Famine zones
-
బోరుమన్న బోరబండ
సాక్షి,గజ్వేల్: రెండున్నర దశాబ్ధాల కిందట తక్కువ ఖర్చుతో అద్భుతంగా నిర్మించిన బహుళ ప్రయోజన రిజర్వాయర్ ‘బోరబండ’పై నిర్లక్ష్యం అలుముకుంది. సాగునీటి కొరతతో తల్లడిల్లుతున్న రైతాంగానికి ఊరటనివ్వాల్సిన ఈ జలాశయం నీరులేక వెలవెలబోతోంది. నిర్మాణం పూర్తయి 29 ఏళ్లు గడుస్తున్నా నీరందించాల్సిన కాల్వలు ప్రవాహానికి నోచుకోవడం లేదు... జలాశయం నిండితే మరెన్నో చెరువులకు నీటిని పంపే అవకాశమున్నా ఆ దిశగా సంబంధిత యంత్రాంగం చొరవ చూపడంలేదు. మిషన్ కాకతీయ 2వ విడతలో రూ. 20లక్షలు మంజూరు చేసి నామమాత్రంగా కొన్ని పనులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. జగదేవ్‌పూర్ మండలంలోని పీర్లపల్లి–ధర్మారం గ్రామాల మధ్య 1990లో రూ.56 లక్షల వ్యయంతో బోరబండ రిజర్వాయర్‌ను నిర్మించారు. 115 ఎకరాల విస్తీర్ణంలో 36.80 మిలియన్ ఘనపుటడుగుల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ జలాశయం నిర్మాణమైంది. క్షామంతో తల్లడిల్లుతున్న జగదేవ్‌పూర్ మండలంలోని వివిధ గ్రామాలకు ఆరుతడి పంటలకు కాల్వల ద్వారా సాగునీటిని అందించడంతో పాటు గజ్వేల్ నియోజకవర్గంలో భూగర్భజలాల పెంపొందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. సాగునీటిని పొలాలకు అందించడం కోసం 2.6 కిలోమీటర్ల పొడవున కుడి, 1.94 కిలోమీటర్ల పొడవునా ఎడమ కాల్వల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రాజెక్టు పరిధిలో 832 ఎకరాల ఆయకట్టు భూములున్నాయి. కుడికాల్వ ద్వారా ధర్మారం, వర్దరాజ్‌పూర్, ఇటిక్యాల,కొత్తపేట, పీర్లపల్లి గ్రామాల్లోని 568 ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందించడానికి, ఎడమ కాల్వ ద్వారా ధర్మారం, పీర్లపల్లిలోని మరికొంత భాగంలో వున్న 264 ఎకరాల ఆరుతడి పంటలకు సాగునీరు అందించడానికి ఏర్పాటు చేశారు. కానీ రిజర్వాయర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కాల్వలు ప్రవాహానికి నోచుకోలేదు. ఫలితంగా ఆయకట్టు భూముల రైతులకు నిరాశే మిగిలింది. వర్షాల వల్ల ప్రాజెక్టు నిండుతున్న సందర్భంలోనూ కాల్వల ద్వారా నీరందించేందుకు తూములను ఎత్తకపోవడంతో ప్రాజెక్టు వల్ల ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరలేదనే చెప్పాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి ప్రాజెక్ట్ నిర్మించాలంటే సుమారు రూ. 50కోట్లకుపైగానే ఖర్చవుతుందని చెబుతున్న ఇరిగేషన్ శాఖ అధికారులు 29 ఏళ్ల కిందట తక్కువ ఖర్చుతో అద్భుతంగా నిర్మించిన రిజర్వాయర్ అభివద్ధిపై నిర్లక్ష్యం వహించడంపై నిరసన వ్యక్తమవుతున్నది. అరకొరగా అభివృద్ధి పనులు సామూహిక చెరువుల యాజమాన్య పథకం కింద ‘బోరబండ’ రిజర్వాయర్ అభివద్ధికి 2008లో రూ. 84లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులను విడుదల చేయించుకోవడానికి ప్రణాళికలు తయారు చేసి సాంకేతిక అనుమతి పొందాల్సి ఉండగా దానిని పూర్తిచేయడంలో అధికారులు ఏళ్ల తరబడి నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఎన్నో ఏళ్ల జాప్యం తర్వాత ఆరేళ్ల క్రితం టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు చేపట్టారు. శిథిలమైన కాల్వలను పటిష్టం చేయడం, తూముల మరమ్మతు, కట్టను పటిష్టం చేయడం తదితర పనులు వంటి పనులు అరకొరగా సాగాయి. ఎతైన ప్రదేశంలో ఉన్నా బోరబండ రిజర్వాయర్ నిండితే జగదేవ్‌పూర్ మండలంలోని పలు చెరువులకు ప్రవాహాపు నీటిని పంపే అవకాశముంది. కానీ ఈ దిశగా కార్యాచరణ రూపొందించడంలో ఇరిగేషన్‌శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున పూడికతీయాల్సి ఉన్నది. ఈ ప్రాజెక్ట్‌కు మాత్రం అధికారులు ‘మిషన్ కాకతీయ’–2లో కేవలం రూ.20 లక్షలు కేటాయించి కాల్వల మరమ్మతు పేరిట నామమాత్రంగా పనులు చేపట్టి చేతులు దులుపుకున్నారు. మరోవైపు చుట్టూ అటవీ ప్రాంతంలో ఉన్న ఈ రిజర్వాయర్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అవకాశాలున్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. సాక్షాత్తూ ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంలో నిధుల కేటాయింపునకు ఇబ్బందులు లేకున్నా నీటిపారుదల శాఖ అధికారులకు పట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అనుసంధానానికి ప్రతిపాదనలు బోరబండ రిజర్వాయర్ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. గజ్వేల్ నియోజకవర్గంలో పూర్తియిన కొండపోచమ్మసాగర్ నుంచి యాదాద్రి జిల్లా తుర్కపల్లికి కాల్వ ద్వారా చెరువులకు సాగునీటిని పంపే ప్రతిపాదనలున్నాయి. ఈ ప్రతిపాదనలు అమలులోకి వస్తే జలాశయానికి కొత్త కళ రానుంది. తుర్కపల్లి కాల్వ అనుసంధానంతో రిజర్వాయర్‌కు పూర్వ వైభవం వస్తుంది. ఎత్తయిన ప్రదేశంలో ఉన్న బోరబండ ద్వారా సమీపంలోని చెరువులను నింపే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. రైతులు ఆందోళన చెందొద్దు. - పవన్, గజ్వేల్ నీటిపారుదల శాఖ డిప్యూటీ ఈఈ -
అక్కరకు రాని వర్షాలు లెక్కలోకా?
మచిలీపట్నం : అక్కరకు రాని వర్షాలు లెక్కలోకి తీసుకున్న ప్రభుత్వం కరువు మండలాల ప్రకటనలో వివక్ష చూపించింది. జూన్ మొదట్లో కురిసిన వర్షాలు ఖరీఫ్ సాగుకు ఏమాత్రం ఉపయోగపడకపోయినా.. వాటినీ ప్రాతిపదికగా తీసుకోవటంపై అన్నదాతలు పెదవి విరుస్తున్నారు. దీనివల్ల పంటలకు నష్టపరిహారం మంజూరుకాక నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా అందని పరిహారం... కరువు ప్రాంతాలుగా గుర్తించిన మండలాల్లో రైతులు తీసుకున్న రుణాలు రీషెడ్యూలు చేసి కేంద్ర ప్రభుత్వం ఆయా పంటలకు నష్టపరిహారాన్ని అందించాలి. కరువు మండలాల్లో ఎకరం వరికి రూ.6 వేలు చొప్పున పంట నష్టపరిహారంగా చెల్లించాలి. పంట నష్టం జరిగినట్లు లేదా కరువు మండలాలుగా ప్రకటించినప్పుడు రికార్డులు రాయడమే తప్ప పరిహారం సకాలంలో అందించిన దాఖలాలు లేవు. మూడేళ్లుగా ఈ పరిస్థితి ఉన్న నేపథ్యంలో మళ్లీ కరువు మండలాల ప్రకటన వెలువడింది. మునుపెన్నడూ లేని విధంగా జిల్లాలో కరువు ఛాయలు అలముకున్నాయి. ఖరీఫ్ ప్రారంభంలో వర్షాలు కురవక రైతులు ఇక్కట్లపాలయ్యారు. అష్టకష్టాలు పడి సాగుచేసిన పైరును కాపాడుకుంటే పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షం కురిసి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అనావృష్టి, అతివృష్టి కారణంగా రైతులు నష్టపోయారు. ఈ తరుణంలో ఈ నెల 21న ప్రభుత్వం జిల్లాలో 14 కరువు మండలాలను గుర్తిస్తూ జీవో నంబరు ఒకటిని జారీ చేసింది. వర్షాభావం తదితర కారణాలతో ఖరీఫ్‌లో పంటలు సాగు చేసుకోలేని రైతులకు, చేసినప్పటికీ నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం సకాలంలో ఇస్తే రబీ సీజన్లో పంటలు వేసుకునేందుకు కొంతమేర ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. అయితే ఈ పరిహారం ఎప్పటిలోగా అందిస్తారనేది ప్రశ్నార్థకమే. ప్రకటించింది పద్నాలుగే... జిల్లాలో 14 ప్రాంతాలను కరువు మండలాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఈ నెల 21న ఉత్తర్వులు జారీ చేసింది. పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, నందివాడ, చందర్లపాడు, జగ్గయ్యపేట, వత్సవాయి, నూజివీడు, బాపులపాడు, గన్నవరం, విస్సన్నపేట, తిరువూరు, ఎ.కొండూరు, గంపలగూడెంలను కరువు మండలాలుగా ప్రకటించారు. వర్షపాతం తక్కువగా నమోదైనప్పటికీ ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, కంకిపాడు, ఆగిరిపల్లి, పమిడిముక్కలలను కరువు మండలాలుగా ప్రకటించలేదు. ఈ విషయంపై వ్యవసాయాధికారులను ప్రశ్నించగా.. వర్షాభావం ఒక్కటే కాదని, పంటలు సాగు చేసిన విస్తీర్ణం, ఆ పంటల పరిస్థితి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని కరువు మండలాలను ప్రకటిస్తారని చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షం నమోదైంది. దీంతో చేతికొచ్చే దశలో ఉన్న వరి నేలవాలి నీటిలో మునిగిపోయింది. రైతులు నష్టాలపాలయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఈ ప్రభావం ఉండగా కేవలం 14 కరువు మండలాలను ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చే రాయితీలు నష్టపోయిన రైతులకు అందని పరిస్థితి నెలకొంది. పంటలు కోల్పోయిన రైతులను ఆదుకునేందుకు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కరువు మండలాల జాబితాను రూపొందించాలనే వాదన రైతుల నుంచి వినిపిస్తోంది. -
కరువు మండలాలే ప్రధానం
నెల్లూరు(రెవెన్యూ): జిల్లాలో ఈ ఏడాది వర్షపాతం 45 శాతం తక్కువ నమోదైంది. జిల్లాలోని 46 మండలాల్లోనూ కరువు ప్రభావం ఉంది. భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మాత్రం కేవలం 7 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించింది. వాటిని పెంచే విధంగా చూడటంతో పాటు జిల్లాను పట్టిపీడిస్తున్న అనేక సమస్యలను సీఎం దృష్టికి తీసుకుపోనున్నట్లు కలెక్టర్ జానకి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో విజయవాడలో బుధవారం 13 జిల్లాల కలెక్టర్లతో ప్రీబడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు జిల్లా కలెక్టర్ జానకి మంగళవారం రాత్రి బయలుదేరి వెళ్లారు. జిల్లాకు సంబంధించి సమగ్ర వివరాలను సిద్ధం చేసుకొని వెంట తీసుకుని వెళ్లారు. జిల్లా కలెక్టర్ ఎం. జానకి ప్రధానంగా 7 ఆంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా కరువు మండలాల పెంపుపై మాట్లాడనున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, డంపింగ్‌యార్డులు, ఇసుక విక్రయాలు, గ్రామీణ ప్రాంతాల్లో పౌష్టికాహారం, పర్యాటక అభివృద్ధి తదితరాలపై కలెక్టర్ చర్చించనున్నారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. రైతులు సోమశిల ప్రాజెక్టు నుంచి విడుదల చేస్తున్న నీటితో పంటలు సాగుచేస్తున్నారు. జిల్లాలో ఉన్న 90 శాతం చెరువుల్లో నీరులేదు. వచ్చేది ఎండాకాలం..కాబట్టి ముందస్తు చర్యలు చేపట్టకపోతే ప్రజలు మంచినీటికి నానా అవస్థలుపడవలసి వస్తుంది. వందల సంఖ్యలో బోర్లు మరమ్మతులకు గురయ్యాయి. ఎండకాలంలోపు వాటికి మరమ్మతులు చేపట్టాలి. మంచినీటి ఎద్దడి నివారించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందో లేదో చూడాలి. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వనరులు ఉన్నాయి. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటుచేయడానికి ఇతర దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ముందుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో భూముల గుర్తింపుపై చర్చించే అవకాశం ఉంది. రైతులకు మద్దతు ధర కల్పించేలా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలని కోరనున్నారు. ఇసుక విక్రయాలు, సామాజిక పింఛన్లు, చంద్రన్న సంక్రాంతి కానుక తదితర అంశాలపై చర్చించనున్నారు. ఆదేవిధంగా ఏపీ ప్రభుత్వం సంక్రాంతి పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వనున్నారని తెలిసింది. గ్రామీణ ప్రాంతాలలో కబడ్డీ, ముగ్గుల పోటీలు తదితర వాటిని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.