30 వేల ఎకరాల్లో పనలపై వరి
జిల్లాలో రెండు రోజులపాటు వర్షాలు
త్వరగా కుప్పలు వేసుకోవాలని అధికారుల సూచన
‘అయితే అతివృష్టి.. లేకుంటే అనావృష్టి’ అన్నట్లు ఈ ఏడాది అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వరి కోతల సమయంలో అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండాపోయింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో బెంబేలెత్తిపోతున్నారు. దీనికితోడు సోమవారం సాయంత్రం చిరుజల్లులు కురవడంతో రైతుల వెన్నులో వణుకు మొదలైంది. చేతి వరకు వచ్చిన పంట నోటిదాకా రాకుండా పోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.
మచిలీపట్నం : ఈ ఏడాది కాలువలకు సాగునీరు విడుదల కాకపోయినా రైతన్నలు అష్టకష్టాలు పడి పైరును బతికించుకున్నారు. తీరా పంట చేతికొచ్చే సమయంలో వారిని భయాందోళనలు వెంటాడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు కొంతమేర పంట నష్టం జరగగా మళ్లీ భారీ వర్షం కురిస్తే పూర్తిగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రానున్న రెండు రోజుల్లో 7.5 మిల్లీమీటర్ల నుంచి 35 మిల్లీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో వారు మరింత ఆందోళన చెందుతున్నారు.
30 వేల ఎకరాల్లో పనలపై వరి
ఈ ఏడాది ఖరీఫ్‌లో 6.34 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగాల్సి ఉండగా 4.63 లక్షల ఎకరాల్లోనే జరిగింది. ప్రస్తుతం రెండు లక్షల ఎకరాల్లో వరి కోతకు సిద్ధంగా ఉంది. 30 వేల ఎకరాల్లో వరి కోతకోసి పనలపై ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అధిక శాతం రైతులు బీపీటీ 5204 రకం వరి వంగడాన్ని ఈ ఏడాది సాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో 50 వేల ఎకరాల్లో పంట నేలవాలి నీట మునిగింది. మళ్లీ భారీ వర్షం కురిస్తే కోతకు సిద్ధంగా ఉన్న వరి పైరు నేలవాలుతుందని, కంకులు నీటిలో మునిగి 24 గంటలపాటు అలాగే ఉంటే మొలకెత్తుతాయని రైతులు చెబుతున్నారు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో పనలపై ఉన్న వరిని త్వరితగతిన కుప్పలు వేయాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
మినుములు చల్లినవారికీ ఇబ్బందే
రబీకి నీరు ఇవ్వరనే సమాచారంతో రైతులు వరికోత కోసే ముందు రెండో పంటగా మినుము విత్తనాలు చల్లుతున్నారు. ప్రభుత్వం కిలో విత్తనాలు రూ. 102కు సబ్సిడీపై అందజేస్తుండగా.. ఇవి సక్రమంగా రైతులకు చేరని పరిస్థితి నెలకొంది. మినుము పంటకు అదును తప్పుతుందనే కారణంతో రైతులు బహిరంగ మార్కెట్‌లో విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఎకరానికి 20 కిలోల విత్తనాలు చల్లుతుండగా బహిరంగ మార్కెట్‌లో కిలో రూ. 150 నుంచి రూ. 180కు కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఎకరానికి 20 కిలోలు చొప్పున మినుము విత్తనాలు చల్లితే అన్ని ఖర్చులు కలిపి ఎకరానికి రూ. 3500 అవుతుంది. విత్తనాలు చల్లిన ఒకటి, రెండు రోజులకే వర్షం కురిస్తే మొలక వచ్చిన విత్తనాలు నీటిలో నాని కుళ్లిపోతాయి. కోతకు సిద్ధంగా ఉన్న వరితో పాటు అపరాల సాగుపైనా వర్ష ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
చినుకు.. వణుకు
Published Tue, Dec 1 2015 1:06 AM | Last Updated on Sun, Sep 3 2017 1:16 PM
Advertisement