మాజీ జడ్జి ప్రభాకర్‌రావు అనుమానాస్పద మృతి
‘బెయిల్ డీల్’ కేసులో నిందితుడు
ఆదివారం మారేడుపల్లిలోని ఇంట్లో మృతిచెందిన ప్రభాకర్‌రావు
గుండెపోటుతోనే మృతి చెందారని చెబుతున్న కుటుంబ సభ్యులు
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్: మూడేళ్ల కింద సంచలనం సృష్టించిన ‘బెయిల్ డీల్’ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ జడ్జి డి.ప్రభాకర్‌రావు అనుమానాస్పద స్థితిలో మరణించారు. హైదరాబాద్‌లోని తుకారామ్‌గేట్ ప్రాంతంలో ఉన్న ప్రభాకర్‌రావు నివాసంలో ఆదివారం ఉదయం ఆయన మృతదేహాన్ని గుర్తించారు. దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు... మృతదేహానికి సోమవారం గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ప్రభాకర్‌రావు గుం డెపోటుతో చనిపోయారని తెలుస్తోందని, ఇంట్లో ఎవరూలేని సమయంలో జరగడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని గోపాలపురం ఏసీపీ కె.శివకుమార్ వెల్లడిం చారు. ప్రభాకర్‌రావు గుండెపోటుతోనే మరణించారని, తమకెలాంటి అనుమానాలు లేవని ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు.
తుకారామ్‌గేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభాకర్‌రావుకు (62) భార్య మార్లిన్ ప్రభాలత, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి కుటుంబం కొంపల్లిలో ఉంటోంది. ప్రభాకర్‌రావు అప్పుడప్పుడు మారేడ్‌పల్లి ప్రాంతంలో ఉన్న తమ మరో ఇంటికి వచ్చి ఉంటుంటారు. ఈ క్రమంలోనే శనివారం మారేడ్‌పల్లిలోని ఇంటికి వచ్చిన ప్రభాకర్‌రావు రాత్రి అక్కడే ఉండిపోయారు. మరుసటిరోజు ఆదివారం ఉదయం చర్చికి వెళదామంటూ ప్రభాకర్‌రావుకు ఆయన కుమారుడు డేవిడ్ ప్రశాంత్ ఫోన్ చేశారు. ఎన్నిసార్లు కాల్ చేసినా స్పందన లేకపోవడంతో... మారేడుపల్లిలోని ఇంటికి వచ్చారు. ఎంతసేపు పిలిచినా ప్రభాకర్‌రావు తలుపు తీయకపోవడంతో.. కిటికీలోంచి చెయ్యిపెట్టి తలుపు బోల్ట్ తొలగించి, లోపలికి వెళ్లారు. పడకగదిలో మంచంపై ఉన్న ప్రభాకర్‌రావును లేపడానికి ప్రయత్నించినా చలనం లేకపోవడంతో.. తల్లికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా (ఐపీసీ సెక్షన్-174 కింద) కేసు నమోదు చేశారు. ప్రభాకర్‌రావు గుండెపోటుతోనే మరణించారని పోస్టుమార్టం చేసిన ఫోరెన్సిక్ వైద్యులు నిర్ధారించారు. ఆయన మృతదేహానికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1987లో న్యాయమూర్తిగా నియామకమైన ప్రభాకర్‌రావు.. ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో పలు హోదాల్లో విధులు నిర్వహించారు. ఎన్నికల సంఘం న్యాయసలహాదారుగానూ పనిచేశారు.
‘బెయిల్ డీల్’ కేసుతో వార్తల్లోకి...
ఓఎంసీ కేసులో నిందితుడిగా ఉన్న గాలి జనార్దనరెడ్డిని సీబీఐ అధికారులు 2011 సెప్టెంబర్‌లో అరెస్టు చేశారు. 2012 మే 11న అప్పటి సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పట్టాభి రామారావు జనార్దనరెడ్డికి బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ బెయిల్ మంజూరు వ్యవహారంలో రూ.10 కోట్లు చేతులు మారాయనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలతో... ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. అప్పటి సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి పట్టాభి రామారావు, శ్రీకాకుళం జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జి ప్రభాకర్‌రావు, మరో న్యాయమూర్తి లక్ష్మీనరసింహారావు, మాజీ న్యాయమూర్తి చలపతిరావు, గాలి జనార్దనరెడ్డి సోదరుడు సోమశేఖర్‌రెడ్డి, కంప్లి ఎమ్మెల్యే సురేష్‌బాబు, హైదరాబాద్‌కు చెందిన రౌడీషీటర్ యాదగిరిరావు తదితరులపై వేర్వేరుగా రెండు కేసులు నమోదు చేసింది. దర్యాప్తు పూర్తిచేసి చార్జిషీట్లు కూడా దాఖలు చేసింది. అప్పట్లోనే హైకోర్టు ఈ ముగ్గురు జడ్జీలను విధుల్లోంచి తొలగించింది కూడా. ప్రస్తుతం ఈ కేసులు తుది విచారణ దశలో ఉన్నాయి. అయితే ఈ బెయిల్ డీల్ వ్యవహారంలో ప్రభాకర్‌రావు కీలకపాత్ర పోషించారనే ఆరోపణలున్నాయి.