కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా తమ చివరి ఆరు వికెట్లను ఒకే స్కోర్ వద్ద (153) కోల్పోయి అనవసరమైన చెత్త రికార్డును మూటగట్టుకుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ జట్టు పరుగులేమీ చేయకుండా ఇలా తమ చివరి ఆరు వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. ఇన్నింగ్స్ 34వ ఓవర్ తర్వాత 153/4గా ఉన్న భారత్ స్కోర్ 11 బంతుల తర్వాత 153 ఆలౌట్‌గా మారింది.
భారత ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురు డకౌట్లు కాగా.. రోహిత్ శర్మ (39), శుభ్‌మన్ గిల్ (36), విరాట్ కోహ్లి (46) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్ కార్డు చూస్తే అన్నీ సున్నాలే దర్శనమిస్తాయి. బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం టీమిండియా ఆటగాళ్ల స్కోర్లు ఇలా (0, 39, 36, 46, 0, 8, 0, 0, 0, 0, 0 నాటౌట్) ఉన్నాయి. భారత ఇన్నింగ్స్ ఆఖర్లో తొలుత ఎంగిడి (6-1-30-3), ఆతర్వాత రబాడ (11.5-2-38-3) నిప్పులు చెరిగారు. వీరికి నండ్రే బర్గర్ తోడయ్యాడు.
అంతకుముందు భారత పేసర్లు మొహమ్మద్ సిరాజ్ (9-3-15-6), ముకేశ్ కుమార్ (2.2-2-0-2), జస్ప్రీత్ బుమ్రా (8-1-25-2) నిప్పులు చెరగడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 55 పరుగులకే ఆలౌటైంది. భారత పేస్ త్రయం ధాటికి సఫారీల ఇన్నింగ్స్ లంచ్ విరామంలోపే (23.2 ఓవర్లలో) ముగిసింది. సఫారీల ఇన్నింగ్స్‌లో బెడింగ్హమ్ (12), వెర్రిన్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
భారత ఇన్నింగ్స్‌లా కాకుండా సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కేవలం ఒక్కరు మాత్రమే డకౌటయ్యాడు. మిగతా బ్యాటర్లు కనీసం ఒక్క పరుగైనా చేయగలిగారు. తొలి రోజు ఆటలో ఇరు జట్ల తొలి ఇన్నింగ్స్‌లు 59.3 ఓవర్లలోనే ముగిసాయి. అంటే 60 ఓవర్లలోపే ఇరు జట్లు 20 వికెట్లు కోల్పోయాయి.
భారత తొలి ఇన్నింగ్స్ అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసి జాగ్రత్తగా ఆడుతుంది. డీన్ ఎల్గర్ 7, మార్క్రమ్ 14 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌ను ఇంకా 76 పరుగులు వెనకపడి ఉంది. తొలి రోజు ఆటలో ఇంకా 20 ఓవర్ల ఆట మిగిలి ఉంది. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి టెస్ట్ గెలిచిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment