ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా (CSA) సీనియర్లను కాదని ద్వితియ శ్రేణి జట్టును ఎంపిక చేయడంపై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ స్టీవ్ వా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. కాసులు కురిపించే లీగ్ (SA20) కోసం క్రికెట్ సౌతాఫ్రికా టెస్ట్ క్రికెట్‌ను చంపే కుట్ర చేస్తుందని సంచలన ఆరోపణలు చేశాడు. ఏడుగురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, కొత్త కెప్టెన్‌తో కూడిన జట్టును న్యూజిలాండ్‌కు పంపిస్తూ క్రికెట్ సౌతాఫ్రికా న్యూజిలాండ్ క్రికెట్‌ను అవమానపరిచిందని మండిపడ్డాడు.
స్వదేశంలో జరిగే లీగ్‌పై అంత మమకారం ఉన్నప్పుడు న్యూజిలాండ్ సిరీస్‌ను మొత్తంగా రద్దు చేసుకుని ఉండాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. క్రికెట్ సౌతాఫ్రికా టెస్ట్ క్రికెట్‌ను చులకన చేసిందని, వాళ్లకు దేశం కంటే ఫ్రాంచైజీ క్రికెట్టే ఎక్కువైందని తూర్పారబెట్టాడు. టెస్ట్ క్రికెట్‌ను చులకన చేస్తూ క్రికెట్ సౌతాఫ్రికా చేసిన ఈ పనిని చూసిచూడనట్లు వ్యవహరించినందుకు ఐసీసీ సహా బీసీసీఐపై కూడా మండిపడ్డాడు. ఐసీసీ, బీసీసీఐ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ బోర్డులు టెస్ట్ క్రికెట్ పరిరక్షణకు పాటు పడాలని పిలుపునిచ్చాడు.
సౌతాఫ్రికా టెస్ట్ క్రికెట్‌ను చులకన చేసేటువంటి చర్యలకు పాల్పడటం ఇది తొలిసారి కాదని, గతంలోనూ ఆ దేశ క్రికెట్ బోర్డు స్వదేశంలో జరిగే టీ20 లీగ్ కోసం ఆస్ట్రేలియాకు ద్వితియ శ్రేణి జట్టును పంపించిందని గుర్తు చేశాడు. దక్షిణాఫ్రికాతో పాటు వెస్టిండీస్ లాంటి దేశాలు సైతం ఇదే రీతిన వ్యవహరిస్తున్నాయని ఆరోపించాడు. ఇలాంటి చర్యలు టెస్టు క్రికెట్ మనుగడకు ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశాడు. మార్నింగ్ హెరాల్డ్‌తో మాట్లాడుతూ వా ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, స్వదేశంలో జరిగే టీ20 లీగ్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా సీనియర్లను కాదని అనామక జట్టును న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేసింది.
న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు: నీల్ బ్రాండ్ (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హమ్, రువాన్ డి స్వర్డ్ట్, క్లైడ్ ఫోర్టుయిన్, జుబేర్ హంజా, త్షెపో మోరేకి, మిహ్లాలీ మ్పోంగ్వానా, డ్యుయన్ ఒలివియర్, డేన్ ప్యాటర్సన్, కీగన్ పీటర్సన్, డేన్ పీడ్ట్, రేనార్డ్ వాన్ టోండర్, షాన్ వాన్ బెర్గ్, ఖాయా జోండో.
Comments
Please login to add a commentAdd a comment