కన్నీట ముం‘చేను’... | Telagana rains soaked the Farmer | Sakshi
Sakshi News home page

కన్నీట ముం‘చేను’...

Published Mon, Apr 13 2015 1:59 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM

Telagana rains soaked the Farmer

తెలంగాణ రైతును ముంచిన వానలు.. అకాల వర్షాలతో రైతాంగానికి అపార నష్టం వరి, నువ్వులు, మొక్కజొన్న, జొన్న పంటలకు దెబ్బ.. నేలరాలిన మామిడి... పూలు, కూరగాయలకూ నష్టంమరో మూడునాలుగు రోజులపాటు వర్షాలే.. వడగళ్లు, భారీ వర్షాలకు అవకాశముందన్న వాతావరణ శాఖ 
అకాల వర్షాలతో రైతన్నకు అపార నష్టం వాటిల్లింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అంచనా.  చేతికొచ్చే సమయానికి వరి పైరు నేలకొరిగింది. మొక్కజొన్న. నువ్వులు, జొన్న, పొద్దు తిరుగుడు, కూరగాయలు, పూలు, పండ్ల తోటలు నాశనమయ్యాయి. మామిడి రైతులకు కన్నీరే మిగిలింది. ఈదురుగాలులు, వడగళ్ల వానలు మరో మూడు నాలుగు రోజులు ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొనడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి అందివచ్చిన జొన్న పంట నాశనమవడంతో ఆదిలాబాద్ జిల్లా కుభీర్ మండలానికి చెందిన రైతు రాథోడ్ గంగారాం చేను వద్దే పురుగుమందు తాగి మృతి చెందాడు. కాగా, ఈ రెండు రోజుల్లో పిడుగుపాటుతో ఒకరు, ఇంటి గోడకూలి మరొకరు, కరెంట్ షాక్‌తో దంపతులు ప్రాణాలు కోల్పోయారు.    
 
జిల్లాల్లో అపార నష్టం

ఈదురు గాలులు, అకాల వర్షాలు ఊహించని దెబ్బతీశాయి. హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో పంటలకు అపార నష్టం వాటిల్లింది. వేల ఎకరాల్లో జరిగిన నష్టం విలువ భారీగా ఉంటుంది. మరికొన్ని రోజుల్లో కోతకు రానున్న వరి పంట నేల కొరిగింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వరి పంటకే ఎక్కువ నష్టం వాటిల్లింది. నీటిలో తడవడం వల్ల ధాన్యం రంగు మారుతుందని, పెట్టుబడులు కూడా చేతికి రావని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేక కుంగిపోతున్న అన్నదాతలకు అకాల వర్షాలు తీవ్ర చేటును తెచ్చిపెట్టాయి. చాలా ప్రాంతాల్లో మామిడి నేలరాలింది. మొక్కజొన్న కంకుల్లోకి వర్షం నీరు చేరడంతో అవి రంగుమారే ప్రమాదముంది. ఉడకపెట్టిన తర్వాత ఆరబెడుతున్న తరుణంలో కురిసిన వర్షాలతో పసుపు ఎరుపు రంగులోకి మారే ముప్పు తలెత్తింది. వీటి ధరలు పూర్తిగా పడిపోతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈదురు గాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో రవాణాకు ఇబ్బందులు తలెత్తాయి. శని, ఆదివారాల్లో ఆదిలాబాద్ జిల్లాల్లోని లక్ష్మణచాంద, లోకేశ్వరం, కుంటాల మండలాల్లో రెండు నుంచి నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట, మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలంలో అత్యధికంగా ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వారాంతం సెలవు దినాలు కావడంతో పంట నష్టంపై వ్యవసాయాధికారులు ఇంకా సమగ్ర అంచనా వేయలేదు.
 
ఐదుగురి మృతి

అకాల వర్షంతో పంట దెబ్బతినడంతో ఆదిలాబాద్ జిల్లా కుభీర్ మండలం బ్రహ్మేశ్వర్‌కి చెందిన రాథోడ్ గంగారాం(70) ఆది వారం ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామ శివారులోని కొండ ప్రాం తంలో మూడెకరాల్లో జొన్న వేసిన గంగారాం పోడు వ్యవసాయం చేస్తున్నాడు. శనివారం కురిసిన వర్షంతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆదివారం చేనుకు వెళ్లి మనస్తాపం చెందిన గంగారాం అక్కడే పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు భైంసా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మరోవైపు రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం కడుశలమడుగు తండాలో ఆదివారం ఉదయం ఓ మహిళ పిడుగుపాటుతో మృతి చెందింది. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట్ మండలం హజిలాపూర్ తండాకు చెందిన సక్రిబాయి దంపతులు కడుశలమడుగు తండాకు సమీపంలోని తమ పొలంలో ఉండగా పిడుగుపాటుకు గురయ్యారు.  నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని వీరన్నగుట్టలో ఇంటి గోడ కూలడంతో ఇన్నాబాయి(60) మృతి చెందారు. కాగా, వరంగల్ నగర పరిధిలోని కరీమాబాద్ ఎస్‌ఆర్‌ఆర్‌తోట కాలనీలో ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగి భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. కాలనీలో ఉంటున్న అంకతి రమేష్(50), రాజమణి(45) దంపతుల ఇంటి ఆవరణలో బట్టలు ఆరేసుకునే తీగలపై కరెంట్ తీగలు పడటంతో షాక్ తగిలి వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.
రాజధానిలో మూడు రోజులుగా వర్షం

రాజధాని హైదరాబాద్‌లో మూడు రోజులుగా జల్లులు పడుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 1.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. వరుస వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై మోకాళ్లలోతున వర్షపు నీరు నిలిచింది. కూకట్‌పల్లి, గుడిమల్కాపూర్, ఉప్పల్, మోతీనగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, బేగంపేట్, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ ఫీడర్లు ట్రిప్పవడంతో కొన్ని గంటలపాటు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. వచ్చే 48 గంటల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.
 
మార్కెట్‌యార్డుల్లో తడిచిన ధాన్యం

నల్లగొండ జిల్లాలో భారీ వర్షాలతో సుమారు రెండు వేల హెక్టార్లలో పంట దెబ్బతిన్నది. మార్కెట్లకు తీసుకువచ్చిన ధాన్యం నీటిపాలైంది. కట్టంగూరు మండలం అయిటిపాములలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో 6 వేల క్వింటాళ్లు, రామన్నపేట మండలంలోని ఐదు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో 12 వేల క్వింటాళ్లు, నకిరేకల్ మార్కెట్‌యార్డులో వెయ్యి బస్తాల మేర ధాన్యం తడిచింది. భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి మండలాల్లో కోతకొచ్చిన పంటలు నేలవాలాయి. సూర్యాపేట, పెన్‌పహాడ్, చివ్వెంల, ఆత్మకూర్.ఎస్ మండలాల్లో వరి పొలాలు నేలకొరిగాయి. సంస్థాన్ నారాయణపురం మండలంలో 500 హెక్టార్లలో వరి పంటకు నష్టం జరిగింది. మునుగోడులో మామిడి, నిమ్మ, కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. ఇక మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో కురిసిన వడగళ్లవానకు మామిడి కాయలు నేలరాలాయి. జిల్లావ్యాప్తంగా 24 వేల హెక్టార్లలో మామిడి సాగవగా ఇప్పటివరకు 8 వేల హెక్టార్లలో తోటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు అధికారుల ప్రాథమిక అంచనా. మరో 12 వేల హెక్టార్లలోనూ తోటలకు నష్టం జరిగినట్లు భావిస్తున్నారు.
 
బలమైన తేమ గాలుల వల్లే

రాష్ర్టవ్యాప్తంగా మూడు నాలుగు రోజులపాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశముందని సీనియర్ శాస్త్రవేత్త సీతారాం చెప్పారు. బంగాళాఖాతం నుంచి తీవ్రమైన గాలులు వీస్తున్నందున ఈ ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. 24 గంటల్లో మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో అత్యధికంగా 7.3 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో 7.2, మద్నూరులో 7.1 సెం.మీ. మేర వర్షం పడింది. అల్పపీడన ద్రోణి, బంగాళాఖాతం, అరేబియా సముద్రాలపైనుంచి వీస్తున్న బలమైన తేమగాలులే అకాల వర్షాలకు కారణమని ఆ శాఖ అధికారులు తెలిపారు.
 
దెబ్బతీసిన ఈదురుగాలులు..

కరీంనగర్ జిల్లాలో ఈదురుగాలులు, వడగండ్ల వానతో భారీగా పంట, ఆస్తినష్టం వాటిల్లింది. దాదాపు 20 వేల హెక్టార్లలో పంట దెబ్బతిన్నది. వరి, జొన్న పంటలతో పాటు మామిడికి తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా. ఈదురుగాలులకు వేలాది చెట్లు, వందలాది హోర్డింగ్స్ నేలమట్టమయ్యాయి. కోట్లాది రూపాయల ఆస్తినష్టం వాటిల్లింది. జగిత్యాల డివిజన్ పరిధిలో వందలాది గుడిసెలు కూలిపోయాయి. మల్హర్‌మండలంలో మిర్చి, మొక్కజొన్న, పసుపు పంటలు తడిసిపోయాయి.

నువ్వులు, సజ్జ, తదితర పంటలు నేలను తాకాయి. నిజామాబాద్ జిల్లాలో వరి పంటకు ఎక్కువ నష్టం వాటిల్లింది. దాదాపు 23 వేల ఎకరాల్లో వరి నేలకొరిగింది. బోధన్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడల్లో వడగళ్ల వాన పడింది. మామిడి, మొక్కజొన్న, పసుపు, సజ్జ, నువ్వు పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు వరంగల్ జిల్లాలో పెద్దగా పంట నష్టం లేకపోయినా నగరంలో మాత్రం ప్రజా జీవనం అస్తవ్యస్తమైంది. మిషన్ కాకతీయ పనులకు ఆటంకం ఏర్పడింది. కాగా, వ్యవసాయ శాఖ అధికారుల అంచనాల మేరకు వారం రోజుల్లో కురిసిన వర్షానికి రాష్ర్టంలో 7,317 హెక్టార్లలో ఆహార పంటలు దెబ్బతిన్నాయి.

12,216 హెక్టార్లలో మామిడి, అరటి, బొప్పాయి, కూరగాయ తోటలకు నష్టం వాటిల్లింది. ఆదిలాబాద్ జిల్లాలో తాజాగా కురిసిన వర్షాలకు కోత దశలో ఉన్న మొక్కజొన్న, జొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సారంగాపూర్, నిర్మల్, దిలావర్‌పూర్, లక్ష్మణచాంద, మామడ, భైంసా, తానూరు, లోకేశ్వరం, కుంటాల మండలాల పరిధిలో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చెన్నూరు, జైపూర్, కోటపల్లి తదితర మండలాల్లో మామిడి రైతులకు నష్టం జరిగింది. చేతికందిన పంటను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన రైతులు అకాలవర్షాలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కుంటా, కల్లూరు, లోకేశ్వరంలోని మార్కెట్ కేంద్రాల్లో మొక్కజొన్న తడిసి ముద్దయింది. జిల్లావ్యాప్తంగా సగటున 15.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement