► తరుముకొస్తున్న అల్పపీడనం
► అండమాన్ వద్ద అల్పపీడన ద్రోణి
సాక్షి ప్రతినిధి, చెన్నై:
వర్దా తుపాన్ విలయం నుంచి రాష్ట్రం ఇంకా తేరుకోక ముందే మరో ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతం అండమాన్ దీవుల సమీపంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారి తమిళనాడువైపు కదులుతున్నట్లు చెన్నై వాతావరణశాఖ హెచ్చరించింది. తమిళనాడులో ఈశాన్య రుతుపవనాలు సహజంగా అక్టోబర్ 20వ తేదీన ప్రవేశిస్తాయి. అయితే ఈ ఏడాది అక్టోబర్ 30వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈశాన్య రుతుపవనాలు సాగుతున్నా నవంబరులో తగినంతగా వర్షాలు పడలేదు. ఈశాన్య రుతుపవనాలు ఆరంభమైన తొలిరోజుల్లో బంగాళాఖాతంలో గియాండి తుపాన్ ఏర్పడింది.
ఈ తుపాన్ వల్ల తమిళనాడులో వర్షాలు పడలేదు. ఆ తరువాత నడా తుపాన్ కారైక్కాల్ సమీపంలో తీరం దాటినపుడు కడలూరు, నాగపట్టినం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఇదిలా ఉండగా, ఈనెల 10వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడిన వర్దా తుపాన్ 12వ తేదీన చెన్న నగరాన్ని నేరుగా తాకింది. చెన్నైలో 119 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తుపాన్ తీరం దాటేపుడు గంటకు 130–140 కీలోమీటర్ల వేగంతో వీచిన గాలులు నగరాన్ని, శివార్లను దారుణంగా కుదిపేసింది. సగటున డిసెంబరులో 191 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం రెండు వారాల్లో 329 మిల్లీ మీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.
మళ్లీ ముప్పు: ఇదిలా ఉండగా, రాష్ట్రానికి మరో ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ చెబుతోంది. ఈశాన్య రుతుపవనాల కాలం మరో 15 రోజుల్లో ముగుస్తున్న దశలో భారీ వర్షాలు పడతాయని అంచనా. ప్రస్తుతం బంగాళాఖాతంలో అండమాన్ దీవుల సమీపంలో ఒక అల్పపీడన ద్రోణి కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమేణా బలపడి ఈశాన్యం నుంచి వాయువ్య దిశగా పయనిస్తూ తమిళనాడు తీర ప్రాంతాలకు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే అంచనా ప్రకారం అల్పపీడన ద్రోణి రాష్ట్ర తీరాన్ని తాకిన పక్షంలో భారీ వర్షాలు కుదిపేసే అవకాశం ఉందని తెలుస్తోంది.