సాక్షి, అమరావతి: మూడు వారాలుగా కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ సాగు కాస్త ఊపందుకుంది. జూన్‌లో రుతుపవనాలు మొహం చాటేయడం.. ఆగస్టులో వర్షాల జాడే లేక కలవరపాటుకు గురైన రైతులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాల పుణ్యమాని ఊపిరి పీల్చుకుంటున్నారు. లోటు వర్షపాతం భర్తీ కావడంతో వేసిన పంటలను కాపాడుకోవడంతోపాటు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కింద 80 శాతం సబ్సిడీపై ఇస్తున్న విత్తనాలతో అవకాశం ఉన్నంత మేర పంటలను సాగు చేస్తున్నారు.
ఫలితంగా 58 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు పూర్తయింది. సీజన్ ముగిసే నాటికి కనీసం 65 లక్షల నుంచి 70 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో 26 జిల్లాలకు గాను 18 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా.. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో మాత్రం స్వల్పంగా లోటు వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఆ జిల్లాల్లో కూడా నెలాఖరు నాటికి లోటు వర్షపాతం భర్తీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
31 లక్షల ఎకరాలు దాటిన వరి నాట్లు
వరి సాధారణ విస్తీర్ణం 38.80 ఎకరాలు కాగా.. ఇప్పటికే 30.75 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. అపరాలు సాధారణ విస్తీర్ణం 7.87 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 4.20 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. వీటిలో ప్రధానంగా 3.60 లక్షల ఎకరాల్లో కందులు, 40 వేల ఎకరాల్లో మినుములు సాగవుతున్నాయి. నూనెగింజల సాగు విస్తీర్ణం 17.40 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటికే 8.80 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. వీటిలో ప్రధానంగా 7.35 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 97వేల ఎకరాల్లో ఆముదం పంటలు సాగయ్యాయి.
ఇతర పంటల విషయానికి వస్తే 10 లక్షల ఎకరాల్లో పత్తి, 2.50 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 95 వేల ఎకరాల్లో చెరకు ఇతర పంటలు సాగవుతున్నాయి. గతేడాది సాగు విస్తీర్ణంతో పోల్చుకుంటే ఈసారి వేరుశనగ, పత్తి తగ్గాయి. వరి సహా ఇతర పంటలు సాధారణ విస్తీర్ణంలోనే సాగవుతుండగా.. ఆముదం, సోయాబీన్, చిరుధాన్యాల సాగు కాస్త పెరిగింది.
పరిస్థితిని ముందుగా అంచనా వేసిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలు చేసింది. తొలుత 5.15 లక్షల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేసిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కింద 80 శాతం సబ్సిడీపై మరో 77,880 క్వింటాళ్ల విత్తనాన్ని పంపిణీకి సిద్ధం చేసింది. రైతులు 7,521 క్వింటాళ్ల విత్తనాన్ని ఇప్పటికే రైతులు తీసుకున్నారు.
లక్ష్యం దిశగా సాగు
సెప్టెంబర్‌లో కురుస్తున్న వర్షాలతో లోటు వర్షపాతం భర్తీ అయి సాధారణ స్థాయికి చేరుకుంది. 3 వారాల్లో 15 లక్షల ఎకరాలకు పైగా సాగులోకి వచ్చాయి. సీజన్ ముగిసే నాటికి కనీసం మరో 5 నుంచి 8 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కింద ఆర్బీకేల్లో 80 శాతం సబ్సిడీపై విత్తనాలు సమృద్ధిగా ఉన్నాయి. 8 లక్షల టన్నులకు పైగా ఎరువులు అందుబాటులో ఉన్నాయి. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ
Comments
Please login to add a commentAdd a comment