
ఈ ఏడాది భారత క్రికెట్ జట్టు హోం సీజన్ (స్వదేశంలో ఆడే మ్యాచ్‌లు) షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ (ఏప్రిల్ 2) ప్రకటించింది. అక్టోబర్‌లో వెస్టిండీస్.. నవంబర్, డిసెంబర్ నెలల్లో సౌతాఫ్రికా క్రికెట్ జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి.
విండీస్ క్రికెట్ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత్‌కు రానుంది. ఈ పర్యటనలో తొలి టెస్ట్ అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 2-6 మధ్య తేదీల్లో జరుగనుంది. రెండో టెస్ట్ కోల్‌కతా వేదికగా అక్టోబర్ 10-14 మధ్య తేదీల్లో జరుగుతుంది. టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ భారత్‌లో పర్యటించడం 2018 తర్వాత ఇదే మొదటిసారి. ఆ సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది.
అనంతరం నవంబర్ నెలలో సౌతాఫ్రికా జట్టు మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం భారత్‌కు రానుంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికా రెండు టెస్ట్‌లు.. మూడు వన్డేలు.. ఐదు టీ20లు ఆడనుంది. నవంబర్ 14-18 మధ్య తేదీల్లో న్యూఢిల్లీలో తొలి టెస్ట్ జరుగనుంది. నవంబర్ 22 తేదీన గౌహతి వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.
నవంబర్ 30, డిసెంబర్ 3, డిసెంబర్ 6 తేదీల్లో రాంచీ, రాయ్‌పూర్, వైజాగ్ వేదికలుగా మూడు వన్డేలు జరుగనున్నాయి. డిసెంబర్ 9, 11, 14, 17, 19 తేదీల్లో కటక్, చండీఘడ్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్ వేదికలుగా ఐదు టీ20లు జరుగనున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో భారత్, శ్రీలంకల్లో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్ దృష్ట్యా ఈ టీ20 సిరీస్‌ను షెడ్యూల్ చేశారు.
కాగా, భారత క్రికెట్ జట్టు ఐపీఎల్ 2025 తర్వాత ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన నెలన్నర పాటు సాగనుంది. మధ్యలో భారత్ జట్టు ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ఖాళీగా ఉంటుంది. ఆతర్వాత హోం సీజన్ ప్రారంభమవుతుంది. భారత్‌లో వెస్టిండీస్ పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా 3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్‌ల షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ ఇటీవలే విడుదల చేసింది.
ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన షెడ్యూల్..
అక్టోబర్ 19- తొలి వన్డే (డే అండ్ నైట్)- పెర్త్
అక్టోబర్ 23- రెండో వన్డే (డే అండ్ నైట్)- అడిలైడ్
అక్టోబర్ 25- మూడో వన్డే (డే అండ్ నైట్)- సిడ్నీ
అక్టోబర్ 29- తొలి టీ20- కాన్‌బెర్రా
అక్టోబర్ 31- రెండో టీ20- మెల్‌బోర్న్
నవంబర్ 2- మూడో టీ20- హోబర్ట్
నవంబర్ 6- నాలుగో టీ20- గోల్డ్ కోస్ట్
నవంబర్ 8- ఐదో టీ20- బ్రిస్బేన్