రాయలసీమలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కర్ణాటక, మహారాష్ట్ర తీరప్రాంతం వద్ద అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది.
విశాఖపట్నం : రాయలసీమలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కర్ణాటక, మహారాష్ట్ర తీరప్రాంతం వద్ద అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఇది తీరంవైపు పయనిస్తూ బలహీనపడుతోందని, ఈ సమయంలో దీని ప్రభావం పరిసర ప్రాంతాలపై బాగా ఉం టుందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు ఒడిశా నుంచి కోస్తాంధ్ర, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో రాయలసీమ, కోస్తాం ధ్ర, తెలంగాణలో చాలా చోట్ల వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది.
భారీ వర్ష సూచన: మంగళవారం కోస్తాంధ్రలోని పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, బుధవారం కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు, తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డిలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ నిపుణులు తెలిపారు.
కొనసాగుతున్న ఉష్ణోగ్రతలు: రాయలసీమ మినహా కోస్తాంధ్ర, తెలంగాణలో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. సోమవారం తునిలో గరిష్టంగా 37.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఒంగోలు 37.3, కాకినాడ 35.8, నెల్లూరు 35.4, గన్నవరం 35.2, నిజామాబాద్ 35.1, హైదరాబాద్, రామగుండంలో 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది.