ఆరేళ్లుగా తాను అపురూపంగా పెంచుకుంటున్న ఫుడ్ ఫారెస్ట్ గురించి వివరిస్తున్న రాజేంద్రరెడ్డి
ప్రకృతి వ్యవసాయోద్యమకారులు మసనొబు ఫుకుఒకా, సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో స్ఫూర్తి పొందిన గోగిరెడ్డి రాజేంద్రరెడ్డి అనే రైతు తనకున్న ఎకరం 30 సెంట్ల పొలంలో ఆహార అరణ్యాన్ని సృష్టించారు. గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరు గ్రామంలో రోడ్డు పక్కనే ఈ ఫుడ్ ఫారెస్ట్ పచ్చగా అలరారుతోంది. ఏఎంఐఈ చదువుకున్న రాజేంద్రరెడ్డి వ్యవసాయం చేస్తూ హైదరాబాద్‌లో సివిల్ కాంట్రాక్టులు చేస్తుండేవారు.
1.3 ఎకరాల నల్ల రేగడి భూమి. 30 అడుగుల్లో నీరు. పక్కనే పంట కాలువ. 2011–12 వరకు రసాయనిక వ్యవసాయ పద్ధతిలో అరటి తోట సాగు చేసేవారు. ఫుకుఒకా రచన ‘గడ్డి పరకతో విప్లవం’ చదివి ప్రకృతి వ్యవసాయం వైపు ఆకర్షితుడైన రాజేంద్రరెడ్డి.. హైదరాబాద్(2012)లో పాలేకర్ శిబిరంలో శిక్షణ పొంది ఐదంచెల పండ్ల తోటల నమూనాకు ఫిక్సయ్యారు. అలా ప్రారంభమైన ఫుడ్ ఫారెస్ట్ ఇప్పుడు ఏడాది పొడవునా ఆహార, ఆదాయ భద్రతను అందించే స్థాయికి ఎదిగింది. రాజేంద్రరెడ్డి మాటల్లోనే ఆయన అనుభవాలు..
కర్పూర అరటి, కొబ్బరితోనే రూ. 5 లక్షలు
రసాయనిక ఎరువులు పురుగుమందులు ఆపేయగానే తెగుళ్లు ఆగిపోయి.. పంట ఆరోగ్యంగా కనిపించింది. అరటి గెల సైజు మొదటి రెండేళ్లు తగ్గింది. ఆచ్ఛాదన సరిగ్గా వేసిన తర్వాత గెల సైజు క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు పొలమంతా చెట్లు, చెట్ల మధ్యలో ఆచ్ఛాదనతో నిండి ఉంటుంది. బయటకన్నా 4–5 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. భూమిలో జీవనద్రవ్యం(హ్యూమస్) ఏర్పడడానికి కావాల్సిన సూక్ష్మవాతావరణం ఏడాది పొడవునా మా ఫుడ్ ఫారెస్ట్‌లో నెలకొని ఉంటుంది. మామూలు పొలాల్లో మాదిరిగా సేంద్రియ కర్బనం ఆవిరి కాదు. ఇదే పంటల ఉత్పాదకతను పెంచింది.
అరటి గెలకు సగటున రూ. వెయ్యి ఆదాయం
ఆరేళ్లు గడిచిన తర్వాత.. ఆదాయం ప్రధానంగా 600 కర్పూర అరటి చెట్లు, 40 కొబ్బరి చెట్ల ద్వారానే సమకూరుతోంది. తాజాగా ఒక గెల 16 అస్తాలతో 46 కిలోలు తూగింది. నికరంగా 40 కిలోల అరటి పండ్లు వచ్చాయి. పండ్లను నేనే స్వయంగా గుంటూరులో ఇళ్లకు తీసుకెళ్లి కిలో రూ.50కి అందిస్తున్నాను. సుడిగాలులకు కొన్ని చెట్లు పడిపోయినా.. సగటున ఏడాదికి నికరంగా 400 అరటి గెలలు వస్తాయి. సగటున గెలకు 20 కిలోల పండ్లు అనుకుంటే.. గెలకు రూ. వెయ్యికి తగ్గకుండా ఏటా రూ. 4 లక్షల ఆదాయం వస్తున్నది.
కొబ్బరి కాయల ద్వారా రూ. లక్ష
23 ఏళ్ల నాటి కొబ్బరి చెట్లు 40 ఉన్నాయి. అధిక వర్షాలు, వడగాలులు ఎట్లా ఉన్నా ఏడాదికి చెట్టుకు కనీసం 150–200 కొబ్బరి కాయలు ఖాయంగా వస్తున్నాయి. 6 వేల కాయలను రూ. 15–20కి రిటైల్‌గా అమ్ముతున్నాను. గ్యారంటీగా రూ. లక్ష వస్తుంది. అరటి, కొబ్బరి ద్వారా ఏటా రూ. 5 లక్షల ఆదాయం వస్తున్నది. ఇది నికరాదాయమే. మా ఫుడ్ ఫారెస్ట్‌లో ఇంకా బొప్పాయి, మునగ, తేనె, కంద, జామ, పనస, కరివేపాకు, తమలపాకులు, ఆకుకూరలు.. ఇంకా చాలా పంటలే చేతికి వస్తాయి. వీటి వల్ల వచ్చే ఆదాయంతో తోటకు అయ్యే ఖర్చులు వెళ్లిపోతున్నాయి.
పక్షులకూ ఏడాది పొడవునా ఆహారం
ఈ ఫుడ్ ఫారెస్ట్‌లో ఏడాది పొడవునా ఏ రోజైనా ఆహారం దొరుకుతుంది. ఈ ఆహారం మాకు మాత్రమే కాదు. నేలలోని సూక్ష్మజీవులు, వానపాములు, ఇతరత్రా జీవరాశి.. నేలపైన సీతాకోక చిలుకలు, పక్షులు, ఉడతలు వంటి చిరుజీవులకూ నిరంతరం ఆహార భద్రత ఉంది. పక్షుల కోసం ఒక అరటి గెల వదిలేస్తాను. 20 అడుగుల కన్నా ఎత్తు పెరిగిన బొప్పాయి చెట్ల నుంచి పండ్లు కోయకుండా పక్షులకే వదిలేస్తున్నాను. జామ కాయలను అవి నా వరకు రానివ్వడం లేదు. అయినా సంతోషమే. ప్రకృతిలో మనుషులతో పాటు అన్ని జీవులూ బతకాలి. అప్పుడే మన బతుకూ బాగుంటుంది.
వేరుకుళ్లు, ఆకుమచ్చ, వెర్చిచెట్టు..
నా బాల్యంలో అరటి తోటలకు తెగుళ్లు లేవు. రసాయనిక ఎరువులు వేయడం మొదలుపెట్టిన తర్వాత వేరుకుళ్లు, ఆకుమచ్చ, బంచ్ టాప్ వైరస్(వెర్రిచెట్టు) వచ్చాయి. రసాయనాలు వాడే తోటల్లో వెయ్యి చెట్లకు 150 చెట్ల వరకు నెమటోడ్స్ వల్ల వేరుపురుగు వస్తుంది. గెల పెరగదు.ఆరేళ్ల ప్రకృతి వ్యవసాయంలో వేరుపురుగు సమస్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. 600 చెట్లకు 15 చెట్లకు మాత్రమే ఈ సమస్య ఉంది.
వచ్చే ఏడాదికి వాటికీ ఉండదు. మచ్చతెగులు కాయల పెరుగుదలను నష్టపరిచే స్థితిలో లేదు. 20 రోజులకోసారి జీవామృతం పిచికారీతో కంట్రోల్ చేసేవాళ్లం. ఈ సంవత్సరం అసలు పిచికారీ చేయలేదు. వచ్చే ఏడాదికి మచ్చతెగులు పూర్తిగా పోతుంది.మల్చింగ్ వల్ల 50 రకాల ప్రయోజనాలున్నాయని పాలేకర్ మాటలు మా ఫుడ్ ఫారెస్ట్ లో నాకు కళ్లముందు కనపడుతూ ఉంటాయి. తోటలో నుంచి రాలిన ఆకులు, రెమ్మలు, అరటి బొత్తలు, కొబ్బరి పీచు.. ఏదీ బయటపడేయం. అంతా ఆచ్ఛాదనగా మళ్లీ భూమిలోనే కలిసిపోతుంది.
ఆర్థిక ప్రయోజనం 10% మాత్రమే!
ప్రకృతి వ్యవసాయానికి నాలుగు మూలసూత్రాలని అంటారు (బీజామృతం, జీవామృతం, తగుమాత్రంగా నీటి తేమ, ఆచ్ఛాదన). కానీ, వీటిల్లో ఆచ్ఛాదనే మిగతా వాటికన్నా ఎన్నో రెట్లు ముఖ్యమైన విషయం అని నా అనుభవంలో తెలుసుకున్నాను. మా ఫుడ్ ఫారెస్ట్‌లో ఆచ్ఛాదన బాగా ఉండబట్టే ఇంత ఎండల్లోనూ 12–15 రోజులకోసారి నీరు పెట్టినా సరిపోతున్నది. రైతులందరూ తమకున్న పొలంలో ఎంతో కొంత భాగంలోనైనా తమ ప్రాంతానికి తగిన ఫుడ్ ఫారెస్ట్ ఏర్పాటు చేసుకుంటే.. ఆదాయ, ఆహార, ఆరోగ్య భద్రత కలుగుతుంది. జీవితానికి అంతకన్నా ఇంకేమి కావాలి? మా ఫుడ్ ఫారెస్ట్ నాకు నగదు రూపంలో ఇస్తున్నది పది శాతమే. మిగతా 90 శాతాన్ని ప్రకృతి సేవల రూపంలో ఇస్తుంది. అది అమూల్యం.. లెక్కగట్టలేం..!
ఫుడ్ ఫారెస్ట్‌లోని అమృతాహారం
(గోగిరెడ్డి రాజేంద్రరెడ్డిని 85006 17426 నంబరులో సంప్రదించవచ్చు)
Comments
Please login to add a commentAdd a comment