లోక్‌పాల్‌ను ఎంపిక చేసేందుకు సెలక్షన్ కమిటీకి ఫిబ్రవరి ఆఖరులోగా పేర్ల జాబితా సమర్పించాలని సెర్చ్ కమిటీ అధ్యక్షుడు జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్‌ని సుప్రీంకోర్టు గురువారంనాడు ఆదేశించింది. 2018 మార్చి నుంచి సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి అనేక అవ కాశాలు ఇచ్చింది. కానీ వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. నత్తనడక నడుస్తోంది. 2014 ఎన్నికల ప్రచారంలో తరచుగా వినిపించిన మాట లోక్‌పాల్. యూపీఏ ప్రభుత్వం అవినీతిమయమైనదని దుయ్యబడుతూ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే లోక్‌పాల్‌ను నియమిస్తానని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ ప్రకటించారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి (మే 26, 2014) నాలుగేళ్ళ ఎనిమిది మాసాలు గడిచిపోయినాయి. ఇంతవరకూ లోక్‌పాల్‌ను నియమించలేదు. లోక్‌పాల్‌ను నియమించాలనే పట్టింపు ప్రధానికి ఉంటే ఆ పని ఎప్పుడో జరిగేది. ఆ సంకల్పం లేదు. అంతే. ఎన్నికల ప్రచారంలో చేసిన బాసలు కపట రాజకీయంలో భాగమే అనుకోవాలి. గుజ రాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన 12 సంవత్సరాలలో కూడా మోదీ లోకాయుక్తను నియమిం చలేదు.
ప్రజాప్రతినిధులలో, ప్రజాసేవకులలో అవినీతిని అరికట్టేందుకు లోక్‌పాల్‌ను నియమించా లన్న ఉద్యమం 1960లలో మొదలయింది. 2010లో ఊపందుకున్నది. అరుణారాయ్ నాయక త్వంలో ప్రజల హక్కుకోసం జాతీయ ఉద్యమం (నేషనల్ కేంపేన్ ఫర్ పీపుల్స్ రైట్స్– ఎన్సీపీ ఆర్‌ఐ) జన్‌లోక్‌పాల్ బిల్లు తయారు చేసేందుకు ముగ్గురు సభ్యులతో ఒక కమిటీ నియమించింది. అరవింద్ కేజ్రీవాల్, ప్రశాంత్‌భూషన్, శేఖర్‌సింగ్‌లతో కూడిన కమిటీ ఒక ముసాయిదా బిల్లును రూపొందించారు. దాని ఆధారంగా 2011 జనవరిలో ఢిల్లీలో రాంలీలా మైదానంలో పెద్ద బహిరం గసభ జరిగింది. మూడు మాసాల అనంతరం 2011 ఏప్రిల్‌లో అన్నాహజారే జంతర్‌మంతర్‌లో లోక్‌పాల్ చట్టం కోసం నిరవధిక నిరాహారదీక్ష ఆరంభించారు. ప్రభుత్వం దిగివచ్చింది. బిల్లుకు తుదిరూపం ఇవ్వడానికి తొమ్మిదిమంది ప్రముఖులతో ఒక సంయుక్త సంఘాన్ని అన్నా హజారే నియమించారు. ఇందులో అయిదుగురు సీనియర్ కేంద్ర మంత్రులూ, నలుగురు పౌరసమాజ ప్రముఖులూ ఉన్నారు. ప్రణబ్‌కుమార్ ముఖర్జీ, కపిల్ శిబ్బల్, సల్మాన్ ఖుర్షీద్, వీరప్పమొయిలీ, పి చిదంబరం కేంద్ర మంత్రులు. శాంతిభూషణ్, సంతోష్‌హెగ్డే, కేజ్రీవాల్, ప్రశాంత్‌భూషణ్ పౌర సమాజం ప్రతినిధులు. సంయుక్త సంఘం రెండు అంశాలపైన విభేదాల కారణంగా బిల్లును ఖరారు చేయలేకపోయింది.
సెలక్షన్ కమిటీలో రాజకీయ ప్రముఖులు ఉండాలా లేక రాజకీయేతర ప్రముఖులు ఉండాలా అనే అంశంపైనా, సీబీఐ లోక్‌పాల్ కిందికి రావాలా, లేదా అనే అంశంపైనా స్పష్టత కొరవడింది. చివరికి 2013 డిసెంబర్‌లో పార్లమెంటు ఆమోదించిన బిల్లులో ఈ రెండు అంశాల విషయంలో ఉద్యమకారులకు నిరాశ కలిగింది. సెలక్షన్ కమిటీలో ప్రధాని, లోక్‌సభ స్పీకర్, ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నాయకుడూ, ఒక న్యాయకోవిదుడూ ఉండాలని బిల్లులో ఉంది. సీబీఐ లోక్‌పాల్ పరిధిలోకి రాదని కూడా తేల్చారు. అవినీతిపై పోరాటానికి ఏదో ఒక చట్టం వస్తే అంతే చాలునని హజారే, తదితరులు భావించారు. 2014 జనవరి ఒకటో తేదీన జీవో వచ్చింది. తర్వాత నియమనిబంధనలు నిర్ణయించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్, సభాపతి మీరాకుమార్, ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దత్తు, న్యాయకోవిదుడు పిపి రావులు రెండు విడతలు సమావేశమైనారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 45 మాసాలపాటు లోక్‌పాల్ ఊసు లేదు. సెలక్షన్ కమిటీ సమావేశం లేదు. కామన్‌కాజ్ అనే ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో) తరఫున ప్రశాంత్‌భూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌పైన సుప్రీంకోర్టు స్పందించిన కారణంగా సెలక్షన్ కమిటీ సమావేశాలు 2018 మార్చి ఒకటి నుంచి ఇంత వరకూ ఆరుసార్లు జరిగాయి. పీపీ రావు మృతి కారణంగా ముకుల్ రోహట్గీని న్యాయకోవిదుడుగా కమిటీలో నియమించారు.
సెలక్షన్ కమిటీ సమావేశాలకు లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్లికార్జున్‌ఖర్గేని ‘ఆహ్వానితుడుగా’ పిలుస్తున్నారు. హాజరు కావడానికి ఆయన నిరాకరిస్తున్నారు. ఆహ్వానితుడికి ఓటింగ్ హక్కు ఉండదు. ఆయన వాగ్మూలం నమోదు కాదు. తనను సభ్యుడిగా ఆహ్వానించాలనీ, లోక్‌పాల్, లోకాయుక్త చట్టం, 2014, స్ఫూర్తిని అనుసరించి అతి పెద్ద ప్రతిపక్షానికి నాయకుడైన తనను ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆహ్వానించాలని ఆయన వాదన. మోదీ అంగీకరించరు. లోక్‌పాల్ చట్టానికి 2016లో ఎన్‌డీఏ సర్కార్ సవరణ తెచ్చేందుకు ఒక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పటికీ అందులో ఈ వివాదానికి పరిష్కారం లేదు. ప్రతి పక్ష నాయకుడి హోదాలో లోక్‌సభలో ఎవ్వరూ లేరు కనుక కమిటీ సమావేశాలు సవ్యంగా జరగడం లేదనీ, సెర్చ్ కమిటీకి ప్రాథమిక సౌకర్యాలు లేవనీ అటార్నీ జనరల్ వేణుగోపాల్ కోర్టులో చెప్పారు. ఇది కేవలం ఒక సాకు. నిజంగా ప్రధానమంత్రికి లోక్‌పాల్ నియామకంపైన చిత్తశుద్ధి ఉంటే సెర్చి కమిటీ అధ్యక్షుడికి అవసరమైన సదుపాయాలు కల్పించవచ్చు. ఖర్గేని ప్రతిపక్ష నాయ కుడిగా పరిగణించవచ్చు లేదా తక్కిన నలుగురు సభ్యులూ కలసి ఒక వ్యక్తిని లోక్‌పాల్‌గా నిర్ణయిం చవచ్చు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కనుక సుప్రీంకోర్టు నేరుగా లోక్‌పాల్‌ను నియమించా లని ప్రశాంత్‌భూషణ్ వాదిస్తున్నారు. ఎంతో పట్టుదలతో పోరాడి సాధించుకున్న లోక్‌పాల్ చట్టం కేంద్ర ప్రభుత్వం ఉదాసీనత కారణంగా అయిదేళ్ళుగా నిష్ఫలంగా ఉండటం విషాదం. ఆర్‌టీఐ (సమాచార హక్కు చట్టం), సీఐసీ (సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్– కేంద్ర సమాచార వ్యవస్థ) నీరు గారి పోతున్నాయంటూ, స్వేచ్ఛాస్వాతంత్య్రాలు కోల్పోతున్నాయనీ మాజీ కేంద్ర సమాచార కమిష నర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధరాచార్యులు ఆవేదన వెలిబుచ్చుతూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. రాష్ట్రపతి అయినా పట్టించుకుంటారా?
Comments
Please login to add a commentAdd a comment