కఠినమైన పిచ్‌పై అద్భుత శతకం.. మార్క్రమ్‌ ఖాతాలో అరుదైన రికార్డు | IND VS SA 2nd Test: Markram Scored Highest Percentage Of Runs In A Completed Test Innings For SA, See Details - Sakshi
Sakshi News home page

IND VS SA 2nd Test: కఠినమైన పిచ్‌పై అద్భుత శతకం.. మార్క్రమ్‌ ఖాతాలో అరుదైన రికార్డు

Published Thu, Jan 4 2024 4:34 PM | Last Updated on Thu, Jan 4 2024 5:31 PM

IND VS SA 2nd Test: Markram Scored Highest Percentage Of Runs In A Completed Test Innings For SA - Sakshi

కేప్‌టౌన్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా ఆటగాడు ఎయిడెన్‌ మార్క్రమ్‌ అద్బుత శతకంతో (103 బంతుల్లో 106; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) అలరించిన విషయం తెలిసిందే. మార్క్రమ్‌ ఈ సెంచరీని ఎంతో కఠినమైన పిచ్‌పై సాధించడం విశేషం. ప్రత్యర్ధి‌ బ్యాటర్లతో పాటు సొంత బ్యాటర్లు సైతం ఒక్కో పరుగు చేసేందుకు ఇబ్బందిపడ్డ పిచ్‌పై మార్క్రమ్‌ చిరస్మరణీయ సెంచరీ సాధించి ఔరా అనిపించాడు.

పేసర్లకు స్వర్గధామంగా ఉన్న పిచ్‌పై సెంచరీ చేయడమే అద్భుతమనుకుంటే మార్క్రమ్‌ ఈ సెంచరీని కాస్త సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ల్లో అత్యంత వేగవంతమైన ఆరో సెంచరీగా (99 బంతుల్లో) మలిచాడు. అలాగే మార్క్రమ్‌ కేప్‌టౌన్‌లో సెంచరీ చేసిన తొలి ప్రొటిస్‌ బ్యాటర్‌గానూ రికార్డుల్లోకెక్కాడు. ఈ రికార్డులతో పాటు మార్క్రమ్‌ మరో రికార్డును సైతం తన ఖాతాలో వేసుకున్నాడు.

సౌతాఫ్రికా తరఫున ఓ పూర్తయిన టెస్ట్‌ ఇన్నింగ్స్‌లో అత్యధిక శాతం (60.22) పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ ఇన్నింగ్స్‌లో (సెకెండ్‌) సౌతాఫ్రికా 176 పరుగులు చేయగా.. మార్క్రమ్‌ ఒక్కడే 103 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా ఓ పూర్తయిన టెస్ట్‌ ఇన్నింగ్స్‌లో అత్యధిక శాతం పరుగుల రికార్డు ఆస్ట్రేలియా ఆటగాడు చార్లెస్‌ బ్యానర్‌మ్యాన్‌ పేరిట ఉంది.

1877లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ ఇన్నింగ్స్‌లో అతను జట్టు స్కోర్‌లో 67.34 శాతం పరుగులు సాధించాడు. ఆ ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 245 పరుగులు చేయగా.. బ్యానర్‌మ్యాన్‌ ఒక్కడే 165 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ విభాగంలో ఆసీస్‌ ఆటగాడు మైఖేల్‌ స్లేటర్‌ (66.84), టీమిండియా సొగసరి వీవీఎస్‌ లక్ష్మణ్‌ (63.98) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. 

ఇదిలా ఉంటే, మార్క్రమ్‌ సెంచరీతో చెలరేగడంతో సౌతాఫ్రికా సెకెండ్‌ ఇన్నింగ్స్‌ 176 పరుగుల వద్ద ముగిసింది. టీమిండియా పేసు గుర్రం బుమ్రా ఆరు వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాశించాడు. ముకేశ్‌ 2, సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలో వికెట్‌ పడగొట్టారు. టీమిండియా టార్గెట్‌ 79 పరుగులుగా ఉంది. అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులు చేయగా.. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులకు ఆలౌటైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement