రేపు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు
గంటకు 30–40 కి.మీల వేగంతో గాలులు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనాలు దీనికి దోహదపడుతున్నాయి. ప్రస్తుతం రుతుపవనాలు కోస్తాంధ్రలో నెమ్మదిగా కదులుతున్నాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో ఇవి మరిన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అదే సమయంలో రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఒకటి, కోస్తా కర్ణాటక ప్రాంతంలో మరొక ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నాయి.
వీటి ఫలితంగా గురువారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
శనివారం విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, శ్రీకాకుళం, అల్లూరి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని వివరించింది. అదే సమయంలో గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురుగా గాలులు వీస్తాయని, కొన్నిచోట్ల పిడుగులు పడే వీలుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment