అల్పపీడన ద్రోణితో జిల్లాలో భారీ వర్షాలు
►పశ్చిమంలో నిండిన చెరువులు, కుంటలు
►తూర్పు ప్రాంతంలోనూ మోస్తరు వర్షం
►వరదెత్తిన కాగ్నా, మూసీ నదులు
►పొంగిపొర్లిన లఖ్నాపూర్ ప్రాజెక్టు
►తెగిన రోడ్లు, జలదిగ్బంధంలో పలు గ్రామాలు
► పరిగి డివిజన్‌లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
1 పరిగి మండలంలోని లఖ్నాపూర్ ప్రాజెక్టు అలుగు పొంగిపొర్లి ప్రవహించడంతో తరలివచ్చిన ప్రజలు
2 చేవెళ్ల డివిజన్ పరిధిలోని అమ్డాపూర్ సమీపంలో నీటమునిగిన చామంతి తోట
3 పరిగి మండలం నజీరాబాద్ తండాలో వరదలో కొట్టుకుపోయిన పత్తిపంటను చూపిస్తూ రోదిస్తున్న గిరిజన మహిళ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తీవ్ర వర్షాభావంతో కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న జిల్లాను తాజా అల్పపీడనద్రోణి ఆదుకుంది. చినుకుల జాడలేక వాడిపోతున్న పంటలకు భారీ ఊరటనిచ్చింది. ద్రోణి ప్రభావంతో మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ ప్రాంతంలో కురుస్తున్న వానల ప్రభావంతో ఇప్పటికే చెరువులు, కుంటలు నిండి అలుగుపారుతున్నాయి. మరోవైపు తూర్పువైపు సైతం ఆశాజనకంగా కురుస్తున్న వర్షాలతో రైతాంగం ఆనందంలో మునిగింది. భారీ వర్షాల కారణంగా పోటెత్తుతున్న వరదలతో రవాణావ్యవస్థకు ఆటంకం ఏర్పడింది.
పశ్చిమ ప్రాంతంలోని పలు గ్రామాల్లో జనావాసాల మధ్య వరదనీరు చేరడంతో స్థానికంగా తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. శంషాబాద్ మండలం కే.బీ.దొడ్డి గ్రామంలోకి వరదనీరు చేరడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. తాండూరు మండలం వీర్‌శెట్టిపల్లి గ్రామం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. రెండ్రోజులుగా ఈ గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. సెల్‌ఫోన్లు సైతం మూగబోవడంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
ఎడతెరపి లేకుండా..
వరుసగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి జిల్లాలోని నదులు వరదెత్తాయి. దీంతో వరద ప్రవాహ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు జలాలతో కళకళలాడుతున్నాయి. యాలాల మండలం అన్నాసాగర్ ఊర చెరువు, అచ్యుతాపూర్ పెద్ద చెరువు, కమాల్‌పూర్‌లోని షేక్‌పుర చెరువులకు గండి పడడంతో నీరంతా పొలాల్లోకి చేరింది.
భారీ వర్షాల కారణంగా కాగ్నా నది ఉగ్రరూపం దాల్చింది. మూసీ, ఈసీ వాగులు సైతం రోడ్లెక్కి ప్రవహిస్తుండడంతో రవాణా వ్యవస్థ స్తంభించిందింది.
జిల్లాలో పెద్దప్రాజెక్టులైన కోట్‌పల్లి ప్రాజెక్టుకు వరదనీరు జోరందుకుంది. మరోవైపు పరిగి ప్రాంతంలో సాగునీటికి కీలకమైన లఖ్నాపూర్ ప్రాజెక్టు అలుగు ప్రవహిస్తోంది. మూసీ, ఈసీ వాగుల ప్రవాహం అధికమై జంట జలాశయాలకు పరుగులు పెడుతోంది. కాగ్నా వరద ప్రభావంతో తాండూరు-మహబూబ్‌నగర్ మార్గం పూర్తిగా దెబ్బతింది. దీంతో కిలోమీటర్లమేర వాహనాలు నిలిచిపోయాయి. కంది-షాద్‌నగర్, చేవెళ్ల-శంకర్‌పల్లి మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా పరిగి డివిజన్‌లో 12 సెంటీమీటర్లు, సరూర్‌నగర్ డివిజన్‌లో 2.17, రాజేంద్రనగర్ డివిజన్‌లో 1.5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారవర్గాలు తెలిపాయి.
నీట మునిగిన పొలాలు..
వర్షాల ధాటికి వాన నీరంతా వరదై ప్రవహిస్తోంది. మరోవైపు చెరువులకు గండ్లు పడడం..ప్రాజెక్టులు పొంగి పొర్లడంతో పలు గ్రామాల్లో వేల హెక్టార్లలో పంటలు జలమయమయ్యాయి. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, పూలు, పండ్ల తోటలు, కూరగాయల పంటలు నీటమునిగాయి. కరువుతో అల్లాడుతూ వానలు కురవాలని కోరుకుంటున్న రైతులను.. తాజా వానలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఈ వానల వల్ల మెట్టపంటలకు పెద్దగా ముప్పు లేనప్పటికీ.. కూరగాయల పంటలు మాత్రం కొంతమేర దెబ్బతినే అవకాశం ఉంది. ఇదే తరహాలో మరో మూడు రోజులు వరుసగా వర్షాలు కురిస్తే అన్నిరకాల పంటలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు విజయ్‌కుమార్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. సోమవారానికి వర్షం తెరిపిస్తే కొన్ని పంటలకు మేలు జరిగే అవకాశం ఉందన్నారు.
కరువు తీరా వాన..
Published Sun, Aug 31 2014 11:52 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement