వారె‘వా’ స్టీవ్‌... | Orphaned ashes immersed in the River Ganges - Steve Waugh | Sakshi
Sakshi News home page

వారె‘వా’ స్టీవ్‌...

Published Sat, Mar 11 2017 12:53 AM | Last Updated on Tue, Sep 5 2017 5:44 AM

వారె‘వా’ స్టీవ్‌...

వారె‘వా’ స్టీవ్‌...

అనాథ ఆఖరి కోరిక నెరవేర్చిన ఆసీస్‌ మాజీ కెప్టెన్‌
అస్థికలు గంగా నదిలో నిమజ్జనం 

వారణాసి: ఆటగాడిగా మైదానంలో దూకుడుకు మారుపేరుగా నిలిచిన ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్‌ వా అనేక సంవత్సరాలుగా కోల్‌కతాలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మానవత్వంలో కూడా చాలా ముందున్నానంటూ నిరూపిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన మరోసారి తనలోని మంచి మనిషిని బయట పెట్టారు. వ్యక్తిగతంగా ఎలాంటి బంధం, సంబంధం లేకపోయినా తన దేశానికి చెందిన ఒక అనాథ ఆఖరి కోరికను నెరవేర్చారు. ఇటీవలే మరణించిన సిడ్నీకి చెందిన 58 ఏళ్ల షూ షైనర్‌ (బూట్‌ పాలిష్‌ చేసే వ్యక్తి) బ్రియాన్‌ రుడ్‌ అస్థికలను అతని కోరిక ప్రకారం స్టీవ్‌వా స్వయంగా గంగానదిలో నిమజ్జనం చేశారు.

బోర్డర్‌–గవాస్కర్‌ ట్రోఫీ సిరీస్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ భారత్‌లోనే ఉన్న స్టీవ్‌ అస్థికల నిమజ్జనం కోసం వారణాసికి వెళ్లడం విశేషం. సహచర ఆస్ట్రేలియన్‌ కోసం తాను చేసిన పని చాలా సంతృప్తినిచ్చినట్లు స్టీవ్‌ వా వ్యాఖ్యానించారు. ‘బ్రియాన్‌ అస్థికలు ఇక్కడి నీటిలో కలపడం గౌరవంగా భావిస్తున్నా. అతని జీవితం చాలా కఠినంగా గడిచింది. అతనికి నా అనేవాళ్లు ఎవరూ లేరు. గంగా నదిలో తన అస్థికలు నిమజ్జనం చేయాలనేది అతని చివరి కోరిక. దానిని నెరవేర్చడం సంతృప్తిగా ఉంది’ అని వా వ్యాఖ్యానించారు.

అందరికీ అభిమానం: రోడ్డు పక్కన బూట్‌ పాలిష్‌ చేసుకునే వ్యక్తి అంటే సాధారణంగా ఎవరూ పట్టించుకోరు. కానీ బ్రియాన్‌ రుడ్‌ చనిపోయిన రోజు ఆస్ట్రేలియా మీడియా మొత్తం దానిని ప్రముఖ వార్తగా ప్రచురించింది. సిడ్నీలో అతను ఉదయం ఒక చోట, సాయంత్రం మరో చోట పాలిష్‌ చేస్తుంటాడు. మూడు నెలల వయసులో తల్లిదండ్రులకు దూరమైన అతను ఏడేళ్ల వరకు అనాథాశ్రమంలో పెరిగాడు. కొన్నేళ్ల పాటు చిన్నాచితక పనులతో కాలం గడిపిన అతను ఒకసారి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశాడు. చివరకు ఒక ఫాదర్‌ చేరదీయడంతో బతికిపోయి షూ పాలిష్‌నే వృత్తిగా మార్చుకున్నాడు.

పనితో పాటు తన మాట, పాటలతో ఆకట్టుకునే అతనంటే సిడ్నీ నగరవాసులందరికీ అభిమానం. అయితే తన పనితో తప్ప ఎప్పుడూ కూడా అయాచితంగా డబ్బులు తీసుకునేందుకు అంగీకరించలేదు. తన చివరి కోరిక కూడా అతను ఆ ఫాదర్‌కే చెప్పాడు. అయితే దానిని ఎలా నెరవేర్చాలోనని ఆయన సంశయ పడుతున్న దశలో స్టీవ్‌ వాకి ఈ విషయం తెలిసింది. తన కంపెనీ సీఈని అక్కడికి పంపించి అస్థికలను తెప్పించుకున్న స్టీవ్‌వా వాటిని భారత్‌కు తన వెంట తీసుకొచ్చారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement