కేప్‌టౌన్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా.. సౌతాఫ్రికాను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసి రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. సిరాజ్ (6/15) విశ్వరూపం ప్రదర్శించడంతో 55 పరుగులకే (తొలి ఇన్నింగ్స్‌లో) కుప్పకూలింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. ఓ దశలో భారీ స్కోర్ చేసేలా కనిపించినప్పటికీ, సఫారీ పేసర్లు ఒక్కసారిగా విరుచుకుపడటంతో 153 పరుగులకే పరిమితమైంది. టీమిండియా తమ చివరి ఆరు వికెట్లు ఒకే స్కోర్ వద్ద కోల్పోయి భారీ స్కోర్ చేయలేకపోవడమే కాకుండా ఓ అనవసరమైన చెత్త రికార్డును మూటగట్టుకుంది.
ఆ తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికాను మార్క్రమ్ (106) చిరస్మరణీయ శతకంతో ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఈసారి బుమ్రా (6/60) సఫారీలను దెబ్బకొట్టాడు. ఫలితంగా ఆ జట్టు 176 పరుగులకే పరిమితమై, టీమిండియా ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. ఈ లక్ష్యాన్ని భారత్ ఆడుతూపాడుతూ ఛేదించి, సిరీస్ కోల్పోయే ప్రమాదం నుంచి తప్పించుకుంది.
మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఇదో గొప్ప విజయం. తొలి టెస్ట్‌లో చేసిన తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకున్నాం. మా బౌలర్లు అద్బుతంగా రాణించారు. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం ఆడాం. ఫలితం సాధించాం. బ్యాటర్లు కూడా తమవంతు ప్రయత్నం చేశారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించడం మా విజయావకాశాలను మెరుగుపర్చింది. తొలి ఇన్నింగ్స్‌లో ఒకే స్కోర్ వద్ద చివరి ఆరు వికెట్లు కోల్పోవడం దురదృష్టకరం.
సిరాజ్ గురించి మాట్లాడుతూ.. ఆ స్పెల్ చాలా ప్రత్యేకం. ఎప్పుడోకాని ఇలాంటివి చూడలేము. బుమ్రా కూడా అద్బుతంగా బౌలింగ్ చేశాడు. సాధారణంగా బౌలింగ్ చేయాలని అనుకున్నాం. మిగతా పని పిచ్ చూసుకుంటుందని ఊహించాం. అదే జరిగింది. క్రెడిట్ మొత్తం పేసర్లకే దక్కుతుంది.
సౌతాఫ్రికాకు ఎప్పుడు వచ్చినా పరిస్థితులు ఛాలెంజింగ్‌గా ఉంటాయి. ఇక్కడ గత నాలుగైదు సంవత్సరాల్లో మేము అత్యుత్తమ విజిటింగ్ జట్టుగా మారాం. ఇక్కడే కాదు ఓవర్సీస్ మొత్తంలో గత కొద్దికాలంగా మేము చాలా మెరుగయ్యాం. సిరీస్ గెలుచుంటే బాగుండేది. సౌతాఫ్రికా అత్యుత్తమ జట్టు. వారు మాకెప్పుడూ ఛాలెంజే. అందుకే మేము ఇక్కడ సిరీస్ (టెస్ట్) గెలవలేకపోతున్నాం.
ఎల్గర్ గురించి మాట్లాడుతూ.. క్రికెట్ సౌతాఫ్రికాకు చాలా ముఖ్యమైన ఆటగాడు. కెరీర్ ఆధ్యాంతం జట్టు ఉన్నతికి తోడ్పడ్డాడు. ఇలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఈ మ్యాచ్‌లో ఎల్గర్‌ను త్వరగా ఔట్ చేయడం గురించి ముందే మాట్లాడుకున్నాం. ఎల్గర్ ఇలాంటి కెరీర్ కలిగి ఉండటం అభినందనీయం. ప్రతిసారీ ఇలాంటి ఆటగాడిని చూడలేము. అద్భుతమైన కెరీర్. అతని భవిష్యత్తుకు శుభాకాంక్షలు అంటూ హిట్‌మ్యాన్ ముగించాడు.
Comments
Please login to add a commentAdd a comment