ఆకివీడు: గోదావరి నది, కృష్ణా నదులకు శివారు ప్రాంతంగా ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత మూడేళ్లుగా భూగర్భ జలాలు సమృద్ధిగానే ఉన్నాయి. భూమికి రెండు మూడు అడుగుల నుంచి 100 అడుగుల వరకూ నీటి మట్టం ఉంది. 2020, 2021, 2022 సంవత్సరాల్లో వర్షాలు అధికంగా కురిశాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురువడంతో లక్షలాది క్యూసెక్కుల నీరు పొంగి ప్రవహించింది. భూగర్భ జలాల నీటి మట్టం పెరుగుతూ వచ్చింది.
ఈ ఏడాది చివరి నాటికి వర్షాలు, వాయుగుడం ప్రభావం, తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిస్తే మే నెలలో కూడా నీటి మట్టం యథావిధిగా ఉండే అవకాశం ఉందని భూగర్భజలవనరుల శాఖ చెబుతోంది. గతేడాది ఉమ్మడి జిల్లాలో 17.12 మీటర్ల సరాసరి నీటి మట్టం ఉంది. ఈ ఏడాది ఏలూరు జిల్లా పరిధిలో 16.73 మీటర్ల సరాసరి నీటి మట్టం ఉంది. అధిక వర్షాలతో నీటి మట్టం నిలకడగా ఉంది.
ఈ ఏడాది ఏలూరు జిల్లా పరిధిలో ఆగస్టు నెలలో సరాసరి నీటి మట్టం 20.53 మీటర్లు, సెప్టెంబర్‌లో 19.12, అక్టోబర్‌లో 16.73, నవంబర్‌లో 14.09 మీటర్లు నీటిమట్టం పెరుగుతూ వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో నీటి మట్టాలు గత ఏడాది కన్నా పెరుగుతూనే ఉన్నాయి. జిల్లాలోని 19 మండలాల్లో భూగర్భ జలాల లోతును పరీక్షిస్తే కాళ్ల మండలంలో నీటి మట్టం భాగా అడుగుకు ఉంది.
సముద్ర తీర ప్రాంతం, ఉప్పుటేరుకు చేర్చి మండలం ఉన్నప్పటికీ భూమి పొరలలో నీటి చేరిక అంతంత మాత్రంగానే ఉందని చెబుతున్నారు. గత మూడు నెలల పరీక్షా ఫలితాల్లో నీటి మట్టం సరాసరిన ఆగస్టులో 26.5, సెప్టెంబర్ నెలలో 26.19, అక్టోబర్ నెలలో 27.72 మీటర్లుంది. ఇవే నెలలో నీటి మట్టం బాగాపైకి ఉన్న మండలాల్లో ఆగస్టులో ఆకివీడు మండలం 0.25, సెప్టెంబర్‌లో ఆకివీడు మండలంలో 1.5 మీటర్లు, అక్టోబర్‌లో ఉండి మండలంలో 0.45 మీటర్ల నీటి మట్టం ఉంది. మార్చి నెల వరకు నీటి మట్టాలు సరాసరి ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది.
నిండు కుండలా కొల్లేరు సరస్సు
ప్రపంచ ప్రసిద్ది గాంచిన కొల్లేరు సరస్సు ఉనికిని కోల్పోయే విధంగా గత రెండు దశాబ్ధాలుగా బీడు పడి, నెరలు దీసి ఉంది. సుమారు 75 వేల ఎకరాల్లో ఉన్న కొల్లేరు సరస్సులో నీటి మట్టం తగ్గిపోవడంతో వేలాది పక్షులు వలసలు పోయాయి. కొన్ని చనిపోయాయి. గత మూడేళ్లుగా ఉమ్మడి జిల్లాలోనూ, ఎగువ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకు కొల్లేరు నీటి మట్టం క్రమేపీ పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం మూడు, నాలుగు కాంటూర్ల పరిధిలో నీటి మట్టం 1.6 మీటర్ల నిలబడి ఉంది. సహజంగా సరస్సు నీటి మట్ట 1.2 మీటర్లు మాత్రమే ఉండేది. జూలై, ఆగస్టు నెలల్లో భారీ వర్షాలకు నీటి మట్టం భారీగా పెరిగింది.
పెరిగిన నీటి మట్టం
పశ్చిమగోదావరి జిల్లాలో సరాసరి భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయి. కొన్ని మండలాల్లో రెండు మూడు అడుగుల లోతులో, మరి కొన్ని మండలాల్లో 70 నుంచి 90 అడుగుల లోతులో నీటి మట్టం ఉంది. భారీ వర్షాలకు ఈ ఏడాది భూగర్భ జలాల నీటి మట్టం పెరిగింది.
– కె.గంగాధరరావు, జిల్లా భూగర్భజల వనరుల శాఖ అధికారి, పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం
సరాసరి నీటి మట్టం 16.73
ఉమ్మడి జిల్లాలో గత మూడేళ్లలో నీటి మట్టం సరాసరి 16.73 ఉంది. వాటర్ లెవెల్స్ బాగా పెరిగాయి. ఆగస్టులో 20.53, సెప్టెంబర్‌లో 19.12, అక్టోబర్‌లో 16.73, నవంబర్‌లో 14.09 మీటర్లతో భూమి లెవిల్‌కు నీటిమట్టం పెరిగింది.
– పీఎస్ విజయ్‌కుమార్, డీడీ, భూగర్భ జలవనరుల శాఖ, ఏలూరు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment