కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత పేస్ బౌలింగ్ త్రయం (సిరాజ్, బుమ్రా, ముకేశ్ కుమార్) ఉగ్రరూపం దాల్చింది. వీరి ధాటికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే కుప్పకూలింది. ఆట తొలి రోజే భారత పేసర్లు సఫారీల భరతం పట్టారు. ముఖ్యంగా సిరాజ్ (9-3-15-6) నిప్పులు చెరిగే బంతులతో సౌతాఫ్రికా పతనాన్ని శాశించాడు. సిరాజ్‌కు జతగా ముకేశ్ కుమార్ (2.2-2-0-2), బుమ్రా (8-1-25-2) కూడా విజృంభించడంతో సౌతాఫ్రికా అత్యల్ప స్కోర్‌కు పరిమితం కావడంతో పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది.
క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాక సౌతాఫ్రికాకు టెస్ట్‌ల్లో ఇదే అత్యల్ప స్కోర్ కాగా.. టెస్ట్‌ల్లో భారత్‌పై ఏ ప్రత్యర్ధికైనా ఇదే అత్యల్ప స్కోర్‌గా నిలిచింది.
ఈ మ్యాచ్‌లో సిరాజ్ నమోదు చేసిన గణాంకాలు సైతం రికార్డుల్లోకెక్కాయి. అతి తక్కువ పరుగులు సమర్పించుకుని ఐదు వికెట్ల ఘనత సాధించిన భారత బౌలర్ల జాబితాలో సిరాజ్ నాలుగో స్థానాన్ని (6/15) సాధించాడు. ఈ జాబితాలో బుమ్రా (5/7) టాప్‌లో ఉండగా.. వెంకటపతి రాజు (6/12), హర్భజన్ సింగ్ (5/13) ఆతర్వాతి స్థానాల్లో నిలిచారు.
అలాగే ఈ ప్రదర్శనతో సిరాజ్ మరో రికార్డుల జాబితాలోనూ చోటు దక్కించుకున్నాడు. సౌతాఫ్రికా గడ్డపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో శార్దూల్ ఠాకూర్ (7/61) టాప్‌లో ఉండగా.. హర్బజన్ సింగ్ (7/120) ఆతర్వాతి స్థానంలో నిలిచాడు.
సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌట్ కావడంతో కేప్‌టౌన్ సైతం రికార్డుల్లోకెక్కింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు 36 సందర్భాల్లో ఆయా జట్టు 55 అంతకంటే తక్కువ స్కోర్లకు ఆలౌట్ కాగా.. అత్యధిక సందర్బాల్లో (7) కేప్‌టౌన్‌లోనే ఈ చెత్త రికార్డులు నమోదయ్యాయి. కేప్‌టౌన్ తర్వాత అత్యధికంగా ఆరుసార్లు ఆయా జట్లు 55 అంతకంటే తక్కువ స్కోర్లను లార్డ్స్ మైదానంలో చేశాయి.
సౌతాఫ్రికా ఇన్నింగ్స్ విషయానికొస్తే.. బెడింగ్హమ్ (12), వెర్రిన్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మార్క్రమ్ 2, కెరీర్‌లో చివరి టెస్ట్ ఆడుతున్న సౌతాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ డీన్ ఎల్గర్ 4, టోనీ జార్జీ 2, ట్రిస్టన్ స్టబ్స్ 3, మార్కో జన్సెన్ 0, కేశవ్ మహారాజ్ 3, రబాడ 5, నండ్రే బర్గర్ 4 పరుగులు చేశారు.
కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ప్రోటీస్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment