IND VS SA 2nd Test: అరుదైన రికార్డుపై కన్నేసిన బుమ్రా | IND VS SA 2nd Test: Jasprit Bumrah Aims To Create All Time Record In Cape Town | Sakshi
Sakshi News home page

IND VS SA 2nd Test: అరుదైన రికార్డుపై కన్నేసిన బుమ్రా

Published Mon, Jan 1 2024 6:30 PM | Last Updated on Mon, Jan 1 2024 6:38 PM

IND VS SA 2nd Test: Jasprit Bumrah Aims To Create All Time Record In Cape Town - Sakshi

కేప్‌టౌన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరుగబోయే రెండో టెస్ట్‌కు ముందు టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రాను ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో బుమ్రా మరో ఏడు వికెట్లు తీస్తే.. కేప్‌టౌన్‌లో అత్యధిక వికెట్లు తీసిన విజిటింగ్‌ బౌలర్‌గా (యాక్టివ్‌ బౌలర్లలో) రికార్డుల్లోకెక్కుతాడు. ఈ వేదికపై బుమ్రా ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. 

జనవరి 3 నుంచి ప్రారంభంకాబోయే మ్యాచ్‌లో అతను మరో ఏడు వికెట్లు తీస్తే ఇంగ్లండ్‌ వెటరన్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడతాడు. కేప్‌టౌన్‌లో ఆండర్సన్‌ అందరి కంటే ఎక్కువగా (యాక్టివ్‌ బౌలర్లలో) 16 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా కేప్‌టౌన్‌ పిచ్‌పై అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక బౌలర్‌ రికార్డు ఇంగ్లండ్‌కు చెందిన కొలిన్‌ బ్లైత్‌ (25 వికెట్లు) పేరిట ఉంది. 

కేప్‌టౌన్‌ టెస్ట్‌లో బుమ్రా మరో మూడు వికెట్లు తీసినా మరో రికార్డు అతని ఖాతాలో వచ్చిపడుతుంది. ఈ మ్యాచ్‌లో అతను మూడు వికెట్లు తీస్తే.. కేప్‌టౌన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ రికార్డు మాజీ పేసర్‌ జవగల్‌ శ్రీనాథ్‌ (12 వికెట్లు) పేరిట ఉంది. 

కేప్‌టౌన్‌తో బుమ్రాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం (2018) అతను ఇక్కడే తన టెస్ట్‌ అరంగేట్రం చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో బుమ్రాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఓవరాల్‌గా బుమ్రా తన టెస్ట్‌ కెరీర్‌లో 31 మ్యాచ్‌లు ఆడి 21.84 సగటున 132 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత పర్యటనలో భాగంగా సెంచూరియన్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లోనూ బుమ్రా సత్తా చాటాడు. ఆ మ్యాచ్‌లో అతను 4 వికెట్లు పడగొట్టాడు. 

ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ 32 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ (తొలి ఇన్నింగ్స్‌లో 101), విరాట్‌ కోహ్లి (సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 76), జస్ప్రీత్‌ బుమ్రా (4/69) మినహా భారత ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 245, సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 131 పరుగులకే కుప్పకూలగా.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ మాత్రమే బ్యాటింగ్‌ చేసి 408 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. నిర్ణయాత్మకమైన రెండో టెస్ట్‌లో గెలిచి సిరీస్‌ కోల్పోయే ప్రమాదం నుంచి తప్పించుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement