నెలన్నర ఆలస్యంగా ఖరీఫ్ సాగు
•అక్టోబర్ వరకు వర్షాలు కురిస్తేనే పంటలు చేతికి
•వరుణుడిపైనే భారం వేసిన రైతులు
దౌల్తాబాద్: మండలంలో వర్షాధారంగా సాగు నెలన్నర ఆలస్యంగా మొదలైంది. సాధారణంగా జూన్ మొదటి వారంలో వర్షాలు పడి పత్తి, మొక్కజొన్న తదితర విత్తనాలను వేస్తారు. కానీ ఈసారి తీవ్ర వర్షాభావం కారణంగా సకాలంలో విత్తనాలు పడలేదు. జూలై మూడవ వారంలో మాత్రమే కురిసిన కొద్దిపాటి వర్షాలకు రైతులు విత్తనాలు వేశారు. జూలై నెలలో సాధారణ వర్షపాతం 234 మిల్లీమీటర్లు కాగా మూడు వారాలు ముగి సినా కేవలం 55 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. అదికూడా మండలంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పడింది.
ఈ వర్షాలకు వేసిన పత్తి, మొక్కజొన్న విత్తనాలు ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్నాయి. రెండుమూడేళ్ళుగా సకాలంలో వేసిన పంటలు కాతపూత దశలో వర్షాభావం కారణంగా కొంతవరకు దెబ్బతిన్నాయి. ప్రస్థుతం నెలన్నర ఆలస్యంగా వేసిన విత్తనాలు మొలిచి పంటపండాలంటే కాతపూత దశలో వర్షాలు కురువాల్సిందే. కనీసం అక్టోబర్ నెలాఖరు వరకు వర్షాలు పడితేనే ఈ పంటలు గట్టెక్కుతాయి. అయినప్పటికీ రైతులు వరుణు దేవునిపై భారం వేసి విత్తనాలు వేస్తున్నారు. ఇప్పటికే కొందరు రైతులు సరిగ్గా మొలకెత్తకపోవడంతో రెండు మూడు సార్లు విత్తనాలు వేశారు. దీంతో పెట్టుబడి వ్యయం తడిసి మోపెడవుతున్నది. ఇక ముందైనా సరైన వర్షాలు కురవకపోతే రైతులు తీవ్ర అప్పుల ఊబిలోకి కూరుకుపోయే ప్రమాదం పొంచివున్నది.