ముంచుకొస్తున్న ముప్పు
కడప ఎడ్యుకేషన్: తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దీంతో మంచినీటి ఎద్దడి రోజురోజుకు ముంచుకొస్తోంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 80 అడుగుల మేర భూగర్భ జలాలు పడిపోయాయి. దీనికి తోడు ఈ ఏడాది జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా కరువు తాండవం చేయనుంది.
సాధారణ వర్ష పాతం 644 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా ఇప్పటి వరకూ 322.7 మిల్లీ మీటర్లు వర్షం మాత్రమే కురిసింది. సాధారణం కంటే 50 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో రాయచోటి, సుండుపల్లి, గాలివీడు, పులివెందుల, లింగాల మండలాల్లో చాలా మేర పంటలు ఎండుముఖం పట్టాయి. అక్కడ జనం మంచి నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ట్యాంకులతో మంచి నీరు సరఫరా :
జనవరిలోనే పరిస్థితి ఇలా ఉంటే మార్చి, ఏప్రిల్ నెలల్లో పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందోనని గ్రామీణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని రాయచోటి, రాజంపేట, కోడూరు, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాలలోని పలు గ్రామాలకు ట్యాంకుల ద్వారా ఆర్‌డ బ్ల్యూఎస్ అధికారులు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఇందులో రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలంలో 16 గ్రామాలకు 19 ట్రిప్పులతో 32 ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకుని మంచినీటిని సరఫరా చేస్తున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు.
అలాగే లక్కిరెడ్డిపల్లె మండలంలో 11 గ్రామాలకు 13 ట్రిప్పులతో 11 ప్రైవేటు బోర్లను, రామాపురం మండలంలో 12 గ్రామాలకు 23 ట్రిప్పులతో 7 ప్రైవేటు బోర్లను, రాయచోటి మండలంలో 21 గ్రామాలకు 24 ట్రిప్పులతో 18 ప్రైవేటు బోర్లను, సంబేపల్లి మండలంలో 6 గ్రామాలకు 8 ట్రిప్పులతో 8 ప్రైవేటు బోర్లను, చిన్నమండెం మండలంలో 17 గ్రామాలకు 16 ట్రిప్పులతో 4 ప్రైవేటు బోర్లను ఏర్పాటు చేసి మంచినీటిని సరఫరా చేస్తున్నారు.
అలాగే రాజంపేట మండలంలో 69 గ్రామాలకు 134 ట్రిప్పులతో, 21 ప్రైవేటు బోర్లతో, కోడూరు మండలంలో 17 గ్రామాలకు 33 ట్రిప్పులను, కమలాపురం మండలంలో 8 గ్రామాలకు 16 ట్రిప్పులతోపాటు 4 ప్రైవేటు బోర్లతో, పులివెందుల మండలంలో 12 గ్రామాలకు 58 ట్రిప్పులతోపాటు 5 ప్రైవేటు బోర్లతో మంచినీటిని సరఫరా చేస్తున్నారు.
రూ.14 కోట్ల 40 లక్షలతో ప్రణాళిక సిద్ధం:
జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో మంచినీటి ఎద్దడి నివారణ కోసం రూ.14కోట్ల 40 లక్షలతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు నివేదికలు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఇందులో జిల్లా వ్యాప్తంగా 4031 గ్రామాలకు గాను 608 గ్రామాలకు మంచినీటిని ట్యాంకుల ద్వారా సరఫరా చేసేందుకు రూ.10 కోట్ల 41 లక్షలతో, 605 గ్రామాల్లో 605 ప్రైవేటు బోర్లను అద్దెకు తీసుకునేందుకు రూ.కోటి 81 లక్షలతో, 255 బోర్లలో పూడికను తీసేందుకు రూ.కోటి రెండు లక్షలను, ప్రస్తుతం ఉన్న 127 బోర్లను మరింత లోతుగా వేసేందుకు రూ.కోటి 14 లక్షలతో నివేదికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. ఈ నిధులను ప్రభుత్వం త్వరితగతిన విడుదల చేస్తే మంచినీటి సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
అడుగంటిన భూగర్భ జలాల వివరాలు
మండలం లోతులో
ఉన్న నీరు
పులివెందుల 95 మీటర్లు
వీరపునాయునిపల్లె 80 మీటర్లు
చిట్వేలి 73 మీటర్లు
లింగాల 70 మీటర్లు
అట్లూరు 65 మీటర్లు
పెండ్లిమర్రి 62 మీటర్లు
కలసపాడు 60 మీటర్లు
చింతకొమ్మదిన్నె 50 మీటర్లు
కోడూరు 47 మీటర్లు