అటువంటి వారిపై అటవీ చట్టాల కింద కేసులు పెట్టి వేధిస్తున్నారు. నిజానికి ఎస్టీలలో సామాజిక మండళ్లు ఉంటాయి. సొంత ప్రవర్తనా నియమావళి ఉంది. దాని ప్రకారం నడుచుకుంటారు. కానీ ఇప్పటికీ డీనోటిఫైడ్ జాతుల పేరిట గిరిజనుల బతుకుల్ని బుగ్గి పాల్జేస్తున్నారు. అపరిష్కృత కేసుల్లో తిరిగి వాళ్లనే అరెస్ట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment