రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా టీమిండియా రేపటి నుంచి (జనవరి 3) సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ కేప్‌టౌన్‌లోని న్యూల్యాండ్స్ మైదానం వేదికగా జరుగనుంది. ఈ పిచ్‌పై భారత్‌కు చెప్పుకోదగ్గ ట్రాక్ రికార్డు లేకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలే తొలి టెస్ట్‌లో ఓడిపోయి సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పరువు దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది.
అయితే న్యూల్యాండ్స్‌లో టీమిండియా ట్రాక్ రికార్డు ప్రస్తుతం అందరినీ కలవరపెడుతుంది. ఈ మైదానంలో భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇక్కడ ఇరు జట్ల మధ్య మొత్తం ఆరు మ్యాచ్‌లు జరగగా.. నాలుగింట గెలిచిన సౌతాఫ్రికా, రెండింటిని డ్రా చేసుకుంది. ఇరు జట్ల మధ్య చివరిసారిగా (2022, జనవరి 11-14) ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు టీమిండియాను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.
1993, 2011లో జరిగిన మ్యాచ్‌లు డ్రా కాగా.. 1997, 2007, 2018, 2022 సిరీస్‌ల్లో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లను సౌతాఫ్రికా గెలిచింది. న్యూల్యాండ్స్ పిచ్ ఆనవాయితీగా పేసర్లకు స్వర్గధామంగా ఉంటూ వస్తుంది. ఇక్కడ బ్యాటింగ్ చేసేందుకు దిగ్గజాలు సైతం వణికిపోతారు. ఈ మైదానంలో ఇప్పటివరకు కేవలం నలుగురు భారత క్రికెటర్లు మాత్రమే సెంచరీలు చేయగలిగారు. సచిన్ టెండూల్కర్ రెండుసార్లు.. మొహమ్మద్ అజారుద్దీన్, వసీం జాఫర్, రిషబ్ పంత్ తలో సారి న్యూల్యాండ్స్ పిచ్‌పై సెంచరీ మార్కును తాకారు.
ఇక్కడ టీమిండియా అత్యధిక స్కోర్ 414గా ఉంది. 2007 సిరీస్‌లో భారత్ ఈ స్కోర్‌ను చేసింది. ఈ పిచ్‌పై టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డు సచిన్ పేరిట ఉంది. సచిన్ ఇక్కడ నాలుగు మ్యాచ్‌ల్లో ఏడు ఇన్నింగ్స్‌లు ఆడి 489 పరుగులు చేశాడు. ఇక్కడ భారత్ తరఫున అత్యధిక స్కోర్ (169) కూడా సచిన్ పేరిటే ఉంది. కాగా, ప్రస్తుత సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment