రెండు రోజుల్లో 222 మంది మృత్యువాత
సాక్షి, విశాఖపట్నం: భానుడి భగభగలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తల్లడిల్లుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న వడగాడ్పుల తీవ్రత తట్టుకోలేక వృద్ధులు, బాలలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఎండధాటికి శుక్రవారం ఒక్కరోజే 160 మంది మృత్యువాత పడ్డారు. గురువారం 62 మంది కన్నుమూశారు. దీంతో రెండు రోజుల్లో 222 మంది ఎండలకు బలైనట్లయింది. శుక్రవారం పలుజిల్లాల్లో శుక్రవారం ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా తునిలో రికార్డుస్థాయిలో 45 డిగ్రీలకు చేరుకుంది.
గతేడాది ఈ సమయానికి వేసవి దాదాపుగా ముగిసి అల్పపీడన ద్రోణి ఏర్పడింది. కానీ ఈఏడాది మాత్రం రుతుపవనాల రాక కొంత ఆలస్యం కావడంతో ఎండవేడిమి తట్టుకోలేని స్థాయికి చేరిపోయింది. ప్రస్తుతం తమిళనాడు వద్ద స్థిరంగా ఉన్న రుతుపవనాలు ఈపాటికే రాష్ట్రానికి రావాల్సిఉన్నా అరేబియా సముద్రంలో తుపాను కారణంగా నెమ్మదించాయని విశాఖలోని వాతావరణశాఖ పేర్కొంది. ప్రస్తుతానికి తుపాను ముప్పు తొలగిపోయిందని, మరో 2రోజుల్లో రుతుపవనాలు వస్తాయని తెలిపింది.
సిక్కోలు వడదెబ్బ మృతులు 40 మంది
వడదెబ్బ ధాటికి శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 40 మంది మృతి చెందారు. గురువారం 13 మంది మరణించడం తెలిసిందే. ఇక విశాఖ జిల్లాలో 34మంది, తూర్పుగోదావరి జిల్లాలో 31 మంది, విజయనగరం జిల్లాలో 16మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 12 మంది, ప్రకాశం జిల్లాలో 8 మంది, కృష్ణా జిల్లాలో 9 మంది, గుంటూరు జిల్లాలో నలుగురు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇద్దరు, అనంతపురం జిల్లాలో ఒకరు వడదెబ్బకు మృతిచెందారు.
తెలంగాణలో 10 మంది మృతి
సాక్షి,నెట్‌వర్క్: తెలంగాణలోని వివిధ జిల్లాల్లో శుక్రవారం వడదెబ్బకు 10 మంది మృతి చెందారు.మృతుల్లో ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ వాసి పారిపెల్లి మహేశ్(40), మెదక్ జిల్లా ఖాతా గ్రామానికి చెందిన ఎనమళ్ల రాజయ్య (45), నిజాంపేటకు చెందిన గరుగుల శ్రీనివాస్ (25), నల్లగొండ జిల్లా కోదాడలో రిక్షా కార్మికుడు హుస్సేన్(38) ఉన్నారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం గాండ్లగూడేనికి చెందిన తేజావత్ నర్సింహనాయక్(44), ఇల్లెందుకు చెందిన గాదెపాక దుర్గయ్య(58), ఖమ్మం నగర శివారు అల్లీపురానికి చెందిన కొల్లి సూరమ్మ(75), మణుగూరు భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన వంగూరి లాలయ్య(75), పినపాక మండలం ఏడూళ్ల బయ్యారానికి చెందిన దేవిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి(48), మధిర మండలం మడుపల్లికి చెందిన పొదిలి తిరుపతమ్మ(18) కూడా వడదెబ్బతో మృతి చెందారు.
వడదెబ్బకు ఏపీలో 160మంది మృతి
Published Sat, Jun 14 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 8:45 AM
Advertisement