న్యూఢిల్లీ: భారత క్రికెటర్‌గా పార్థివ్ పటేల్‌కు దక్కాల్సిన గౌరవం పూర్తిగా దక్కలేదనే చెప్పాలి. అటు కీపర్‌గా, ఇటు బ్యాట్స్‌మన్‌గా తనలో టాలెంట్ ఉన్నా అడపా దడపా అవకాశాలు రావడం ఒకటైతే, ధోని పుట్టిన శకంలోనే పార్థీవ్ కూడా ఉండటం శాపంగా మారింది. ఇది విషయాన్ని పార్థివ్ పటేల్ గతంలోనే చెప్పాడు కూడా. తాను ధోని పుట్టిన శకంలో పుట్టిన కారణంగా భారత జట్టులో సాధ్యమైనన్ని అవకాశాలు దక్కించుకోలేకపోయానని పార్ధివ్ బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఇది తన దురదృష్టంగా పార్ధివ్ అభివర్ణించుకున్నాడు.
అయితే మాటకు మాటకు పంచ్‌కు పంచ్ ఇవ్వడంలో పార్ధివ్ ఎక్కడా తగ్గడు. అయితే తాను ఆసీస్ దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ స్టీవ్ వా వ్యాఖ్యలకు గతేడాది కౌంటర్ ఇచ్చినట్లు పార్ధివ్ తెలిపాడు. 2019లో సిడ్నీలో జరిగిన టెస్టు ద్వారా స్టీవ్ మాటల్ని అతనికే అప్పచెప్పినట్లు పార్థివ్ పేర్కొన్నాడు. అదేంటి స్టీవ్ వా ఎప్పుడో రిటైర్మెంట్ ప్రకటించగా, మరి పార్థివ్ స్లెడ్జ్ చేయడం ఏమిటా అనుకుంటున్నారా.. అసలు విషయం అక్కడే ఉంది. 2003-04 సీజన్‌లో సిడ్నీలో భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ స్టీవ్ వాకు చివరిది. ఆ మ్యాచ్‌లో టీమిండియా కీపర్‌గా ఉన్న పార్థివ్ పటేల్.. స్టీవ్ వా స్లెడ్జ్ చేయబోయాడు. ('ఫామ్‌లోనే ఉన్నా అయినా ఎంపిక చేయలేదు')
దాంతో స్టీవ్ వా కాస్త కూల్‌గానే పార్ధివ్‌కు చురకలంటించాడు. ‘‘నేను క్రికెట్ బ్యాట్ పట్టేటప్పటికి నువ్వు నేపీస్ వేసుకుంటున్నట్లు ఉన్నావ్.. సీనియర్ అనే గౌరవాన్ని ఇచ్చి స్లెడ్జ్ చేస్తే బాగుంటుంది’’ అని పార్థివ్‌కు స్టీవ్ వా హితబోధ చేశాడు. అయితే ఆ మాటల్ని మరిచిపోలేని పార్ధివ్.. గత సంవత్సరం అదే సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా తిరిగి ఇచ్చేశాడు. ఆ మ్యాచ్‌లో స్టీవ్ వా కుమారుడు ఆస్టిన్ వా సబ్‌స్టిట్యూట్ ఆటగాడిగా ఉన్నాడు. అలా ఆస్టిన్ ఫీల్డింగ్ చేయడానికి వచ్చిన క్రమంలో అతని దగ్గరకె వెళ్లి.. ‘‘ నేను టెస్టుల్లో అరంగేట్రం చేసేటప్పటికి నువ్వు నేపీస్‌లో ఉండి ఉంటావ్. ఇది మీ నాన్న స్టీవ్ వా నన్ను అన్నమాటలు.. మీ నాన్నకు చెప్పు. ఆ మాటల్ని తిరిగి ఇచ్చేశానని చెప్పు’అని ఆస్టిన్‌ను ఆట పట్టించిన విషయాన్ని పార్థివ్ తాజాగా షేర్ చేసుకున్నాడు. కౌ కార్నర్ క్రోనికల్స్ యూ ట్యూబ్ న్యూ సిరీస్‌లో భాగంగా చంద్రకాంత్‌కు ఇచ్చిన ఇంటర్యూలో పార్థివ్ ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment