బేరాలు లేకుండా ప్రభుత్వమా?
న్యూఢిల్లీ: రాజధాని నగరంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలకు ఎరవేయడం తప్పదని కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఢిల్లీ అసెంబ్లీలో ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లేనందున, ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు బేరం పెట్టకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయజాలదని కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్లా వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందు రాజ్యాంగ సూత్రాలు విస్మరించకుండా చూసే బాధ్యత లెఫ్టినెంట్ గవర్నర్‌దేనని ఆయన అన్నారు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు తాను బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలతో సంప్రదింపులు జరుపుతానని నజీబ్ జంగ్ పేర్కొన్న నేపథ్యంలో రాజీవ్ శుక్లా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీకి 28 మంది ఎమ్మెల్యేలుండగా, వారి మిత్రపక్షమైన అకాలీదళ్‌కు ఒకే శాసనసభ్యుడున్నారు. మొత్తంగా 67 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే బీజేపీకి మరో ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం.