మచిలీపట్నం : అక్కరకు రాని వర్షాలు లెక్కలోకి తీసుకున్న ప్రభుత్వం కరువు మండలాల ప్రకటనలో వివక్ష చూపించింది. జూన్ మొదట్లో కురిసిన వర్షాలు ఖరీఫ్ సాగుకు ఏమాత్రం ఉపయోగపడకపోయినా.. వాటినీ ప్రాతిపదికగా తీసుకోవటంపై అన్నదాతలు పెదవి విరుస్తున్నారు. దీనివల్ల పంటలకు నష్టపరిహారం మంజూరుకాక నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మూడేళ్లుగా అందని పరిహారం...
కరువు ప్రాంతాలుగా గుర్తించిన మండలాల్లో రైతులు తీసుకున్న రుణాలు రీషెడ్యూలు చేసి కేంద్ర ప్రభుత్వం ఆయా పంటలకు నష్టపరిహారాన్ని అందించాలి. కరువు మండలాల్లో ఎకరం వరికి రూ.6 వేలు చొప్పున పంట నష్టపరిహారంగా చెల్లించాలి. పంట నష్టం జరిగినట్లు లేదా కరువు మండలాలుగా ప్రకటించినప్పుడు రికార్డులు రాయడమే తప్ప పరిహారం సకాలంలో అందించిన దాఖలాలు లేవు. మూడేళ్లుగా ఈ పరిస్థితి ఉన్న నేపథ్యంలో మళ్లీ కరువు మండలాల ప్రకటన వెలువడింది. మునుపెన్నడూ లేని విధంగా జిల్లాలో కరువు ఛాయలు అలముకున్నాయి. ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు కురవక రైతులు ఇక్కట్లపాలయ్యారు. అష్టకష్టాలు పడి సాగుచేసిన పైరును కాపాడుకుంటే పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షం కురిసి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అనావృష్టి, అతివృష్టి కారణంగా రైతులు నష్టపోయారు. ఈ తరుణంలో ఈ నెల 21న ప్రభుత్వం జిల్లాలో 14 కరువు మండలాలను గుర్తిస్తూ జీవో నంబరు ఒకటిని జారీ చేసింది. వర్షాభావం తదితర కారణాలతో ఖరీఫ్‌లో పంటలు సాగు చేసుకోలేని రైతులకు, చేసినప్పటికీ నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం సకాలంలో ఇస్తే రబీ సీజన్‌లో పంటలు వేసుకునేందుకు కొంతమేర ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. అయితే ఈ పరిహారం ఎప్పటిలోగా అందిస్తారనేది ప్రశ్నార్థకమే.
ప్రకటించింది పద్నాలుగే...
జిల్లాలో 14 ప్రాంతాలను కరువు మండలాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఈ నెల 21న ఉత్తర్వులు జారీ చేసింది. పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, నందివాడ, చందర్లపాడు, జగ్గయ్యపేట, వత్సవాయి, నూజివీడు, బాపులపాడు, గన్నవరం, విస్సన్నపేట, తిరువూరు, ఎ.కొండూరు, గంపలగూడెంలను కరువు మండలాలుగా ప్రకటించారు. వర్షపాతం తక్కువగా నమోదైనప్పటికీ ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, కంకిపాడు, ఆగిరిపల్లి, పమిడిముక్కలలను కరువు మండలాలుగా ప్రకటించలేదు. ఈ విషయంపై వ్యవసాయాధికారులను ప్రశ్నించగా.. వర్షాభావం ఒక్కటే కాదని, పంటలు సాగు చేసిన విస్తీర్ణం, ఆ పంటల పరిస్థితి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని కరువు మండలాలను ప్రకటిస్తారని చెప్పారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షం నమోదైంది. దీంతో చేతికొచ్చే దశలో ఉన్న వరి నేలవాలి నీటిలో మునిగిపోయింది. రైతులు నష్టాలపాలయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఈ ప్రభావం ఉండగా కేవలం 14 కరువు మండలాలను ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు నష్టపోయిన రైతులకు అందని పరిస్థితి నెలకొంది. పంటలు కోల్పోయిన రైతులను ఆదుకునేందుకు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కరువు మండలాల జాబితాను రూపొందించాలనే వాదన రైతుల నుంచి వినిపిస్తోంది.
అక్కరకు రాని వర్షాలు లెక్కలోకా?
Published Wed, Nov 25 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 12:57 PM
Advertisement
Advertisement