Fruit orchards
-
1.3 ఎకరాల్లో ఏటా రూ. 5 లక్షలు!
ప్రకృతి వ్యవసాయోద్యమకారులు మసనొబు ఫుకుఒకా, సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో స్ఫూర్తి పొందిన గోగిరెడ్డి రాజేంద్రరెడ్డి అనే రైతు తనకున్న ఎకరం 30 సెంట్ల పొలంలో ఆహార అరణ్యాన్ని సృష్టించారు. గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరు గ్రామంలో రోడ్డు పక్కనే ఈ ఫుడ్ ఫారెస్ట్ పచ్చగా అలరారుతోంది. ఏఎంఐఈ చదువుకున్న రాజేంద్రరెడ్డి వ్యవసాయం చేస్తూ హైదరాబాద్‌లో సివిల్ కాంట్రాక్టులు చేస్తుండేవారు. 1.3 ఎకరాల నల్ల రేగడి భూమి. 30 అడుగుల్లో నీరు. పక్కనే పంట కాలువ. 2011–12 వరకు రసాయనిక వ్యవసాయ పద్ధతిలో అరటి తోట సాగు చేసేవారు. ఫుకుఒకా రచన ‘గడ్డి పరకతో విప్లవం’ చదివి ప్రకృతి వ్యవసాయం వైపు ఆకర్షితుడైన రాజేంద్రరెడ్డి.. హైదరాబాద్(2012)లో పాలేకర్ శిబిరంలో శిక్షణ పొంది ఐదంచెల పండ్ల తోటల నమూనాకు ఫిక్సయ్యారు. అలా ప్రారంభమైన ఫుడ్ ఫారెస్ట్ ఇప్పుడు ఏడాది పొడవునా ఆహార, ఆదాయ భద్రతను అందించే స్థాయికి ఎదిగింది. రాజేంద్రరెడ్డి మాటల్లోనే ఆయన అనుభవాలు.. కర్పూర అరటి, కొబ్బరితోనే రూ. 5 లక్షలు రసాయనిక ఎరువులు పురుగుమందులు ఆపేయగానే తెగుళ్లు ఆగిపోయి.. పంట ఆరోగ్యంగా కనిపించింది. అరటి గెల సైజు మొదటి రెండేళ్లు తగ్గింది. ఆచ్ఛాదన సరిగ్గా వేసిన తర్వాత గెల సైజు క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు పొలమంతా చెట్లు, చెట్ల మధ్యలో ఆచ్ఛాదనతో నిండి ఉంటుంది. బయటకన్నా 4–5 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. భూమిలో జీవనద్రవ్యం(హ్యూమస్) ఏర్పడడానికి కావాల్సిన సూక్ష్మవాతావరణం ఏడాది పొడవునా మా ఫుడ్ ఫారెస్ట్‌లో నెలకొని ఉంటుంది. మామూలు పొలాల్లో మాదిరిగా సేంద్రియ కర్బనం ఆవిరి కాదు. ఇదే పంటల ఉత్పాదకతను పెంచింది. అరటి గెలకు సగటున రూ. వెయ్యి ఆదాయం ఆరేళ్లు గడిచిన తర్వాత.. ఆదాయం ప్రధానంగా 600 కర్పూర అరటి చెట్లు, 40 కొబ్బరి చెట్ల ద్వారానే సమకూరుతోంది. తాజాగా ఒక గెల 16 అస్తాలతో 46 కిలోలు తూగింది. నికరంగా 40 కిలోల అరటి పండ్లు వచ్చాయి. పండ్లను నేనే స్వయంగా గుంటూరులో ఇళ్లకు తీసుకెళ్లి కిలో రూ.50కి అందిస్తున్నాను. సుడిగాలులకు కొన్ని చెట్లు పడిపోయినా.. సగటున ఏడాదికి నికరంగా 400 అరటి గెలలు వస్తాయి. సగటున గెలకు 20 కిలోల పండ్లు అనుకుంటే.. గెలకు రూ. వెయ్యికి తగ్గకుండా ఏటా రూ. 4 లక్షల ఆదాయం వస్తున్నది. కొబ్బరి కాయల ద్వారా రూ. లక్ష 23 ఏళ్ల నాటి కొబ్బరి చెట్లు 40 ఉన్నాయి. అధిక వర్షాలు, వడగాలులు ఎట్లా ఉన్నా ఏడాదికి చెట్టుకు కనీసం 150–200 కొబ్బరి కాయలు ఖాయంగా వస్తున్నాయి. 6 వేల కాయలను రూ. 15–20కి రిటైల్‌గా అమ్ముతున్నాను. గ్యారంటీగా రూ. లక్ష వస్తుంది. అరటి, కొబ్బరి ద్వారా ఏటా రూ. 5 లక్షల ఆదాయం వస్తున్నది. ఇది నికరాదాయమే. మా ఫుడ్ ఫారెస్ట్‌లో ఇంకా బొప్పాయి, మునగ, తేనె, కంద, జామ, పనస, కరివేపాకు, తమలపాకులు, ఆకుకూరలు.. ఇంకా చాలా పంటలే చేతికి వస్తాయి. వీటి వల్ల వచ్చే ఆదాయంతో తోటకు అయ్యే ఖర్చులు వెళ్లిపోతున్నాయి. పక్షులకూ ఏడాది పొడవునా ఆహారం ఈ ఫుడ్ ఫారెస్ట్‌లో ఏడాది పొడవునా ఏ రోజైనా ఆహారం దొరుకుతుంది. ఈ ఆహారం మాకు మాత్రమే కాదు. నేలలోని సూక్ష్మజీవులు, వానపాములు, ఇతరత్రా జీవరాశి.. నేలపైన సీతాకోక చిలుకలు, పక్షులు, ఉడతలు వంటి చిరుజీవులకూ నిరంతరం ఆహార భద్రత ఉంది. పక్షుల కోసం ఒక అరటి గెల వదిలేస్తాను. 20 అడుగుల కన్నా ఎత్తు పెరిగిన బొప్పాయి చెట్ల నుంచి పండ్లు కోయకుండా పక్షులకే వదిలేస్తున్నాను. జామ కాయలను అవి నా వరకు రానివ్వడం లేదు. అయినా సంతోషమే. ప్రకృతిలో మనుషులతో పాటు అన్ని జీవులూ బతకాలి. అప్పుడే మన బతుకూ బాగుంటుంది. వేరుకుళ్లు, ఆకుమచ్చ, వెర్చిచెట్టు.. నా బాల్యంలో అరటి తోటలకు తెగుళ్లు లేవు. రసాయనిక ఎరువులు వేయడం మొదలుపెట్టిన తర్వాత వేరుకుళ్లు, ఆకుమచ్చ, బంచ్ టాప్ వైరస్(వెర్రిచెట్టు) వచ్చాయి. రసాయనాలు వాడే తోటల్లో వెయ్యి చెట్లకు 150 చెట్ల వరకు నెమటోడ్స్ వల్ల వేరుపురుగు వస్తుంది. గెల పెరగదు.ఆరేళ్ల ప్రకృతి వ్యవసాయంలో వేరుపురుగు సమస్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. 600 చెట్లకు 15 చెట్లకు మాత్రమే ఈ సమస్య ఉంది. వచ్చే ఏడాదికి వాటికీ ఉండదు. మచ్చతెగులు కాయల పెరుగుదలను నష్టపరిచే స్థితిలో లేదు. 20 రోజులకోసారి జీవామృతం పిచికారీతో కంట్రోల్ చేసేవాళ్లం. ఈ సంవత్సరం అసలు పిచికారీ చేయలేదు. వచ్చే ఏడాదికి మచ్చతెగులు పూర్తిగా పోతుంది.మల్చింగ్ వల్ల 50 రకాల ప్రయోజనాలున్నాయని పాలేకర్ మాటలు మా ఫుడ్ ఫారెస్ట్ లో నాకు కళ్లముందు కనపడుతూ ఉంటాయి. తోటలో నుంచి రాలిన ఆకులు, రెమ్మలు, అరటి బొత్తలు, కొబ్బరి పీచు.. ఏదీ బయటపడేయం. అంతా ఆచ్ఛాదనగా మళ్లీ భూమిలోనే కలిసిపోతుంది. ఆర్థిక ప్రయోజనం 10% మాత్రమే! ప్రకృతి వ్యవసాయానికి నాలుగు మూలసూత్రాలని అంటారు (బీజామృతం, జీవామృతం, తగుమాత్రంగా నీటి తేమ, ఆచ్ఛాదన). కానీ, వీటిల్లో ఆచ్ఛాదనే మిగతా వాటికన్నా ఎన్నో రెట్లు ముఖ్యమైన విషయం అని నా అనుభవంలో తెలుసుకున్నాను. మా ఫుడ్ ఫారెస్ట్‌లో ఆచ్ఛాదన బాగా ఉండబట్టే ఇంత ఎండల్లోనూ 12–15 రోజులకోసారి నీరు పెట్టినా సరిపోతున్నది. రైతులందరూ తమకున్న పొలంలో ఎంతో కొంత భాగంలోనైనా తమ ప్రాంతానికి తగిన ఫుడ్ ఫారెస్ట్ ఏర్పాటు చేసుకుంటే.. ఆదాయ, ఆహార, ఆరోగ్య భద్రత కలుగుతుంది. జీవితానికి అంతకన్నా ఇంకేమి కావాలి? మా ఫుడ్ ఫారెస్ట్ నాకు నగదు రూపంలో ఇస్తున్నది పది శాతమే. మిగతా 90 శాతాన్ని ప్రకృతి సేవల రూపంలో ఇస్తుంది. అది అమూల్యం.. లెక్కగట్టలేం..! ఫుడ్ ఫారెస్ట్‌లోని అమృతాహారం (గోగిరెడ్డి రాజేంద్రరెడ్డిని 85006 17426 నంబరులో సంప్రదించవచ్చు) -
నులి పురుగులతో నష్టం
కూరగాయలు, పండ్ల తోటలకు... సేంద్రియ పోషకాలు తగ్గితే వీటి ప్రభావం ఎక్కువ కళ్యాణదుర్గం కేవీకే కో-ఆర్డినేటర్ డాక్టర్ జాన్‌సుధీర్ అనంతపురం అగ్రికల్చర్ : కూరగాయలు, పండ్లతోటలకు నులిపురుగులతో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్ తెలిపారు. వీటిలో కొన్ని పురుగులు కనిపిస్తూ పంటలకు నష్టం కలిగిస్తుండగా మరికొన్ని కనబడకుండా పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయన్నారు. సేంద్రియ ఎరువులు వాడకపోవడం, పంట మార్పిడి చేయకపోవడం, సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వల్ల నులిపురుగుల బెడద అధికమవుతోందన్నారు. నులిçపురుగులు - నష్టాలు నేలలో ఉండే నులిపురుగులు కంటికి కనిపించనంత సన్నని దారంలా పొడవుగా ఉంటాయి. వీటి శరీరం పారదర్శకంగా(గాజును పోలి) ఉంటుంది. ప్రధానంగా చెట్ల వేర్లపై ఆధారపడి జీవిస్తాయి. తల్లి పురుగులు వేర్ల నుంచి వచ్చి ఒక్కొక్కటి 200 నుంచి 300 గుడ్లు పెడతాయి. ఆ గుడ్ల నుంచి బయటకు వచ్చే సన్నని పురుగులు వేర్లలోకి వెళ్లి లోపలి కణజాలాన్ని తింటూ అక్కడే ఉంటాయి. దీనివల్ల వేరులోని కణజాలంలో మార్పులు జరిగి కురుపులు లేదా బుడిపెలు ఏర్పడుతాయి. నీరు, ఇతర పోషకపదార్థాలు మొక్కలు గ్రహించకుండా అంతరాయం ఏర్పడుతుంది. మొక్కలు పెరగకుండా గిడసబారిపోతాయి. నులిపురుగులు ఏర్పరచిన రంధ్రాల ద్వారా ఫ్యూజిరీయం, పీథియం, రైజాక్టోనియం, ఫైట్‌ఫైరా లాంటి శిలీంధ్రాలు, సూడోమోనాస్ లాంటి బ్యాక్టీరియా క్రిములు వేర్లలోకి చేరి వేరు వ్యవస్థ కుళ్లిపోయేలా చేస్తాయి. నివారణ చర్యలు వేసవిలో రెండు నుంచి నాలుగుసార్లు లోతుగా దున్ని ఎండబెట్టడం వల్ల పొలంలోని నులిపురుగులు నశిస్తాయి. అలాగే ఎకరాకు 200 కిలోల వేపపిండి లేదా నువ్వుల పిండి లేదా ఆముదం పిండి లేదా కానుగపిండి వేయాలి. కూరగాయల పంటలపై తాకిడి ఎక్కువగా ఉన్నట్లు గమనిస్తే కణపులు ఏర్పడిన మొక్కలు పెరికి కాల్చివేయాలి. నులిపురుగులకు విరోధంగా ఉండే నువ్వులు, బంతిపూలు, ఆవాల పంటలతో పంట మార్పిడి చేయాలి. కూరగాయల పంటలతో పాటు బంతిపూలు, ఆవాలు, నువ్వుల పంటలను మిశ్రమ పంటలుగా సాగు చేస్తే నష్టం తీవ్రత తగ్గుతుంది. ఈ పురుగులు వివిధ పంటలకు నేరుగా నష్టం కలగజేయడంతోపాటు ఇతర శిలీంధ్రాలు, సూక్ష్మజీవులకు అనువైన పరిస్థితులు కల్పించి పంటను పూర్తిగా దెబ్బతీస్తాయి. కూరగాయలు, పండ్లతోటల నారు పోయక మునుపు నాలుగు నుంచి ఐదు వారాల పాటు నారుమడులను పాలిథీన్ పేపరుతో కప్పి ఉంచితే నేల ఉష్ణోగ్రత పెరిగి పురుగులు నశిస్తాయి. -
కన్నీట ముం‘చేను’...
తెలంగాణ రైతును ముంచిన వానలు.. అకాల వర్షాలతో రైతాంగానికి అపార నష్టం వరి, నువ్వులు, మొక్కజొన్న, జొన్న పంటలకు దెబ్బ.. నేలరాలిన మామిడి... పూలు, కూరగాయలకూ నష్టంమరో మూడునాలుగు రోజులపాటు వర్షాలే.. వడగళ్లు, భారీ వర్షాలకు అవకాశముందన్న వాతావరణ శాఖ అకాల వర్షాలతో రైతన్నకు అపార నష్టం వాటిల్లింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అంచనా. చేతికొచ్చే సమయానికి వరి పైరు నేలకొరిగింది. మొక్కజొన్న. నువ్వులు, జొన్న, పొద్దు తిరుగుడు, కూరగాయలు, పూలు, పండ్ల తోటలు నాశనమయ్యాయి. మామిడి రైతులకు కన్నీరే మిగిలింది. ఈదురుగాలులు, వడగళ్ల వానలు మరో మూడు నాలుగు రోజులు ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొనడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికి అందివచ్చిన జొన్న పంట నాశనమవడంతో ఆదిలాబాద్ జిల్లా కుభీర్ మండలానికి చెందిన రైతు రాథోడ్ గంగారాం చేను వద్దే పురుగుమందు తాగి మృతి చెందాడు. కాగా, ఈ రెండు రోజుల్లో పిడుగుపాటుతో ఒకరు, ఇంటి గోడకూలి మరొకరు, కరెంట్ షాక్‌తో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాల్లో అపార నష్టం ఈదురు గాలులు, అకాల వర్షాలు ఊహించని దెబ్బతీశాయి. హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో పంటలకు అపార నష్టం వాటిల్లింది. వేల ఎకరాల్లో జరిగిన నష్టం విలువ భారీగా ఉంటుంది. మరికొన్ని రోజుల్లో కోతకు రానున్న వరి పంట నేల కొరిగింది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వరి పంటకే ఎక్కువ నష్టం వాటిల్లింది. నీటిలో తడవడం వల్ల ధాన్యం రంగు మారుతుందని, పెట్టుబడులు కూడా చేతికి రావని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేక కుంగిపోతున్న అన్నదాతలకు అకాల వర్షాలు తీవ్ర చేటును తెచ్చిపెట్టాయి. చాలా ప్రాంతాల్లో మామిడి నేలరాలింది. మొక్కజొన్న కంకుల్లోకి వర్షం నీరు చేరడంతో అవి రంగుమారే ప్రమాదముంది. ఉడకపెట్టిన తర్వాత ఆరబెడుతున్న తరుణంలో కురిసిన వర్షాలతో పసుపు ఎరుపు రంగులోకి మారే ముప్పు తలెత్తింది. వీటి ధరలు పూర్తిగా పడిపోతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈదురు గాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో రవాణాకు ఇబ్బందులు తలెత్తాయి. శని, ఆదివారాల్లో ఆదిలాబాద్ జిల్లాల్లోని లక్ష్మణచాంద, లోకేశ్వరం, కుంటాల మండలాల్లో రెండు నుంచి నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట, మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలంలో అత్యధికంగా ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వారాంతం సెలవు దినాలు కావడంతో పంట నష్టంపై వ్యవసాయాధికారులు ఇంకా సమగ్ర అంచనా వేయలేదు. ఐదుగురి మృతి అకాల వర్షంతో పంట దెబ్బతినడంతో ఆదిలాబాద్ జిల్లా కుభీర్ మండలం బ్రహ్మేశ్వర్కి చెందిన రాథోడ్ గంగారాం(70) ఆది వారం ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామ శివారులోని కొండ ప్రాం తంలో మూడెకరాల్లో జొన్న వేసిన గంగారాం పోడు వ్యవసాయం చేస్తున్నాడు. శనివారం కురిసిన వర్షంతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆదివారం చేనుకు వెళ్లి మనస్తాపం చెందిన గంగారాం అక్కడే పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు భైంసా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మరోవైపు రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం కడుశలమడుగు తండాలో ఆదివారం ఉదయం ఓ మహిళ పిడుగుపాటుతో మృతి చెందింది. మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట్ మండలం హజిలాపూర్ తండాకు చెందిన సక్రిబాయి దంపతులు కడుశలమడుగు తండాకు సమీపంలోని తమ పొలంలో ఉండగా పిడుగుపాటుకు గురయ్యారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని వీరన్నగుట్టలో ఇంటి గోడ కూలడంతో ఇన్నాబాయి(60) మృతి చెందారు. కాగా, వరంగల్ నగర పరిధిలోని కరీమాబాద్ ఎస్‌ఆర్‌ఆర్‌తోట కాలనీలో ఈదురుగాలులకు విద్యుత్ తీగలు తెగి భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. కాలనీలో ఉంటున్న అంకతి రమేష్(50), రాజమణి(45) దంపతుల ఇంటి ఆవరణలో బట్టలు ఆరేసుకునే తీగలపై కరెంట్ తీగలు పడటంతో షాక్ తగిలి వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. రాజధానిలో మూడు రోజులుగా వర్షం రాజధాని హైదరాబాద్‌లో మూడు రోజులుగా జల్లులు పడుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 1.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. వరుస వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై మోకాళ్లలోతున వర్షపు నీరు నిలిచింది. కూకట్పల్లి, గుడిమల్కాపూర్, ఉప్పల్, మోతీనగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, బేగంపేట్, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ ఫీడర్లు ట్రిప్పవడంతో కొన్ని గంటలపాటు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. వచ్చే 48 గంటల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. మార్కెట్‌యార్డుల్లో తడిచిన ధాన్యం నల్లగొండ జిల్లాలో భారీ వర్షాలతో సుమారు రెండు వేల హెక్టార్లలో పంట దెబ్బతిన్నది. మార్కెట్లకు తీసుకువచ్చిన ధాన్యం నీటిపాలైంది. కట్టంగూరు మండలం అయిటిపాములలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో 6 వేల క్వింటాళ్లు, రామన్నపేట మండలంలోని ఐదు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో 12 వేల క్వింటాళ్లు, నకిరేకల్ మార్కెట్‌యార్డులో వెయ్యి బస్తాల మేర ధాన్యం తడిచింది. భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి మండలాల్లో కోతకొచ్చిన పంటలు నేలవాలాయి. సూర్యాపేట, పెన్‌పహాడ్, చివ్వెంల, ఆత్మకూర్.ఎస్ మండలాల్లో వరి పొలాలు నేలకొరిగాయి. సంస్థాన్ నారాయణపురం మండలంలో 500 హెక్టార్లలో వరి పంటకు నష్టం జరిగింది. మునుగోడులో మామిడి, నిమ్మ, కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. ఇక మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో కురిసిన వడగళ్లవానకు మామిడి కాయలు నేలరాలాయి. జిల్లావ్యాప్తంగా 24 వేల హెక్టార్లలో మామిడి సాగవగా ఇప్పటివరకు 8 వేల హెక్టార్లలో తోటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు అధికారుల ప్రాథమిక అంచనా. మరో 12 వేల హెక్టార్లలోనూ తోటలకు నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. బలమైన తేమ గాలుల వల్లే రాష్ర్టవ్యాప్తంగా మూడు నాలుగు రోజులపాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశముందని సీనియర్ శాస్త్రవేత్త సీతారాం చెప్పారు. బంగాళాఖాతం నుంచి తీవ్రమైన గాలులు వీస్తున్నందున ఈ ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. 24 గంటల్లో మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో అత్యధికంగా 7.3 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా నారాయణఖేడ్‌లో 7.2, మద్నూరులో 7.1 సెం.మీ. మేర వర్షం పడింది. అల్పపీడన ద్రోణి, బంగాళాఖాతం, అరేబియా సముద్రాలపైనుంచి వీస్తున్న బలమైన తేమగాలులే అకాల వర్షాలకు కారణమని ఆ శాఖ అధికారులు తెలిపారు. దెబ్బతీసిన ఈదురుగాలులు.. కరీంనగర్ జిల్లాలో ఈదురుగాలులు, వడగండ్ల వానతో భారీగా పంట, ఆస్తినష్టం వాటిల్లింది. దాదాపు 20 వేల హెక్టార్లలో పంట దెబ్బతిన్నది. వరి, జొన్న పంటలతో పాటు మామిడికి తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా. ఈదురుగాలులకు వేలాది చెట్లు, వందలాది హోర్డింగ్స్ నేలమట్టమయ్యాయి. కోట్లాది రూపాయల ఆస్తినష్టం వాటిల్లింది. జగిత్యాల డివిజన్ పరిధిలో వందలాది గుడిసెలు కూలిపోయాయి. మల్హర్మండలంలో మిర్చి, మొక్కజొన్న, పసుపు పంటలు తడిసిపోయాయి. నువ్వులు, సజ్జ, తదితర పంటలు నేలను తాకాయి. నిజామాబాద్ జిల్లాలో వరి పంటకు ఎక్కువ నష్టం వాటిల్లింది. దాదాపు 23 వేల ఎకరాల్లో వరి నేలకొరిగింది. బోధన్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడల్లో వడగళ్ల వాన పడింది. మామిడి, మొక్కజొన్న, పసుపు, సజ్జ, నువ్వు పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు వరంగల్ జిల్లాలో పెద్దగా పంట నష్టం లేకపోయినా నగరంలో మాత్రం ప్రజా జీవనం అస్తవ్యస్తమైంది. మిషన్ కాకతీయ పనులకు ఆటంకం ఏర్పడింది. కాగా, వ్యవసాయ శాఖ అధికారుల అంచనాల మేరకు వారం రోజుల్లో కురిసిన వర్షానికి రాష్ర్టంలో 7,317 హెక్టార్లలో ఆహార పంటలు దెబ్బతిన్నాయి. 12,216 హెక్టార్లలో మామిడి, అరటి, బొప్పాయి, కూరగాయ తోటలకు నష్టం వాటిల్లింది. ఆదిలాబాద్ జిల్లాలో తాజాగా కురిసిన వర్షాలకు కోత దశలో ఉన్న మొక్కజొన్న, జొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సారంగాపూర్, నిర్మల్, దిలావర్పూర్, లక్ష్మణచాంద, మామడ, భైంసా, తానూరు, లోకేశ్వరం, కుంటాల మండలాల పరిధిలో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చెన్నూరు, జైపూర్, కోటపల్లి తదితర మండలాల్లో మామిడి రైతులకు నష్టం జరిగింది. చేతికందిన పంటను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన రైతులు అకాలవర్షాలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కుంటా, కల్లూరు, లోకేశ్వరంలోని మార్కెట్ కేంద్రాల్లో మొక్కజొన్న తడిసి ముద్దయింది. జిల్లావ్యాప్తంగా సగటున 15.6 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. -
‘ఉద్యానం’.. బహు లాభదాయకం
నిజామాబాద్ వ్యవసాయం : పండ్ల తోటల పెంపకంపై రైతులు దృష్టి సారించాలని జిల్లా ఉద్యాన శాఖ జాయింట్ డెరైక్టర్ శామ్యూల్ సూచించారు. పండ్ల తోటల పెంపకంతో అధిక లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు. మామిడి, అరటి, బొప్పాయి వంటి తోటల పెంపకానికి ఉద్యాన శాఖ ప్రోత్సాహకాలు అందిస్తోందని తెలిపారు. వీటిని ఉపయోగించుకొని లబ్ధిపొందాలని సూచించారు. ఉద్యాన పంటల అభివృద్ధి పథకాల గురించి ఆయన వివరిం చారు. తోటల పెంపకంపై ఆసక్తిగల రైతులు ఉద్యాన అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మామిడి మొక్కలు, జీవ, రసాయన ఎరువులు, పురుగు మందుల ఖర్చులో 40 శాతం రాయితీ ఇస్తోంది. మూడేళ్లలో అయ్యే ఖర్చులో 40 శాతం రాయితీ రూ. 6,560కి(ఎకరానికి) మించకుండా లభిస్తుంది. ఒక రైతు పది ఎకరాల వరకు రాయితీకి అర్హుడు. రైతులు తోటకు ఉపయోగించిన మందులు తదితర వివరాలతో ఉద్యాన శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే రాయితీ మొత్తాన్ని ఆ రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. అరటి అరటి సాగుకు సైతం 40 శాతం రాయితీ లభిస్తుంది. ఎకరం విస్తీర్ణంలో మొక్కలు, జీవ, రసాయన ఎరువులు, పురుగు మందులకు రెండేళ్లలో అయ్యే ఖర్చులో 40 శాతం(రూ. 16,394 మించకుండా) రాయితీ మొత్తాన్ని సదరు రైతు ఖాతాలో జమ చేస్తారు. బొప్పాయి బొప్పాయికి 40 శాతం (గరిష్టంగా రూ. 9,865) రాయితీ లభిస్తుంది. ఒక రైతు పది ఎకరాల వరకు రాయితీ పొందడానికి అర్హుడు. మామిడి తోటల పునరుద్ధరణ రోగాల బారిన పడిన లేదా కాతకాయనటువంటి పాత మామిడి తోటలను పునరుద్ధరించడానికి సైతం ఉద్యాన శాఖ ప్రోత్సాహకాలు అందిస్తోంది. మొక్కలు, ఎరువులు, పురుగు మందులు, పరికరాల కొనుగోలుకు అయ్యే ఖర్చు లో 50 శాతం (ఎకరానికి రూ. 6 వేలు) రాయితీ ఇస్తారు. బంతిపూలు సాగుకు అయ్యే ఖర్చులో 40 శాతం రాయితీ (గరిష్టంగా ఎకరానికి రూ.4 వేలు) ఇస్తారు.