కేప్‌టౌన్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో చిత్తైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ.. అంతిమంగా భారత పేసర్లదే పైచేయిగా నిలిచింది. సిరాజ్ (6/15) విశ్వరూపం ప్రదర్శించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా.. ఆతర్వాత భారత్‌ను 153 పరుగులకే పరిమితం చేసి తిరిగి మ్యాచ్‌లోకి వచ్చింది.
అనంతరం మార్క్రమ్ కఠినమైన పిచ్‌పై నమ్మశక్యంకాని రీతిలో బ్యాటింగ్ విన్యాసాలు ప్రదర్శించి టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే మరపురాని ఇన్నింగ్స్ (106) ఆడాడు. మార్క్రమ్ రెచ్చిపోతుండటంతో ఓ సమయంలో సౌతాఫ్రికా మ్యాచ్‌పై పట్టు సాధించేలా కనిపించింది. అయితే బుమ్రా (6/60) మరో ఎండ్‌లో ఎవరినీ కుదురుకోనీయకపోవడంతో సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌కు 176 పరుగుల వద్ద తెర పడింది. ఫలితంగా దక్షిణాఫ్రికా టీమిండియా ముందు స్వల్ప లక్ష్యాన్ని (79) ఉంచింది. ఈ లక్ష్యాన్ని భారత్ ఆడుతూపాడుతూ ఛేదించి, రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమంగా ముగించింది.
కెరీర్‌లో చివరి టెస్ట్ ఆడుతున్న దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ డీన్ ఎల్గర్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఇలా అన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో చావుదెబ్బ (55 పరుగులకు ఆలౌట్) తినడం మా విజయావకాశాలను దెబ్బతీసింది. మార్క్రమ్ చిరస్మరణీయ శతకంతో తిరిగి మమ్మల్ని మ్యాచ్‌లోకి తెచ్చాడు. భారత పేసర్లు పరిస్థితులను సద్వినియోగం చేసుకుని అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ ఓటమిని జీర్జించుకోవడం కాస్త కఠినమే. 2-0 తేడాతో సిరీస్‌ను గెలిచుంటే బాగుండేది. అయినా పర్లేదు. గెలుపు కోసం మా వంతు పోరాటం చేశాం.
మా కుర్రాళ్ల ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. సిరీస్ ఆధ్యాంతం పేసర్లు బౌలింగ్ చేసిన తీరు.. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ బ్యాటింగ్ చేసిన తీరు అత్యద్భుతం. ఈ పిచ్‌పై ఫలితం అందరి ఊహలకు విరుద్దంగా వచ్చింది. దురదృష్టవశాత్తూ మేమే బాధితులమయ్యాము. ఈ ఫలితం ఓ గుణపాఠం లాంటిది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడంపై స్పందిస్తూ.. రోహిత్ శర్మ సైతం అదే పని చేసేవాడు. అంతిమంగా చూస్తే తొలి రోజు తొలి సెషనే మా కొంపముంచిందని ఎల్గర్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment