Trough of low pressure
-
మరో ముప్పు
► తరుముకొస్తున్న అల్పపీడనం ► అండమాన్ వద్ద అల్పపీడన ద్రోణి సాక్షి ప్రతినిధి, చెన్నై: వర్దా తుపాన్ విలయం నుంచి రాష్ట్రం ఇంకా తేరుకోక ముందే మరో ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతం అండమాన్ దీవుల సమీపంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారి తమిళనాడువైపు కదులుతున్నట్లు చెన్నై వాతావరణశాఖ హెచ్చరించింది. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు సహజంగా అక్టోబర్ 20వ తేదీన ప్రవేశిస్తాయి. అయితే ఈ ఏడాది అక్టోబర్ 30వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈశాన్య రుతుపవనాలు సాగుతున్నా నవంబరులో తగినంతగా వర్షాలు పడలేదు. ఈశాన్య రుతుపవనాలు ఆరంభమైన తొలిరోజుల్లో బంగాళాఖాతంలో గియాండి తుపాన్ ఏర్పడింది. ఈ తుపాన్ వల్ల తమిళనాడులో వర్షాలు పడలేదు. ఆ తరువాత నడా తుపాన్ కారైక్కాల్ సమీపంలో తీరం దాటినపుడు కడలూరు, నాగపట్టినం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇదిలా ఉండగా, ఈనెల 10వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడిన వర్దా తుపాన్ 12వ తేదీన చెన్న నగరాన్ని నేరుగా తాకింది. చెన్నైలో 119 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తుపాన్ తీరం దాటేపుడు గంటకు 130–140 కీలోమీటర్ల వేగంతో వీచిన గాలులు నగరాన్ని, శివార్లను దారుణంగా కుదిపేసింది. సగటున డిసెంబరులో 191 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం రెండు వారాల్లో 329 మిల్లీ మీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. మళ్లీ ముప్పు: ఇదిలా ఉండగా, రాష్ట్రానికి మరో ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ చెబుతోంది. ఈశాన్య రుతుపవనాల కాలం మరో 15 రోజుల్లో ముగుస్తున్న దశలో భారీ వర్షాలు పడతాయని అంచనా. ప్రస్తుతం బంగాళాఖాతంలో అండమాన్ దీవుల సమీపంలో ఒక అల్పపీడన ద్రోణి కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమేణా బలపడి ఈశాన్యం నుంచి వాయువ్య దిశగా పయనిస్తూ తమిళనాడు తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే అంచనా ప్రకారం అల్పపీడన ద్రోణి రాష్ట్ర తీరాన్ని తాకిన పక్షంలో భారీ వర్షాలు కుదిపేసే అవకాశం ఉందని తెలుస్తోంది. -
జిల్లాలో ఓ మోస్తరుగా వర్షాలు
కడప సెవెన్‌రోడ్స్ : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి కారణంగా జిల్లాలోని వివిధ మండలాల్లో సోమవారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తం మీద 119.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, జిల్లా సగటు 2.3 మిల్లీమీటర్లుగా నమోదైంది. జిల్లాలో అత్యధికంగా పెండ్లిమర్రి మండలంలో 19.6 మిల్లీమీటర్లు కురిసింది. వివిధ మండలాలను పరిశీలిస్తే కడపలో 2.8, వల్లూరు 4.2, సీకే దిన్నె 5.2, చెన్నూరు 2.8, ఖాజీపేట 2.0, కమలాపురం 16.8, ఎర్రగుంట్ల 10.0, సంబేపల్లె 3.0, లక్కిరెడ్డిపల్లె 2.0, చక్రాయపేట 1.4, రామాపురం 10.0, గాలివీడు 1.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జమ్మలమడుగులో 5.2, మైలవరం 11.4, పెద్దముడియం 2.2, ముద్దనూరు 5.2, కొండాపురం 1.6, ప్రొద్దుటూరు 1.2, చాపాడు 2.0, వేంపల్లె 4.2, తొండూరు 3.4, సింహాద్రిపురంలో 2.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. రాజంపేట రెవెన్యూ డివిజన్లో ఎక్కడా వర్షం కురవలేదు. -
కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి
విశాఖపట్నం : తమిళనాడు తీరానికి సమీపంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. తమిళనాడు ప్రాంతంలో 3.5 కిలోమీటర్ల మేర ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని... అలాగే ఒకట్రెండు చోట్ల భారీవర్షాలు పడతాయని తెలిపింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి ఉత్తర దిశగా గాలులు వీస్తాయని పేర్కొంది. ఉత్తరకోస్తాలో చెదురుమదురు వర్షాలు పడతాయని చెప్పింది. అయితే దక్షిణ కోస్తాలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
చినుకు.. వణుకు
30 వేల ఎకరాల్లో పనలపై వరి జిల్లాలో రెండు రోజులపాటు వర్షాలు త్వరగా కుప్పలు వేసుకోవాలని అధికారుల సూచన ‘అయితే అతివృష్టి.. లేకుంటే అనావృష్టి’ అన్నట్లు ఈ ఏడాది అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వరి కోతల సమయంలో అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో బెంబేలెత్తిపోతున్నారు. దీనికితోడు సోమవారం సాయంత్రం చిరుజల్లులు కురవడంతో రైతుల వెన్నులో వణుకు మొదలైంది. చేతి వరకు వచ్చిన పంట నోటిదాకా రాకుండా పోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. మచిలీపట్నం : ఈ ఏడాది కాలువలకు సాగునీరు విడుదల కాకపోయినా రైతన్నలు అష్టకష్టాలు పడి పైరును బతికించుకున్నారు. తీరా పంట చేతికొచ్చే సమయంలో వారిని భయాందోళనలు వెంటాడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కొంతమేర పంట నష్టం జరగగా మళ్లీ భారీ వర్షం కురిస్తే పూర్తిగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రానున్న రెండు రోజుల్లో 7.5 మిల్లీమీటర్ల నుంచి 35 మిల్లీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో వారు మరింత ఆందోళన చెందుతున్నారు. 30 వేల ఎకరాల్లో పనలపై వరి ఈ ఏడాది ఖరీఫ్‌లో 6.34 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగాల్సి ఉండగా 4.63 లక్షల ఎకరాల్లోనే జరిగింది. ప్రస్తుతం రెండు లక్షల ఎకరాల్లో వరి కోతకు సిద్ధంగా ఉంది. 30 వేల ఎకరాల్లో వరి కోతకోసి పనలపై ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అధిక శాతం రైతులు బీపీటీ 5204 రకం వరి వంగడాన్ని ఈ ఏడాది సాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో 50 వేల ఎకరాల్లో పంట నేలవాలి నీట మునిగింది. మళ్లీ భారీ వర్షం కురిస్తే కోతకు సిద్ధంగా ఉన్న వరి పైరు నేలవాలుతుందని, కంకులు నీటిలో మునిగి 24 గంటలపాటు అలాగే ఉంటే మొలకెత్తుతాయని రైతులు చెబుతున్నారు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో పనలపై ఉన్న వరిని త్వరితగతిన కుప్పలు వేయాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. మినుములు చల్లినవారికీ ఇబ్బందే రబీకి నీరు ఇవ్వరనే సమాచారంతో రైతులు వరికోత కోసే ముందు రెండో పంటగా మినుము విత్తనాలు చల్లుతున్నారు. ప్రభుత్వం కిలో విత్తనాలు రూ. 102కు సబ్సిడీపై అందజేస్తుండగా.. ఇవి సక్రమంగా రైతులకు చేరని పరిస్థితి నెలకొంది. మినుము పంటకు అదును తప్పుతుందనే కారణంతో రైతులు బహిరంగ మార్కెట్లో విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఎకరానికి 20 కిలోల విత్తనాలు చల్లుతుండగా బహిరంగ మార్కెట్లో కిలో రూ. 150 నుంచి రూ. 180కు కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఎకరానికి 20 కిలోలు చొప్పున మినుము విత్తనాలు చల్లితే అన్ని ఖర్చులు కలిపి ఎకరానికి రూ. 3500 అవుతుంది. విత్తనాలు చల్లిన ఒకటి, రెండు రోజులకే వర్షం కురిస్తే మొలక వచ్చిన విత్తనాలు నీటిలో నాని కుళ్లిపోతాయి. కోతకు సిద్ధంగా ఉన్న వరితో పాటు అపరాల సాగుపైనా వర్ష ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి
విశాఖపట్నం : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. ద్రోణి ప్రాంతంలో 3.6 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని తెలిపింది. దక్షిణా కోస్తా, రాయలసీమలో నేడు, రేపు వర్షాలు పడతాయని పేర్కొంది. ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. తమిళనాడులోనూ విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. -
బంగాళాఖాతంలో స్థిరంగా అల్పపీడన ద్రోణి
విశాఖపట్నం : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. అల్పపీడన ద్రోణి మరింత బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర, రాయలసీమలో ఆదివారం, సోమవారం విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. -
చిరుజల్లులతో ఉపశమనం
సిటీబ్యూరో: ఉదయం నుంచే మండుటెండతో విలవిల్లాడిన సిటీజనులు..ఆదివారం సాయంత్రం ఆకాశం మేఘావృతమై.. ఒక్కసారిగా కురిసిన జల్లులతో ఉపశమనం పొందారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. కొన్నిచోట్ల వడగళ్లు కురిశాయి. సాయంత్రం 5.30 గంటల వరకు 0.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్టంగా 39.6 డిగ్రీలు, కనిష్టంగా 27.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ 47 శాతంగా నమోదైంది. రాగల 24 గంటల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి
విశాఖ: తమిళనాడు తీరానికి చేరువలో నైరుతి బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం మరింత బలపడి మంగళవారానికి వాయుగుండంగా మారే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో దక్షిణ కోస్తాలో చాలచోట్ల ఓ మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్టు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఉత్తరకోస్తాలో కొన్నిచోట్ల ఒ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఈ అల్పపీడన ప్రభావంతో గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈశాన్య దిశగా ఈదురుగాలులు వీచే అవకాశముంది. ముందు జాగ్రత్త చర్యగా సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. -
కరువు తీరా వాన..
అల్పపీడన ద్రోణితో జిల్లాలో భారీ వర్షాలు ►పశ్చిమంలో నిండిన చెరువులు, కుంటలు ►తూర్పు ప్రాంతంలోనూ మోస్తరు వర్షం ►వరదెత్తిన కాగ్నా, మూసీ నదులు ►పొంగిపొర్లిన లఖ్నాపూర్ ప్రాజెక్టు ►తెగిన రోడ్లు, జలదిగ్బంధంలో పలు గ్రామాలు ► పరిగి డివిజన్లో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు 1 పరిగి మండలంలోని లఖ్నాపూర్ ప్రాజెక్టు అలుగు పొంగిపొర్లి ప్రవహించడంతో తరలివచ్చిన ప్రజలు 2 చేవెళ్ల డివిజన్ పరిధిలోని అమ్డాపూర్ సమీపంలో నీటమునిగిన చామంతి తోట 3 పరిగి మండలం నజీరాబాద్ తండాలో వరదలో కొట్టుకుపోయిన పత్తిపంటను చూపిస్తూ రోదిస్తున్న గిరిజన మహిళ సాక్షి, రంగారెడ్డి జిల్లా: తీవ్ర వర్షాభావంతో కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న జిల్లాను తాజా అల్పపీడనద్రోణి ఆదుకుంది. చినుకుల జాడలేక వాడిపోతున్న పంటలకు భారీ ఊరటనిచ్చింది. ద్రోణి ప్రభావంతో మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ ప్రాంతంలో కురుస్తున్న వానల ప్రభావంతో ఇప్పటికే చెరువులు, కుంటలు నిండి అలుగుపారుతున్నాయి. మరోవైపు తూర్పువైపు సైతం ఆశాజనకంగా కురుస్తున్న వర్షాలతో రైతాంగం ఆనందంలో మునిగింది. భారీ వర్షాల కారణంగా పోటెత్తుతున్న వరదలతో రవాణావ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. పశ్చిమ ప్రాంతంలోని పలు గ్రామాల్లో జనావాసాల మధ్య వరదనీరు చేరడంతో స్థానికంగా తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. శంషాబాద్ మండలం కే.బీ.దొడ్డి గ్రామంలోకి వరదనీరు చేరడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. తాండూరు మండలం వీర్‌శెట్టిపల్లి గ్రామం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. రెండ్రోజులుగా ఈ గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. సెల్ఫోన్లు సైతం మూగబోవడంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఎడతెరపి లేకుండా.. వరుసగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి జిల్లాలోని నదులు వరదెత్తాయి. దీంతో వరద ప్రవాహ ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు జలాలతో కళకళలాడుతున్నాయి. యాలాల మండలం అన్నాసాగర్ ఊర చెరువు, అచ్యుతాపూర్ పెద్ద చెరువు, కమాల్‌పూర్‌లోని షేక్‌పుర చెరువులకు గండి పడడంతో నీరంతా పొలాల్లోకి చేరింది. భారీ వర్షాల కారణంగా కాగ్నా నది ఉగ్రరూపం దాల్చింది. మూసీ, ఈసీ వాగులు సైతం రోడ్లెక్కి ప్రవహిస్తుండడంతో రవాణా వ్యవస్థ స్తంభించిందింది. జిల్లాలో పెద్దప్రాజెక్టులైన కోట్‌పల్లి ప్రాజెక్టుకు వరదనీరు జోరందుకుంది. మరోవైపు పరిగి ప్రాంతంలో సాగునీటికి కీలకమైన లఖ్నాపూర్ ప్రాజెక్టు అలుగు ప్రవహిస్తోంది. మూసీ, ఈసీ వాగుల ప్రవాహం అధికమై జంట జలాశయాలకు పరుగులు పెడుతోంది. కాగ్నా వరద ప్రభావంతో తాండూరు-మహబూబ్‌నగర్ మార్గం పూర్తిగా దెబ్బతింది. దీంతో కిలోమీటర్లమేర వాహనాలు నిలిచిపోయాయి. కంది-షాద్‌నగర్, చేవెళ్ల-శంకర్పల్లి మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా పరిగి డివిజన్లో 12 సెంటీమీటర్లు, సరూర్‌నగర్ డివిజన్లో 2.17, రాజేంద్రనగర్ డివిజన్లో 1.5 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారవర్గాలు తెలిపాయి. నీట మునిగిన పొలాలు.. వర్షాల ధాటికి వాన నీరంతా వరదై ప్రవహిస్తోంది. మరోవైపు చెరువులకు గండ్లు పడడం..ప్రాజెక్టులు పొంగి పొర్లడంతో పలు గ్రామాల్లో వేల హెక్టార్లలో పంటలు జలమయమయ్యాయి. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, పూలు, పండ్ల తోటలు, కూరగాయల పంటలు నీటమునిగాయి. కరువుతో అల్లాడుతూ వానలు కురవాలని కోరుకుంటున్న రైతులను.. తాజా వానలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ వానల వల్ల మెట్టపంటలకు పెద్దగా ముప్పు లేనప్పటికీ.. కూరగాయల పంటలు మాత్రం కొంతమేర దెబ్బతినే అవకాశం ఉంది. ఇదే తరహాలో మరో మూడు రోజులు వరుసగా వర్షాలు కురిస్తే అన్నిరకాల పంటలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు విజయ్‌కుమార్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. సోమవారానికి వర్షం తెరిపిస్తే కొన్ని పంటలకు మేలు జరిగే అవకాశం ఉందన్నారు. -
కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి
విశాఖపట్నం : రాయలసీమలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కర్ణాటక, మహారాష్ట్ర తీరప్రాంతం వద్ద అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఇది తీరంవైపు పయనిస్తూ బలహీనపడుతోందని, ఈ సమయంలో దీని ప్రభావం పరిసర ప్రాంతాలపై బాగా ఉం టుందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు ఒడిశా నుంచి కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో రాయలసీమ, కోస్తాం ధ్ర, తెలంగాణలో చాలా చోట్ల వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్ష సూచన: మంగళవారం కోస్తాంధ్రలోని పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, బుధవారం కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు, తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డిలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ నిపుణులు తెలిపారు. కొనసాగుతున్న ఉష్ణోగ్రతలు: రాయలసీమ మినహా కోస్తాంధ్ర, తెలంగాణలో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. సోమవారం తునిలో గరిష్టంగా 37.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఒంగోలు 37.3, కాకినాడ 35.8, నెల్లూరు 35.4, గన్నవరం 35.2, నిజామాబాద్ 35.1, హైదరాబాద్, రామగుండంలో 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. -
స్థిరంగా అల్పపీడన ద్రోణి
విశాఖపట్నం: విదర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రస్తుతం బీహార్, జార్ఖండ్ దగ్గర్లో ఉందని, దీని ప్రభావం మనపై ఉండబోదని స్పష్టం చేసింది. రాగల 24 గంటల్లో ఇది మరింతగా క్షీణించే అవకాశాలున్నట్టు పేర్కొంది. గతేడాది మాదిరే ఈసారి కూడా ఆగస్టు చివరి వారంలోను, సెప్టెంబర్లోను వర్షాలు బాగా కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం భారీ వర్షాలపై ఆశ లులేవని, ఉష్ణోగ్రతలు కాస్త పెరిగినపుడు ఆయా ప్రాంతాల్లో సాయంత్రంపూట ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశాలున్నాయంటున్నారు. -
వడదెబ్బకు ఏపీలో 160మంది మృతి
రెండు రోజుల్లో 222 మంది మృత్యువాత సాక్షి, విశాఖపట్నం: భానుడి భగభగలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తల్లడిల్లుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న వడగాడ్పుల తీవ్రత తట్టుకోలేక వృద్ధులు, బాలలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఎండధాటికి శుక్రవారం ఒక్కరోజే 160 మంది మృత్యువాత పడ్డారు. గురువారం 62 మంది కన్నుమూశారు. దీంతో రెండు రోజుల్లో 222 మంది ఎండలకు బలైనట్లయింది. శుక్రవారం పలుజిల్లాల్లో శుక్రవారం ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా తునిలో రికార్డుస్థాయిలో 45 డిగ్రీలకు చేరుకుంది. గతేడాది ఈ సమయానికి వేసవి దాదాపుగా ముగిసి అల్పపీడన ద్రోణి ఏర్పడింది. కానీ ఈఏడాది మాత్రం రుతుపవనాల రాక కొంత ఆలస్యం కావడంతో ఎండవేడిమి తట్టుకోలేని స్థాయికి చేరిపోయింది. ప్రస్తుతం తమిళనాడు వద్ద స్థిరంగా ఉన్న రుతుపవనాలు ఈపాటికే రాష్ట్రానికి రావాల్సిఉన్నా అరేబియా సముద్రంలో తుపాను కారణంగా నెమ్మదించాయని విశాఖలోని వాతావరణశాఖ పేర్కొంది. ప్రస్తుతానికి తుపాను ముప్పు తొలగిపోయిందని, మరో 2రోజుల్లో రుతుపవనాలు వస్తాయని తెలిపింది. సిక్కోలు వడదెబ్బ మృతులు 40 మంది వడదెబ్బ ధాటికి శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 40 మంది మృతి చెందారు. గురువారం 13 మంది మరణించడం తెలిసిందే. ఇక విశాఖ జిల్లాలో 34మంది, తూర్పుగోదావరి జిల్లాలో 31 మంది, విజయనగరం జిల్లాలో 16మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 12 మంది, ప్రకాశం జిల్లాలో 8 మంది, కృష్ణా జిల్లాలో 9 మంది, గుంటూరు జిల్లాలో నలుగురు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇద్దరు, అనంతపురం జిల్లాలో ఒకరు వడదెబ్బకు మృతిచెందారు. తెలంగాణలో 10 మంది మృతి సాక్షి,నెట్వర్క్: తెలంగాణలోని వివిధ జిల్లాల్లో శుక్రవారం వడదెబ్బకు 10 మంది మృతి చెందారు.మృతుల్లో ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ వాసి పారిపెల్లి మహేశ్(40), మెదక్ జిల్లా ఖాతా గ్రామానికి చెందిన ఎనమళ్ల రాజయ్య (45), నిజాంపేటకు చెందిన గరుగుల శ్రీనివాస్ (25), నల్లగొండ జిల్లా కోదాడలో రిక్షా కార్మికుడు హుస్సేన్(38) ఉన్నారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం గాండ్లగూడేనికి చెందిన తేజావత్ నర్సింహనాయక్(44), ఇల్లెందుకు చెందిన గాదెపాక దుర్గయ్య(58), ఖమ్మం నగర శివారు అల్లీపురానికి చెందిన కొల్లి సూరమ్మ(75), మణుగూరు భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన వంగూరి లాలయ్య(75), పినపాక మండలం ఏడూళ్ల బయ్యారానికి చెందిన దేవిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి(48), మధిర మండలం మడుపల్లికి చెందిన పొదిలి తిరుపతమ్మ(18) కూడా వడదెబ్బతో మృతి చెందారు. -
తెలంగాణకు తీవ్ర వడగాల్పులు
సాక్షి, విశాఖపట్నం: విదర్భ నుంచి తెలంగాణ , దక్షిణ కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ ఆవరించి ఉన్న అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణ , రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుముల తో కూడినజల్లులు కురిసే అవకాశా లున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే దక్షిణ కోస్తాంధ్ర, తెలంగాణ లోని పలు జిల్లాల్లో రాగల 48 గంట ల్లో తీవ్ర వడగాల్పులుంటాయని భారత వాతావరణ శాఖ తన నివేదికలో పేర్కొంది. వేడిగాలుల తీవ్రత కోస్తాం ధ్రలో గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోను, తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీం నగర్, వరంగల్ జిల్లాల్లోనూ ప్రభావం చూపనున్నట్టు తెలిపింది. వేడిగాలుల వల్ల ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6 డిగ్రీలు ఎక్కువగా నమోదు కావచ్చని పేర్కొంది. శనివారం రెంటచింతలలో అత్యధికంగా 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని వెల్లడించింది. -
తిరువూరులో 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
విశాఖపట్నం/తిరువూరు, ఛత్తీస్‌గఢ్‌నుంచి దక్షిణ తమిళనాడు వరకూ తెలంగాణ, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, అయితే దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండబోదని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో వేడి వాతావరణం కొనసాగుతుందని, మరో రెండు రోజులు వేడి సెగలు కొనసాగే అవకాశమున్నట్టు పేర్కొంది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వేడిగాలుల ప్రభావం అధికంగా ఉన్నట్లు పేర్కొంది. శుక్రవారం రాష్ట్రంలోని తిరువూరులో గరిష్టంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రతతో పట్టణంలోని వీధులు నిర్మానుష్యంగా మారాయి. మరోవైపు రెంటచింతలలో గరిష్టంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. రెంటచింతల-45.4, రామగుండం-43.8, ఒంగోలు-43.1, నిజామాబాద్-42.8, నెల్లూరు-42.7, తిరుపతి-42.6, నందిగామ-42.1, గన్నవరం-42.1, కావలి-41.4, హైదరాబాద్-40.9, కర్నూలు-40.9, బాపట్ల-40.4, అనంతపురం-40.3 -
అకాల వర్షాలు రైతన్న బెంబేలు
మారిన వాతావరణంతో అన్నదాత వెన్నులో వణుకు జిల్లా అంతటా ఆవరించిన అల్పపీడన ద్రోణి ఇంకా కల్లాల్లోనే ధాన్యం, మొక్కజొన్న మరో 48 గంటల పాటు వర్షసూచన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న అకాల వర్షాలు రబీ రైతును బెంబేలెత్తిస్తున్నాయి. చేతికందే దశలో ఉన్న పంటలు వర్షాలకు తడిచి పోవడం.. మరో రెండు రోజులపాటు వర్షాలు కొనసాగే పరిస్థితి ఉండటంతో అన్నదాత గజగజ వణికిపోతున్నాడు. శుక్రవారం నాటి వర్షాలతో వరి, మొక్కజొన్న రైతులు పంటను కాపాడుకునేందుకు నానా పాట్లు పడ్డారు. మచిలీపట్నం, న్యూస్‌లైన్ : రబీ సీజన్ ముగింపులో అకాల వర్షాలు రైతన్న వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో చిరుజల్లులతో పాటు ఒక మోస్తరు వర్షం నమోదైంది. ఈ ఏడాది రబీ సీజన్లో జిల్లాలో 2.30 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. 57,500 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. మరో ఐదువేల ఎకరాల్లో కూరగాయల పంటలు సాగులో ఉన్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. తెల్లవారుజామున ఒక మోస్తరు వర్షం కురిసింది. శుక్రవారమంతా ఆకాశంలో నల్లటి మేఘాలు ఆవరించి ఉండటంతో రైతులు పంటలను కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు. వరి పంట ప్రస్తుతం కోత, కుప్పనూర్పిడి దశలో ఉంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు హార్వెస్టర్ యంత్రాల ద్వారా పనులు పూర్తి చేసుకున్నారు. యంత్రాలతో వరికోతలు పూర్తి చేసిన పొలాల్లో ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రాశులుగా పోశారు. శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా వర్షం కురవటంతో ధాన్యం తడిచిపోయింది. భారీ వర్షం కురిస్తే పొలాల్లో నీరు నిలిచి ధాన్యం మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో ఉన్న ధాన్యం రాశులతో పాటు రోడ్డు పక్కన నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలు తడిచాయి. ఈదురుగాలులు వీస్తే మామిడికి ముప్పే... జిల్లా వ్యాప్తంగా 1.67 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ప్రస్తుతం 3, 4 దశల కోతలు పూర్తయ్యాయని రైతులు చెబుతున్నారు. భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు వీస్తే మామిడికి ప్రమాదమేనని అధికారులు, రైతులు పేర్కొంటున్నారు. చల్లపల్లి, అవనిగడ్డ, మోపిదేవి, గన్నవరం, పామర్రు, తోట్లవల్లూరు, కంకిపాడు తదితర మండలాల్లో మొక్కజొన్న సాగు అధికంగా జరిగింది. కల్లాల్లో ఉన్న మొక్కజొన్న తడవటంతో బూజు తెగులు వ్యాపించే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. కలిదిండిలో అధిక వర్షపాతం... జిల్లాలో కలిదిండి మండలంలో 20.2 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా పెడన మండలంలో 2.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గంపలగూడెంలో 4.8, గన్నవరంలో 5, ఆగిరిపల్లిలో 4.2, నూజివీడులో 3.6, ఉంగుటూరులో 3.6, బంటుమిల్లిలో 10.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 1.1 మిల్లీమీటర్లుగా నమోదైనట్లు అధికారులుచెప్పారు. రైతుల ఉరుకులు, పరుగులు... శుక్రవారం తెల్లవారుజామున వర్షం ప్రారంభం కావటంతో పొలాల్లో ఉన్న ధాన్యం రాశులను కాపాడుకునేందుకు రైతులు పరుగులు పెట్టారు. పరదాలు, వరిగడ్డితో ధాన్యం రాశులను కప్పి ఉంచారు. ఆరిన పొలంలో వర్షం కురవటం.. ట్రాక్టర్లు, టైరు బండ్లు నడిచే బాటల్లో నీరు నిలబడటంతో ధాన్యం త్వరితగతిన బయటకు తెచ్చుకోలేకపోతున్నామని రైతులు చెబుతున్నారు. ఓ మోస్తరు వర్షం కురిసింది కాబట్టి ఇప్పటికి ప్రమాదం లేదని, భారీ వర్షం కురిస్తే తీవ్ర నష్టం తప్పదని రైతులు పేర్కొంటున్నారు. తిరువూరు మార్కెట్ యార్డులో తడిచిన ధాన్యం... తిరువూరు, గంపలగూడెం మార్కెట్ యార్డులలో విక్రయించేందుకు తీసుకొచ్చిన ధాన్యం అకాల వర్షంతో తడిచిపోయింది. నూజివీడు, మైలవరం, తిరువూరు, విస్సన్నపేట, ఆగిరిపల్లి ప్రాంతాల్లో మామిడి కోత దశలో ఉంది. ఈదురుగాలులు వీస్తే కాయలు రాలిపోయి పాడవుతాయని రైతులు భయపడుతున్నారు. జగ్గయ్యపేటలో ఒక మోస్తరు వర్షం కురవటంతో వరి, మొక్కజొన్న తడిచిపోయాయి. నందిగామలో మిర్చి, మొక్కజొన్న సాగు అధికంగా ఉంది. శుక్రవారం ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఈ పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ మండలాల్లో మొక్కజొన్న కల్లాల్లోనే ఉంది. శుక్రవారం కురిసిన వర్షానికి తోడు మరింత వర్షం కురిస్తే మొక్కజొన్నలో తేమశాతం పెరిగే ప్రమాదముందని రైతులు చెబుతున్నారు. జిల్లాలో నెలకొన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కురిసిన వర్షపాతం, పంటలు ఏయే స్థితిలో ఉన్నాయి తదితర వివరాలను ఆయా మండలాల నుంచి సేకరిస్తున్నట్లు వ్యవసాయాధికారులు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. కొనసాగుతున్న భారీ వర్షాలు శుక్రవారం రాత్రి నుంచి నందిగామ, జి.కొండూరు, మైలవరం, విజయవాడ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. ఈ వర్షాలు మామిడిపై తీవ్ర ప్రభావం చూపుతాయని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.