55 పరుగులకే ఆలౌట్‌.. టెస్ట్‌ క్రికెట్‌ను అవమానించినందుకు తగిన శాస్తి జరిగింది..! | SA VS IND 2nd Test Day 1: Karma Strikes South Africa After Disrespecting Test Cricket, They Bowled Out For 55 Runs Before Lunch | Sakshi
Sakshi News home page

55 పరుగులకే ఆలౌట్‌.. టెస్ట్‌ క్రికెట్‌ను అవమానించినందుకు తగిన శాస్తి జరిగింది..!

Published Wed, Jan 3 2024 6:52 PM | Last Updated on Wed, Jan 3 2024 7:01 PM

SA VS IND 2nd Test Day 1: Karma Strikes South Africa After Disrespecting Test Cricket, They Bowled Out For 55 Runs Before Lunch - Sakshi

స్వదేశంలో జరిగే టీ20 లీగ్‌ కోసం న్యూజిలాండ్‌ పర్యటనకు ద్వితియ శ్రేణి జట్టును ఎంపిక చేసి టెస్ట్‌ క్రికెట్‌ను ఘోరంగా అవమానించిన క్రికెట్‌ సౌతాఫ్రికాకు రోజుల వ్యవధిలోనే తగిన శాస్తి జరిగింది. 

ఆ జట్టు స్వదేశంలో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో తొలి రోజే 55 పరుగులకు ఆలౌటై, 135 ఏళ్ల కిందటి చెత్త రికార్డును తిరగరాసుకుంది. 1889 (ఇంగ్లండ్‌పై 84 పరుగులు) తర్వాత స్వదేశంలో టాస్‌ గెలిచి, తొలుత బ్యాటింగ్‌ చేస్తూ సౌతాఫ్రికా చేసిన అత్యల్ప స్కోర్‌ ఇదే. 

ఈ మ్యాచ్‌లో భారత పేసర్లు మొహమ్మద్‌ సిరాజ్‌ (9-3-15-6), ముకేశ్‌ కుమార్‌ (2.2-2-0-2), జస్ప్రీత్‌ బుమ్రా (8-1-25-2) నిప్పులు చెరుగుతూ, టెస్ట్ క్రికెట్‌ను అవమానించినందుకు సఫారీలపై ప్రతీకారం తీర్చుకున్నారు. భారత పేస్‌ త్రయం ధాటికి సఫారీలు లంచ్‌ విరామంలోపే (23.2 ఓవర్లలో) కుప్పకూలారు.

అప్పటివరకు పటిష్టంగా కనిపించిన సౌతాఫ్రికా టెస్ట్‌లను అవమానించిన తర్వాత ఇలా కుప్పకూలడంతో టెస్ట్‌ క్రికెట్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టెస్ట్‌లంటే గౌరవం లేని వారికి ఇలాంటి శాస్తి జరిగి తీరాల్సిందేనని శాపనార్థాలు పెడుతున్నారు. 

కాగా, ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం క్రికెట్‌ సౌతాఫ్రికా (CSA) సీనియర్లను కాదని ద్వితియ శ్రేణి జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. స్వదేశంలో జరిగే లీగ్‌లో (SA20) సీనియర్లను ఆడించేందుకు క్రికెట్‌ సౌతాఫ్రికా ఈ నిర్ణయం తీసుకుంది. 

న్యూజిలాండ్‌ పర్యటన కోసం CSA ఏడుగురు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లు, కొత్త కెప్టెన్‌తో కూడిన జట్టును ఎంపిక చేసింది. క్రికెట్‌ సౌతాఫ్రికా చేసిన ఈ పని టెస్ట్‌ క్రికెట్‌ను అవమానించడమేనని మాజీ క్రికెటర్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయంపై క్రికెట్‌ సర్కిల్స్‌లో దుమారం రేగుతుండగానే సౌతాఫ్రికా ఇలా 55 పరుగులకు ఆలౌట్‌ కావడం చర్చనీయాశంగా మారింది. 

ఇదిలా ఉంటే, సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే ఆలౌట్‌ చేసిన అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌.. తొలి రోజు టీ విరామం సమయానికి 4 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి (20), కేఎల్‌ రాహుల్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement