గంగానది వెంబడి శుద్ధి ప్లాంట్లు
న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణలో గంగానది పరీవాహక ప్రాంతంలో 20 నీటి శుద్ధి(రీసైక్లింగ్) ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా, హైవేలు, షిప్పింగ్ మంత్రి నితిన్ గడ్కారీ చెప్పారు. భారీ ఉద్యోగ అవకాశాలను సృష్టించడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలలో ఆయన శనివారం ప్రసంగించారు.
గంగ పరీవాహ ప్రాంతాల్లో 20 జల శుద్ధి(రీసైక్లింగ్) ప్లాంట్లను నది వెంబడి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 111 నదులను జలమార్గాలుగా మార్చేందుకు పార్లమెంటు ఆమోదం తెలపడం విప్లవాత్మక చర్య అని, దేశంలోని 35 వేల కిలోమీటర్ల జలమార్గాలను వినియోగించుకునేందుకు ఇది దోహదపడుతుందన్నారు. జలమార్గాల అభివృద్ధి వల్ల కాలుష్యం తగ్గుతుందని, రవాణా చార్జీలు తగ్గుతాయని అన్నారు. అదే సమయంలో వ్యర్థాలను సంపదగా మార్చడంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. రోడ్ల నిర్మాణానికి వాడే తారులో ఎనిమిది శాతం మేరకు ప్లాస్టిక్‌ను వినియోగించేందుకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు.