అక్కడక్కడ భారీ వర్షాలు
ఉత్తర కోస్తాకు విస్తరిస్తున్న రుతుపవనాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వర్షాలు కురవడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఇప్పటికే కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజులు మరింత విస్తారంగా కురవనున్నాయి. ప్రస్తుతం రాయలసీ మ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది.
మరోవైపు నైరుతి రుతుపవనాలు ఉత్తర కోస్తాంధ్ర వ్యాప్తంగా మరింతగా విస్తరించనున్నాయి. వీటి ఫలితంగా ఆదివారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సోమ, మంగళవారాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వర్షాలతో పాటు అక్కడక్కడ పిడుగులు పడతాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించింది.
శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్రంలో అత్యధికంగా విశాఖ జిల్లా గాజువాకలో 10.5 సెంటీమీటర్లు, పి.లింగవలస (విజయనగరం)లో 7.8, శంఖవరం (కాకినాడ)లో 5.1, చోడవరం (అనకాపల్లి)లో 3.7, గూడవల్లి (బాపట్ల)లో 2.4, రామచంద్రాపురం (కోనసీమ)లో 2.3, పట్టిసీమ (ఏలూరు)లో 2.1, పైడి భీమవరం (శ్రీకాకుళం)లో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ బులెటిన్‌లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment