నులి పురుగులతో నష్టం | Nematodes insects damage | Sakshi
Sakshi News home page

నులి పురుగులతో నష్టం

Published Thu, Dec 8 2016 10:37 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

నులి పురుగులతో నష్టం - Sakshi

నులి పురుగులతో నష్టం

  • కూరగాయలు, పండ్ల తోటలకు...
  •  సేంద్రియ పోషకాలు తగ్గితే వీటి ప్రభావం ఎక్కువ
  • కళ్యాణదుర్గం కేవీకే కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ జాన్‌సుధీర్‌
  • అనంతపురం అగ్రికల్చర్‌ :

    కూరగాయలు, పండ్లతోటలకు నులిపురుగులతో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.జాన్‌సుధీర్‌ తెలిపారు. వీటిలో కొన్ని పురుగులు కనిపిస్తూ పంటలకు నష్టం కలిగిస్తుండగా మరికొన్ని కనబడకుండా పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయన్నారు. సేంద్రియ ఎరువులు వాడకపోవడం, పంట మార్పిడి చేయకపోవడం, సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వల్ల నులిపురుగుల బెడద అధికమవుతోందన్నారు.

     

    నులిçపురుగులు - నష్టాలు

    నేలలో ఉండే నులిపురుగులు కంటికి కనిపించనంత సన్నని దారంలా పొడవుగా ఉంటాయి. వీటి శరీరం పారదర్శకంగా(గాజును పోలి) ఉంటుంది. ప్రధానంగా చెట్ల వేర్లపై ఆధారపడి జీవిస్తాయి. తల్లి పురుగులు వేర్ల నుంచి వచ్చి ఒక్కొక్కటి 200 నుంచి 300 గుడ్లు పెడతాయి. ఆ గుడ్ల నుంచి బయటకు వచ్చే సన్నని పురుగులు వేర్లలోకి వెళ్లి లోపలి కణజాలాన్ని తింటూ అక్కడే ఉంటాయి. దీనివల్ల వేరులోని కణజాలంలో మార్పులు జరిగి కురుపులు లేదా బుడిపెలు ఏర్పడుతాయి. నీరు, ఇతర పోషకపదార్థాలు మొక్కలు గ్రహించకుండా అంతరాయం ఏర్పడుతుంది. మొక్కలు పెరగకుండా గిడసబారిపోతాయి. నులిపురుగులు ఏర్పరచిన రంధ్రాల ద్వారా ఫ్యూజిరీయం, పీథియం, రైజాక్టోనియం, ఫైట్‌ఫైరా లాంటి శిలీంధ్రాలు, సూడోమోనాస్‌ లాంటి బ్యాక్టీరియా క్రిములు వేర్లలోకి చేరి వేరు వ్యవస్థ కుళ్లిపోయేలా చేస్తాయి.

    నివారణ చర్యలు

    వేసవిలో రెండు నుంచి నాలుగుసార్లు లోతుగా దున్ని ఎండబెట్టడం వల్ల పొలంలోని నులిపురుగులు నశిస్తాయి. అలాగే ఎకరాకు 200 కిలోల వేపపిండి లేదా నువ్వుల పిండి లేదా ఆముదం పిండి లేదా కానుగపిండి వేయాలి. కూరగాయల పంటలపై తాకిడి ఎక్కువగా ఉన్నట్లు గమనిస్తే కణపులు ఏర్పడిన మొక్కలు పెరికి కాల్చివేయాలి. నులిపురుగులకు విరోధంగా ఉండే నువ్వులు, బంతిపూలు, ఆవాల పంటలతో పంట మార్పిడి చేయాలి. కూరగాయల పంటలతో పాటు బంతిపూలు, ఆవాలు, నువ్వుల పంటలను మిశ్రమ పంటలుగా సాగు చేస్తే నష్టం తీవ్రత తగ్గుతుంది. ఈ పురుగులు వివిధ పంటలకు నేరుగా నష్టం కలగజేయడంతోపాటు ఇతర శిలీంధ్రాలు, సూక్ష్మజీవులకు అనువైన పరిస్థితులు కల్పించి పంటను పూర్తిగా దెబ్బతీస్తాయి. కూరగాయలు, పండ్లతోటల నారు పోయక మునుపు నాలుగు నుంచి ఐదు వారాల పాటు నారుమడులను పాలిథీన్‌ పేపరుతో కప్పి ఉంచితే నేల ఉష్ణోగ్రత పెరిగి పురుగులు నశిస్తాయి.

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement